
ధర గెలవలేదు
ఉపాధికి విఘాతం
జిల్లాలో అరటి సాగుపై రైతులు 8వేల మంది ఆధారపడితే వీటిని నమ్ముకున్న కూలీలు, వెదురు వేసే కూలీలు, గెలలకు అరటి ఆకులు చుట్టే కూలీలు, అరటి గెలలను కోసే కూలీలు, అరటి వ్యాపారస్తులు సుమారు 30 వేల మంది ఉన్నారు. మార్కెట్టులో ధరలు తగ్గటం వలన వీరందరికి ఉపాధి లేకపోవటంతో వారి కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాయి. గత మేనెలలో అరటి కోతకు వెళ్లిన కూలీలకు రోజుకి రూ.500 నుంచి రూ.1,500 వచ్చేదని నేడు కూలి పనులు దొరకడం లేదని వాపోతున్నారు.
● అరటి రేటు పతనంతో నష్టాలు
● మే నెలలో 10 టన్నుల లారీ
రూ.2 లక్షలు.. నేడు రూ.90 వేలు
● ముందుకురాని వ్యాపారులు
● గతంలో 100 లారీల ఎగుమతి.. నేడు 40కి పరిమితం
● జిల్లాలో 7,500 హెక్టార్లలో సాగు
● 38 వేల మందికి ఉపాధి
పెరవలి: మార్కెట్టులో అరటి ధరలు భారీగా పతనం అవ్వటంతో రైతులు గగ్గోలు పెడుతుండగా, వ్యాపారస్తులు నష్టాల ఊబిలో కూరుకుపోయారు. మే నెలలో 10 టన్నుల లారీ రూ.2 లక్షల ధర పలుకగా ప్రస్తుతం మార్కెట్టులో 10 టన్నుల లారీ రూ.90 వేలకు పడిపోవటంతో రైతులు, వ్యాపారస్తులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. నాడు జిల్లా నుంచి రోజూ 100 లారీలు ఎగుమతులు అయితే నేడు 30 నుంచి 40 లారీలే ఇతర రాష్ట్రాలకు ఎగుమతులు అవుతున్నాయి. దీంతో రైతులు స్వచ్ఛందంగా పక్వానికి వచ్చిన అరటి గెలలను మార్కెట్టుకు తరలించి అయినకాడికి అమ్ముకుంటున్నారు.
6 వేల హెక్టార్లలోనే దిగుబడి
జిల్లాలో అన్ని రకాల అరటి 7,500 హెక్టార్లలో సాగు అవుతోంది. ముఖ్యంగా జిల్లాలో పెరవలి, నిడదవోలు, ఉండ్రాజవరం, నల్లజర్ల, చాగల్లు, కొవ్వూరు, దేవరపల్లి, గోపాలపురం, తాళ్ళపూడి, సీతానగరం, రాజానగరం, అనపర్తి మండలాల్లో ఈ సాగు ఎక్కువగా చేస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో 6 వేల హెక్టార్లలో తోటలు దిగుబడి ఇస్తున్నాయి. కానీ ఇతర రాష్టాలకు ఎగుమతులు తగ్గటంతో స్థానిక మార్కెట్‌లో అమ్ముకునే దుస్థితి ఏర్పడటంతో ధరలు మరింత పతనం అవుతున్నాయి.
తోటలను వదిలేస్తున్న వ్యాపారస్తులు
అరటి మార్కెట్టులో జూన్ నెల నుంచి ధరలు పతనం అవుతూ వస్తున్నాయి. ప్రస్తుతం కర్పూర అరటి మార్కెట్టులో 10 టన్నుల లారీ రూ.90 వేలు పలకటంతో రైతులు, వ్యాపారస్తులు గగ్గోలు పెడుతున్నారు. చేల వద్దకు వ్యాపారస్తులు రాకపోవటంతో రైతులు దిక్కుతోచని స్థితిలో అల్లాడిపోతున్నారు. ధర పతనంతో అరటి తోటలను కొనుగోలు చేసే వ్యాపారస్తులే కరవయ్యారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పక్వానికి వచ్చిన గెలలను కోయకపోతే పండిపోయి మొత్తం పంట పాడైపోతుందని దీనితో కొనే