
రత్నగిరిపై కొనసాగుతున్న భక్తుల అసంతృప్తి
అన్నవరం: సత్యదేవుని సన్నిధికి వస్తున్న భక్తుల్లో ఇంకా అసంతృప్తి కొనసాగుతున్నట్లు గత నెలలో ప్రభుత్వ సర్వేలో వెల్లడైంది. అయితే, మే నెలలో దాదాపు 35 శాతం మంది అసంతృప్తి వ్యక్తం చేయగా ఈసారి అది 25 శాతానికి పరిమితమైంది. మే 26 నుంచి జూన్ 25వ తేదీ వరకూ రాష్ట్రంలోని ఏడు ప్రముఖ దేవస్థానాల్లో భక్తులకు అందుతున్న సేవలపై ప్రభుత్వం సర్వే నిర్వహించింది. అన్నవరం దేవస్థానానికి వచ్చేసరికి సత్యదేవుని దర్శనం విషయంలో మే నెలలో 68 శాతం మంది మాత్రమే సంతృప్తి వ్యక్తం చేయగా జూన్ నెలలో అది 73 శాతానికి పెరిగింది. మౌలిక వసతుల కల్పనలో మే నెలలో 61 శాతం మంది, జూన్‌లో 66 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారు. స్వామివారి గోధుమ నూక ప్రసాదం నాణ్యతపై మే నెలలో 78 శాతం మంది సంతృప్తి చెందగా జూన్‌లో అది 77 శాతంగా నమోదైంది. పారిశుధ్య నిర్వహణకు సంబంధించి మే నెలలో 64 శాతం, జూన్‌లో 70 శాతం మంది సంతృప్తి చెందారు.