
షంపద సృష్టికి పర్మిట్!
సాక్షి, రాజమహేంద్రవరం: సంపద సృష్టించేందుకు కూటమి సర్కారు అడ్డదారులు తొక్కుతోందా..? మద్యం దుకాణాల పక్కన పర్మిట్ రూమ్‌లకు అనుమతులు ఇచ్చి రూ.కోట్లు కొల్లగొట్టేందుకు సన్నాహాలు ప్రారంభించిందా..? తద్వారా ప్రజలను మరింతగా తాగుడుకు బానిసలు చేసేందుకు కుట్రలు పన్నుతోందా..? అంటే అవుననే సమాధానం వస్తోంది ప్రజల నుంచి. మద్యం షాపులకు అనుగుణంగా పర్మిట్ రూమ్‌లు ఇచ్చేందుకు కూటమి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విచ్చలవిడిగా జరుగుతున్న మద్యం విక్రయాలతో ఇప్పటికే ఇబ్బందులు పడుతున్నామని, ఇక షాపుల పక్కనే తాగిస్తే.. తాగుబోతుల వీరంగాన్ని భరించలేమంటూ ఆందోళన చెందుతున్నారు.
ఇదీ సంగతి..
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నూతన మద్యం పాలసీ తెరపైకి తెచ్చింది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో నడచిన మద్యం షాపులను పూర్తిగా ఎత్తివేసి ప్రైవేటు పేరుతో కూటమి నేతలకు కట్టబెట్టింది. ఇదే అదనుగా భావించిన కూటమి నేతలు రూ.కోట్లు కొల్లగొడుతున్నారు. రూ.లక్షల ఆదాయం ప్రభుత్వానికి వస్తోంది. రూ.99కే క్వార్టర్ మద్యం బాటిళ్లను అందుబాటులోకి తెచ్చి ప్రజలను తాగుబోతులుగా సర్కారు మార్చేసింది.
పర్మిట్ రూమ్‌లకు గ్రీన్ సిగ్నల్
మద్యం ద్వారా ప్రస్తుత ఆదాయం చాలదన్నట్లు మరింతగా పెంచుకునేందుకు అడుగులు వేస్తోంది. మద్యం దుకాణాల వద్దే పర్మిట్ రూమ్‌లకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. మద్యం విక్రయాల ద్వారా వస్తున్న ఆదాయాన్ని పెంచుకునే క్రమంలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఉన్న పర్మిట్ రూమ్‌ల విధానాన్ని తిరిగి ప్రవేశ పెట్టేందుకు ఎకై ్సజ్ శాఖ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఇందుకు అవసరమైన కసరత్తు ఇప్పటికే పూర్తి చేసింది. ఈ నెలాఖరులోపు దుకాణాల వద్ద పర్మిట్ రూమ్‌ల ఏర్పాటుకు అనుమతులు ఇవ్వాలని ఎకై ్సజ్ శాఖ భావిస్తోంది. ఆ దిశగా ప్రభుత్వం ఇప్పటికే అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు సైతం జారీ చేసింది.
జిల్లాలో రూ.62 కోట్ల ఆదాయం
తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా 125 మద్యం షాపుల నిర్వహణకు అబ్కారీ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికి అనుబంధంగా ఒక్కో షాపునకు ఒక్కో పర్మిట్ రూమ్ చొప్పున 125 సిట్టింగ్ కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి. పర్మిట్ రూమ్‌లకు ప్రభుత్వం ధర నిర్ణయించింది. కార్పొరేషన్, మున్సిపాలిటీ పరిధిలో మద్యం షాపునకు అనుగుణంగా ఏర్పాటు చేసుకునే పర్మిట్ రూమ్‌కు రూ.7.50 లక్షలు, ఇతర ప్రాంతాల్లోని పర్మిట్ రూమ్‌లకు రూ.5 లక్షల చొప్పున ఫీజును ప్రభుత్వం ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం. సగటున ఒక్కో షాపునకు రూ.5 లక్షలు వసూలు చేసినా.. ప్రభుత్వానికి అదనంగా రూ.62 కోట్ల ఆదాయం ఏటా సమకూరనుంది. గతంలో టీడీపీ అధికారంలో ఉండగా.. అన్ని పర్మిట్ దుకాణాలకు ఏడాదికి రూ.5 లక్షలు పర్మిట్ రూమ్ ఫీజుగా ఉండేది. ఇప్పుడు దానిని రెండు కేటగిరీలుగా మార్పు చేస్తున్నారు. దుకాణాల పక్కన పర్మిట్ రూమ్‌లకు అవకాశం కోసం మద్యం దుకాణ యజమానులు ఇప్పటికీ ప్రయత్నాలు చేస్తున్నారు.
నూతన పాలసీతో ఇప్పటికే రూ.కోట్లలో ఆదాయం
నూతన మద్యం పాలసీతో ఇప్పటికే ప్రభుత్వ ఖజానాకు రూ.కోట్లల్లో ఆదాయం లభించింది. జిల్లా వ్యాప్తంగా 125 షాపులకు 4,384 దరఖాస్తులు అందాయి. ఒక్కో టెండర్‌కు రూ.2 లక్షలు వసూలు చేశారు. అంటే రూ.87.68 కోట్ల ఆదాయం వచ్చింది. షాపులు దక్కించుకున్న వ్యాపారులు ఆరు విడతల్లో లైసెన్సు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. వార్షిక లైసెన్సు ఫీజులో 1/6 వంతు చెల్లించారు. దీని ద్వారా రూ.14.85 కోట్ల ఆదాయం వచ్చింది.