నాథుడే లేకుండా పోతారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చక్కెర కేళీ గెల ఒకటి రూ.250, ఎర్ర చక్కెర కేళీ గెల ఒకటి రూ.300 పలకటంతో వాటిని కొనుగోలు చేసిన వ్యాపారస్తులు తీవ్ర నష్టాలు పాలయ్యారు. ఎందుకంటే తోటలను కొనుగోలు చేసినప్పుడు చక్కెర కేళీ గెల ఒకటి రూ.250 నుంచి రూ.300 కొనుగోలు చేయగా, ఎర్ర చక్కెర కేళీ గెల ఒకటి రూ.300 నుంచి రూ.400కు కొనుగోలు చేశారు. కానీ మార్కెట్టులో కొనుగోలు చేసిన ధర లభించకపోవటంతో వ్యాపారస్తులు తోటలను వదలివేస్తున్నారు. మార్కెట్టులో ధరలు పతనం అవ్వటంతో రైతులే మార్కెట్టుకు అరటి గెలలను సైకిళ్లు, మోటారు సైకిళ్లపై తరలించి అమ్ముకుంటున్నారు. మార్కెట్టులో సైకిల్‌లోడ్ (6 గెలలు) కర్పూర అయితే నాణ్యతను బట్టి రూ.1,000 నుంచి రూ.1,400లు, చక్కెర కేళీ రూ.1,500 నుంచి రూ.2000కు, ఎర్ర చక్కెర కేళీ రూ.2,000 నుంచి రూ.2,500 ధరలు పలుకుతున్నాయి.
తగ్గిన ఎగుమతులు
జిల్లాలో అరటి ఎగుమతులు నెల రోజులుగా తగ్గిపోయాయి. గతంలో ఇతర రాష్ట్రాలైన ఒడిశా, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, బిహార్ రాష్ట్రాలకు ప్రతి రోజూ 80నుంచి 100 లారీల సరకు ఎగుమతి అవ్వగా నేడు ఎగుమతులు 30 నుంచి 40 లారీలకు పడిపోయాయి. గతంలో బెంగాల్‌లో అరటి సాగు ఉండేది కాదు. నేడు అక్కడ ఇతర రాష్టాలకు ఎగుమతులు చేసే స్థాయికి సాగు రావటంతో ఎగుమతులు తగ్గాయి. ఒడిశాలో నెల రోజులుగా విపరీతమైన వర్షాలు కురవటంతో వినియోగం తగ్గి ఎగుమతులు మందగించాయి. తమిళనాడులో సరకు విపరీతంగా ఉండటంతో అక్కడికి ఎగుమతులు అంతంతమాత్రంగానే ఉన్నాయి. దీని ప్రభావంతో అరటి ధరలు పతనం అవుతున్నాయి.
కొనే నాథుడు లేక..
గత ఏడాది కరోనా సమయంలో ఎగుమతులు లేక ఇబ్బందులు పడితే, నేడు కొనుగోలు చేసేవారు కరువవడంతో నానా పాట్లూ పడుతున్నాం. తోటలు కొనే నాథుడు లేక సైకిళ్లు, మోటారు సైకిళ్లపై మార్కెట్టుకు తరలించి అయిన కాడికి అమ్ముకుంటున్నాం. – యాతం మల్లికార్జునరావు,
అరటి రైతు, అన్నవరప్పాడు
గెలలు కోయటమే మానేశారు
తోటలు అమ్మినప్పుడు ధరలు బాగానే ఉన్నాయి. ఒక్కో గెల ధర రూ.250కి అమ్మాను. కానీ వ్యాపారస్తులు సగం తోట కోసిన తరువాత ధరలు పతనం అవ్వటంతో గెలలు కోయటమే మానేశారు. దీంతో నష్టాలు పాలవుతున్నాం.
– కాపకా పాపారావు, అరటి రైతు, కాకరపర్రు
రైతులకు తప్పని నష్టాలు
ఈ ఏడాది ప్రారంభంలో ధరలు బాగానే ఉన్నాయి. ఈ ఏడాది జూన్ నుంచి ధరలు తగ్గటంతో వ్యాపారస్తులు తోటలను అయిన కాడికి అడుగుతున్నారు. దీంతో ఈ సాగు చేస్తున్న రైతులు నష్టాల పాలవ్వక తప్పటం లేదు.
– సంఖు ప్రభాకరరావు, అరటి రైతు, మల్లేశ్వరం

ధర గెలవలేదు

ధర గెలవలేదు

ధర గెలవలేదు