
పెరుగుతున్న గోదావరి వరద
● అప్రమత్తమైన ఇరిగేషన్ యంత్రాంగం
● ఆదివారం నాటికి 8లక్షల
క్యూసెక్కుల మిగులు జలాలు
విడుదలయ్యే అవకాశం
ధవళేశ్వరం: కాటన్ బ్యారేజీ వద్ద వరద గోదావరి క్రమేపీ పెరుగుతుంది. శుక్రవారం సాయంత్రం కాటన్ బ్యారేజీ వద్ద 9.70 అడుగులకు నీటి మట్టం చేరింది. ఎగువ నుంచి వచ్చి చేరుతున్న నీటిని ఎప్పటికప్పుడు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. బ్యారేజీ నుంచి 3,54,341క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి వదిలారు. ఎగువ గోదావరి పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో గోదావరి ఉపనది ప్రాణహిత పొంగి పొర్లుతోంది. దీంతో కాటన్ బ్యారేజీ వద్ద నీటి ఉధృతి శనివారం మరింత పెరిగే అవకాశం ఉందని ఇరిగేషన్ అధికారులు అంచనా వేస్తున్నారు. ఆదివారం సాయంత్రానికి ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద 8లక్షల క్యూసెక్కుల మిగులు జలాలు దాటి ప్రవహించే అవకాశం ఉందని ఇరిగేషన్ అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో అప్రమత్తమైన ఇరిగేషన్ యంత్రాంగం ధవళేశ్వరం ఫ్లడ్ కంట్రోల్ రూమ్ నుంచి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తోంది. గోదావరి డెల్టా కాలువకు సంబంధించి 13,750 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఇందులో తూర్పు డెల్టాకు 4,800, మధ్య డెల్టాకు 2,450, పశ్చిమ డెల్టాకు 6,500 క్యూసెక్కుల నీటిని వదిలారు. గోదావరి ఎగువ ప్రాంతాలకు సంబంధించి కాళేశ్వరంలో 11.79 మీటర్లు, పేరూరులో 15.42 మీటర్లు, దుమ్ముగూడెంలో 10.86 మీటర్లు, భద్రాచలంలో 37.20 అడుగులు, కూనవరంలో 13.60 మీటర్లు, కుంటలో 14.72 మీటర్లు, పోలవరంలో 9.01 మీటర్లు, రాజమహేంద్రవరం రైల్వే బ్రిడ్జి దగ్గర 13.88 మీటర్ల వద్ద నీటి మట్టాలు కొనసాగుతున్నాయి.