మద్యం విక్రయాల్లోనూ దూకుడే..
మద్యం షాపుల ద్వారానే కాకుండా.. మద్యం విక్రయాల్లోనూ ప్రభుత్వానికి రూ.కోట్లల్లో ఆదాయం సమకూరుతోంది. రాజమహేంద్రవరం రూరల్ ఐఎంఎల్ డిపో పరిధిలో తూర్పుగోదావరి జిల్లాలోని రాజానగరం, రాజమహేంద్రవరం సిటీ, రూరల్, అల్లూరిసీతారామరాజు, కోనసీమ జిల్లాల పరిధిలోని 134 మద్యం షాపులు, 27 బార్ అండ్ రెస్టారెంట్లకు మద్యం, బీర్లు సరఫరా చేస్తున్నారు. ప్రతి నెలా దాదాపుగా 1.17 లక్షల వివిధ రకాల మద్యం కేసులు, 44,300 బీర్ కేసులు సరఫరా చేస్తుంటారు. వీటి విలువ రూ.103 కోట్లు.
● చాగల్లు ఐఎంఎల్ డిపో పరిధిలో తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు, గోపాలపురం, నిడదవోలు, పశ్చిమగోదావరి జిల్లా భీమవరం, ఏలూరు పరిధిలో 111 షాపులు, 10 బార్లకు మద్యం సరఫరా అవుతోంది. ప్రతి నెలా సుమారు 43,743 మద్యం కేసులు, 13,354 బీర్ కేసులు సరఫరా చేస్తున్నారు. వీటి ద్వారా రూ.కోట్లలో ఆదాయం లభిస్తోంది.
తాగినోళ్లకు తాగినంత..
ఇప్పటికే మద్యం అక్రమ విక్రయ దందా బెల్టు షాపులే కేంద్రంగా నడుస్తోంది. సింహభాగం మద్యం షాపులను హస్తగతం చేసుకున్న కూటమి నేతల సిండికేట్ మద్యం దుకాణాలకు అనుగుణంగా బెల్టు షాపులు తెరిచింది. పట్టణం, పల్లె అన్న తేడా లేకుండా ఎక్కడికక్కడ దుకాణాలు వందల సంఖ్యలో వెలిశాయి. అనధికారిక విక్రయాల కోసం ఏకంగా వేలం పాటలు నిర్వహించి మరీ ఎవరు ఎక్కడ విక్రయించాలో సిండికేటే నిర్ధారించింది. ఒక్కో బెల్ట్ షాపునకు డిపాజిట్‌గా ఆ ప్రాంతం, వ్యాపారాన్ని బట్టి రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు డిపాజిట్ వసూలు చేశారు. మద్యం దుకాణాలు లేని ప్రధాన కూడళ్లలో, మారుమూల గ్రామాల్లో బెల్ట్‌షాపులు, డోర్ డెలివరీ మద్యం విక్రయాలు జోరందుకున్నాయి. గుడి, బడి అన్న తేడా లేకుండా ఎక్కడ పడితే అక్కడ విక్రయించేస్తున్నారు. మద్యం దుకాణం దక్కించుకున్న వ్యాపారే సరుకు ఇస్తుండటంతో బెల్ట్ షాప్ నిర్వాహకులు తమకు ఇష్టమొచ్చిన ధరకు విక్రయిస్తున్నారు. బహిరంగంగానే రాత్రి, పగలు తేడా లేకుండా మద్యం విక్రయాలు సాగుతున్నాయి. శివారు ప్రాంతాలకు సైతం మద్యం దుకాణ యజమానులు సరకు సరఫరా చేస్తున్నారు. దీనికితోడు ప్రభుత్వం నేరుగా పర్మిట్ రూమ్‌లకు అనుమతులు ఇస్తుండటంతో అసాంఘిక కార్యక్రమాలు విస్తృతంగా జరిగే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తప్పతాగి మహిళల పట్ల దురుసుగా ప్రవర్తించే పరిస్థితి తలెత్తుతుందన్న వాదన వినిపిస్తోంది. ప్రభుత్వం ధనార్జనే ధేయ్యంగా షాపుల వద్దే కూర్చోబెట్టి తాగించే ఏర్పాట్లు చేస్తుండటంపై ప్రజలు మండిపడుతున్నారు.
ఇప్పటికే ఏరులై పారుతున్న మద్యం
అనధికారిక బెల్ట్ షాపులతో
విచ్చలవిడిగా విక్రయాలు
వాటిని ఇంకా పెంచేందుకు
కూటమి ప్రభుత్వం అడుగులు
మద్యం షాపుల వద్ద పర్మిట్
రూములకు గ్రీన్ సిగ్నల్
గొడవలకు ఆజ్యం పోసేలా ప్రభుత్వ నిర్ణయాలు
ఆందోళనలో సమీప ప్రజలు
సంపద సృష్టించడమంటే ఇదేనా..?
అని మండిపాటు

షంపద సృష్టికి పర్మిట్!

షంపద సృష్టికి పర్మిట్!