
అష్టదేవతల తీర్థయాత్ర స్పెషల్
రాజమహేంద్రవరం డిపో నుంచి ప్రారంభం
రాజమహేంద్రవరం సిటీ: ఆషాఢమాసాన్ని పురష్కరించుకుని రాజమహేంద్రవరం ఆర్టీసీ బస్సు డిపో నుంచి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని అష్టదేవతల ఆలయాలు సందర్శనకు ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు డిపో మేనేజర్ కె.మాధవ్ తెలిపారు. శుక్రవారం ఆర్టీసీ డిపో నుంచి 50 మంది భక్తులతో బయలుదేరిన ప్రత్యేక బస్సు అష్ట దేవతల ఆలయాల దర్శనం అనంతరం రాత్రి 8 గంటలకు డిపోకు చేరుకుంటుందన్నారు. ఒక్క రోజులో పూర్తయ్యే ఆ యాత్రలో కడియపులంక, చింతలూరు, మట్లపాలెం, కోవూరు వారాహిమాత, పిఠాపురం, తాటిపర్తి, పెద్దాపురం, కాండ్రకోట ఆలయాల దర్శనం అనంతరం తిరిగి రాజమహేంద్రవరం చేరుకుంటుందన్నారు. 18వ తేదీ శుక్రవారం మరికొన్ని ఆషాఢ మాసం అష్ట దేవతల బస్సులు నడిపేందుకు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రత్యేక బస్సుల్లో టిక్కెట్లు అవసరమైన భక్తులు 95023 00189, 73829 12141 నంబర్లను సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో డిపో అసిస్టెంట్ మేనేజర్ అజయ్ బాబు తదితరులు పాల్గొన్నారు.
ఓడలరేవు కేంద్రీయ విద్యాలయ భూసేకరణకు రూ.3.30 కోట్లు
అల్లవరం: మండలం ఓడలరేవు గ్రామంలో కేంద్రీయ విద్యాలయ నిర్మాణానికి 7.50 ఎకరాల భూసేకరణకు రూ.3.30 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని ఎంపీ గంటి హరీష్ బాలయోగి తెలిపారు.ఎన్నో ఏళ్లుగా కోనసీమ వాసులు ఎదురుచూస్తున్న కేంద్రీయ విద్యాలయ కల సాకారం అవుతోందని తెలిపారు. మన ప్రాంతంలోని మత్స్యకార కుటుంబాలు, వ్యవసాయ కార్మికులు తదితర రంగాలలో పనిచేస్తున్న ఉద్యోగుల పిల్లలకు స్థానికంగా ఉన్నతమైన సీబీఎస్‌ఈ విద్యను అందించే అవకాశం కల్పిస్తుందని హరీష్ అన్నారు.
మహిళపై బ్లేడుతో దాడి
కాకినాడ క్రైం: కాకినాడ జగన్నాథపురానికి చెందిన గౌస్ మొహిద్దీన్ అనే వ్యక్తి కొన్నేళ్లుగా ఓ మహిళతో సహజీవనం చేస్తున్నాడు. అతడి ప్రవర్తన నచ్చక ఆమె అతడికి దూరంగా ఉండగా కక్ష పెంచుకున్న మొహిద్దీన్ శుక్రవారం సాయంత్రం జగన్నాథపురం సమీపంలో ఉన్న జమ్మి చెట్టు వద్ద ఆమైపె బ్లేడుతో దాడికి పాల్పడి ముఖంపై లోతైన గాయాలు చేశాడు. రక్తమోడుతున్న బాధితురాలు కాకినాడ జీజీహెచ్‌లో చేరింది. కాకినాడ వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.