కంబాలచెరువు (రాజమహేంద్రవరం): సంపూర్ణమైన వికాసానికి పేరెంట్ టీచర్స్ మీటింగ్ చక్కటి వేదిక అని ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి పేర్కొన్నారు. స్థానిక కోటిపల్లి బస్టాండ్ సమీపంలోనున్న ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో గురువారం జరిగిన మెగా పీటీఎంకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మంచి పౌరులుగా విద్యార్థుల్ని తీర్చి దిద్దే బాధ్యత తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తీసుకోవాలన్నారు. పిల్లల్లో ఉన్న ప్రతిభను గుర్తించి ప్రోత్సాహం అందిస్తే చక్కటి ఫలితాలు సాధించడం సాధ్యమవుతుందన్నారు. డీఈఓ కే.వాసుదేవరావు, ప్రధానోపాధ్యాయురాలు శారదాదేవి, జిల్లా అధ్యక్షుడు పక్కి నాగేంద్ర, పేరెంట్ కమిటీ సభ్యులు, విద్యార్థులు, తల్లితండ్రులు, సంరక్షకులు పాల్గొన్నారు.
విద్యుత్ స్మార్ట్ మీటర్లు వద్దు
● మాజీ ఎంపీ హర్షకుమార్
● రిలే దీక్ష చేపట్టిన డీసీసీ అధ్యక్షుడు విశ్వేశ్వరరెడ్డి
రాజమహేంద్రవరం సిటీ: రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ స్మార్ట్ మీటర్లు బిగించడం తక్షణం నిలిపివేసి, ఆదానీ సంస్థతో చేసుకున్న విద్యుత్ ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ డిమాండ్ చేశారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో స్మార్ట్ మీటర్లను వ్యతిరేకిస్తూ స్థానిక గోదావరి గట్టు విద్యుత్ శాఖ ఎస్‌ఈ కార్యాలయం ఎదుట గురువారం డీసీసీ అధ్యక్షుడు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి నిరవధిక రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ దీక్ష శిబిరాన్ని ప్రారంభించి సంఘీభావం తెలిపారు. టీకే విశ్వేశ్వర రెడ్డి మాట్లాడుతూ ఇళ్లకు, వ్యాపార సముదాయాలకు విద్యుత్ స్మార్ట్ మీటర్లను బిగించి, కరెంటు బిల్లులు వసూలు ప్రజల జీవన ప్రమాణాలను దివాలా తీస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ వినియోగదారులు ముందస్తుగా రీచార్జ్ చేసుకోవాలనే విధానం చాలా ప్రమాదకరమన్నారు. ఈ ప్రక్రియలో ఉదయం, మధ్యాహ్నం, రాత్రి ఒక్కో రేటు నిర్ణయించారని, ఇది ప్రజలను దోపిడీ చేయడమేనని ధ్వజమెత్తారు. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్, ిీసీపీఐ, సీపీఎం జిల్లా కార్యదర్శులు తాటిపాక మధు, టి.అరుణ్, రాజమండ్రి చాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ అధ్యక్షుడు అశోక్ కుమార్ జైన్ దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం ప్రకటించారు. జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మోతా శారద, పీసీసీ జనరల్ సెక్రటరీ అరిగెల అరుణ కుమారి, కాంగ్రెస్ రాజానగరం మండల కో ఆర్డినేటర్ వై.శ్రీనివాస్ దీక్ష చేపట్టారు.
సంపూర్ణ వికాస వేదిక పీటీఎం