
టీడీపీ తీరుపై రోడ్డెక్కిన జనసేన
● సొసైటీ పదవుల్లో అన్యాయం
చేశారని ఆవేదన
● మాజీ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ధర్నా
తాళ్లపూడి (కొవ్వూరు): కొవ్వూరు నియోజకవర్గంలోని కూటమి నాయకుల మధ్య కుంపటి రాజుకుంది. ఇటీవల ప్రకటించిన సొసైటీ చైర్మన్లు, ఇతర కమిటీ సభ్యుల ఎంపికలో జనసేనకు పదవులు ఇవ్వకపోవడంపై ఆ పార్టీ నాయకులు టీడీపీపై మండిపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే, టీడీపీ నాయకుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ గురువారం కొవ్వూరులోని టోల్ గేట్ రోడ్‌కం రైల్ బ్రిడ్జ్జి వద్ద ఆందోళన చేపట్టారు. కొవ్వూరు జనసేన ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని జనసేన నాయకులు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. జనసేనకు ప్రాధాన్యం ఇవ్వాలని నినాదాలు చేశారు. దీంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఈ సందర్భంగా టీవీ రామారావు మాట్లాడుతూ నియోజకవర్గంలో సొసైటీ అధ్యక్ష పదవుల నియామకం విషయంలో తమను సంప్రదించలేదని అన్నారు. ప్రాధాన్యం కల్పించాలని కోరగా అసలు తమను పట్టించుకోలేదని తెలిపారు. వారి మోచేతి కింద నీళ్లు తాగే పరిస్థితి లేదని, తమకు గౌరవం, గుర్తింపు ఇవ్వాలని తేల్చి చెప్పారు. కూటమి లక్ష్యాలు దెబ్బతినే విధంగా ఉన్నాయని అన్నారు. తమను మానసిక క్షోభకు గురిచేశారని అన్నారు. తమను తక్కువగా చూస్తే ఖబడ్దార్ అని హెచ్చరించారు.జనసేన నాయకులు సిద్దా శివరామకృష్ణ, నామన మూరయ్య, ఐతం మణికంఠ, పూలపల్లి బాలకృష్ణ, దూసనపూడి ఆంజనేయులు, సాయన సుబ్బారావు, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.