
ఎమ్మెల్యే అనుచరుల నుంచి రక్షణ కల్పించండి
– దళిత మహిళా బాధితురాలి
భర్త కొమ్ము సత్తిబాబు
అనపర్తి : తన భార్య కొమ్ము బుజ్జిపై హత్యాయత్నం చేసిన అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రధాన అనుచరులు దుప్పలపూడి గ్రామానికి చెందిన నల్లమిల్లి వెంకటరెడ్డి(ఎన్వీ), అతని అనుచరుల నుంచి రక్షణ కల్పించాలని బాధిత మహిళ భర్త కొమ్ము సత్తిబాబు అన్నారు. గురువారం పరామర్శకు వచ్చిన ఎమ్మెల్సీ బొమ్ము ఇజ్రాయల్ వద్ద ఆయన తమ గోడు చెప్పుకున్నారు. తనకు జరిగిన అన్యాయాన్ని ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డికి చెప్పకోవడానికి ఉదయం 9గంటలకు రామవరంలోని ఆయన ఇంటికి వెళ్లగా ఎమ్మెల్యే తన వద్ద ఉన్న ఫోన్ లాక్కుని దానిలో ఉన్న ఫొటో, వీడియో ఆధారాలను డిలీట్ చేసి సాయంత్రం ఏడు గంటలకు ఫోన్ తిరిగి ఇచ్చారని సత్తిబాబు ఆరోపించారు. తాను అబద్దం చెప్పడం లేదని ఎక్కడికై నా వచ్చి ప్రమాణం చేస్తానని సత్తిబాబు ఇజ్రాయిల్ వద్ద వాపోయారు. నెల రోజుల క్రితం కుక్కను తప్పించే క్రమంలో తన తోడల్లుడు వీరబాబు వృద్ధుడిని మోటార్ సైకిల్‌తో ఢీకొట్టాడని, ఆయన మృతి చెందడంతో పోలీసులు కేసు నమోదు చేయగా వీరబాబు బెయిల్ పై బయటకు వచ్చారన్నారు. పది రోజులుగా మాజీ సర్పంచ్ కుమారుడు ఎన్వీ విపరీతంగా వేధిస్తున్నాడని దీంతో ఎన్వీ ఇంటికి వెళ్ళగా రూ.2 లక్షలు ఇవ్వకపోతే వీరబాబును చంపేస్తామని బెదిరించారని చెప్పారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్ళిన తన భార్య బుజ్జి, తోడల్లుడు వీరబాబుపై విచక్షణారహితంగా దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సత్తిబాబు డిమాండ్ చేశారు.