
భక్తుల సౌకర్యాలే లక్ష్యంగా పనిచేస్తున్నాం
● భక్తుల సూచనలు పాటించి
సమస్యలు పరిష్కరిస్తాం
● డయల్ యువర్ ఈవోలో
డీసీ అండ్ ఈఓ చక్రధరరావు
కొత్తపేట: వాడపల్లి శ్రీ, భూ సమేత వేంకటేశ్వరస్వామి ఆలయంలో భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం కలిగేలా భక్తుల సూచనలు పాటిస్తూ, సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్టు దేవదాయ, ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్య చక్రధరరావు తెలిపారు. భక్తుల సూచనలు, సలహాలు తీసుకునేందుకు, వారి సమస్యలు తెలుసుకునేందుకు శుక్రవారం శ్రీడయల్ యువర్ ఈవోశ్రీ నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన సుమారు 40 ఫోన్ కాల్స్‌లో కొందరు భక్తులు ఆలయంలో వసతులపై సంతృప్తి వ్యక్తం చేయగా మరికొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తూ పలు సూచనలిచ్చారు. హైదరాబాద్, తాడేపల్లిగూడెం నుంచి ఫోన్ చేసిన భక్తులు పార్కింగ్ సమస్యలను, శనివారం రోజు వచ్చే భక్తులకు అరిటాకులో భోజనం పెట్టాలని కోరారు. దీనికి డీసీ స్పందిస్తూ ప్రతి శనివారం 20 వేల నుంచి 25 వేల మందికి ప్లేట్లలో అన్నప్రసాదం అందిస్తున్నామని, వకుళమాత అన్నదాన భవన నిర్మాణం పూర్తి కాగానే టేబుళ్లు ఏర్పాటు చేసి ఒకేసారి 3,500 మందికి వడ్డించేలా చర్యలు తీసుకుంటున్నామని, అప్పుడు అరటి ఆకులో భోజనం పెడతామని పేర్కొన్నారు. వచ్చే ప్రతి భక్తుడు స్వామివారిని కనులారా దర్శించి, సంతృప్తి చెందేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. దానిలో భాగంగా ఫ్లైఓవర్ ఏర్పాటు, క్యూలైన్లో తాగునీరు సదుపాయం, చిన్నపిల్లలకు బిస్కెట్లు పంపిణీ చేస్తున్నామన్నారు. ఆలయం లోపల సెక్యూరిటీ సిబ్బందిని పెంచడంపై భక్తుల సలహాను పాటిస్తామన్నారు.