
మహిళలు, బాలికలపై దాడులు అరికట్టేందుకు ప్రణాళిక
రాజమహేంద్రవరం రూరల్: జిల్లాలో మహిళలు, బాలికలపై జరిగే దాడులు అరికట్టేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించి, వారికి అన్ని విధాలా అండగా నిలుస్తున్నామని, శక్తి టీమ్‌ల ద్వారా అందుబాటులో ఉంటున్నామని ఎస్పీ డి.నరసింహకిషోర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో మహిళల రక్షణ కోసం వుమెన్స్ హాస్టళ్లలో ప్రతిచోటా పాయింట్ బుక్స్ పెట్టి తరచుగా శక్తి టీమ్‌లు సందర్శిస్తున్నట్టు చెప్పారు. మహిళలు, బాలికల స్కూళ్లు, కాలేజీలు, హాస్టల్స్ వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, సరైన నడవడిక కలిగిన వార్డెన్లను ఏర్పాటు చేసేలా, యాజమాన్యాలకు అవగాహన కార్యక్రమం నిర్వహించామన్నారు. రాత్రి సమయాలలో అసాంఘిక శక్తులను అరికట్టేందుకు ఆరు స్పెషల్ టీంలను ఏర్పాటు చేశామన్నారు. విద్యాసంస్థల వద్ద ఉదయం, సాయంత్రం సమయాలలో ఈవ్ టీజింగ్ జరగకుండా శక్తి టీం, డ్రోన్లతో ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేశామన్నారు. పబ్లిక్ అండ్ పోలీస్‌తో సంయుక్తంగా జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో సమాచారాన్ని సులువుగా మార్పిడి చేసుకునే విధంగా సుమారు 100 వాట్సాప్ గ్రూపులను క్రియేట్ చేశామన్నారు. జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో బహిరంగ ప్రదేశాలు, గోదావరి నది పరీవాహక ప్రాంతాలు, పాడు పడిపోయిన ఇళ్లు, తోటలపై డ్రోన్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశామన్నారు. ఆయా ప్రాంతాల్లో బహిరంగంగా మద్యం సేవించడం, గంజాయి వినియోగం, పేకాట, ఈవ్ టీజింగ్, చైన్ స్నాచింగ్ నేరాలు జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకున్నామని ఎస్పీ నరసింహకిషోర్ తెలిపారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 42 మహిళలు, చిన్నపిల్లల మిస్సింగు కేసులను గంటల వ్యవధిలోనే ఛేదించామని తెలిపారు.