
కందిపప్పు.. ఉడకట్లే..
సాక్షి, రాజమహేంద్రవరం: రేషన్ షాపుల్లో కందిపప్పు సరఫరాకు కూటమి ప్రభుత్వం మంగళం పాడిందా.. ఆర్థిక భారం తగ్గించుకునేందుకు క్రమంగా తగ్గిస్తూ వస్తోందా.. అందుకే అధికారం చేపట్టినప్పటి నుంచీ చౌక దుకాణాలకు సక్రమంగా సరఫరా చేయడం లేదా.. అంటే అవుననే సమాధానం వస్తోంది రేషన్ కార్డుదారుల నుంచి.
లబ్ధిదారులకు నిరాశే
ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) ద్వారా పేదలకు నిత్యావసరాలైన కందిపప్పు, బియ్యం, చక్కెర, పామాయిల్‌ను సబ్సిడీ ధరకు ప్రభుత్వం అందజేస్తుంది. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన ఏడాది కాలం నుంచి ఈ వ్యవస్థను నిర్వీర్యం చేసేలా అడుగులు వేస్తోంది. ఇంటింటికీ రేషన్ సరకులు అందించే మొబైల్ డిస్పెన్సరీ యూనిట్లను (ఎండీయూ) తొలగించింది. పది నెలలుగా అవసరమైన మేరకు కందిపప్పు సరఫరా చేయడం లేదు. దీంతో, ప్రతి నెలా కార్డుదారులకు నిరాశే ఎదురవుతోంది. ఈ నెల కూడా కందిపప్పు రాలేదని రేషన్ డీలర్లు చెబుతూండటంతో చేసేది లేక ఇచ్చిన సరకులే తీసుకుని వారు వెనుతిరుగుతున్నారు. ఈ నెలలో ఒక్క కేజీ కూడా సరఫరా చేసిన దాఖలాలు లేవు. కొన్ని నెలల క్రితం బహిరంగ మార్కెట్లో కిలో కందిపప్పు రూ.180 వరకూ పలికింది. ఈ ధర కొన్ని మాసాల పాటు కొనసాగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆ సమయంలో సబ్సిడీ ధరకు కందిపప్పు సరఫరా చేసి ఆదుకోవాల్సిన ప్రభుత్వం చేతులేత్తేసింది. టెండర్లు పిలిస్తే కాంట్రాక్టర్లు అధిక ధరకు కోట్ చేస్తారన్న భయంతో పూర్తిగా పంపిణీకే మంగళం పాడేసింది. అప్పుడు మొదలైన అరకొర సరఫరా నేటికీ కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం మార్కెట్లో కందిపప్పు ధర కిలో రూ.130 ఉంది. రేటు ఎక్కువగా ఉన్నప్పుడు సబ్సిడీపై ఇవ్వలేని ప్రభుత్వం.. కనీసం ధర దిగివచ్చినప్పుడైనా ప్రజలకు అందించేందుకు ముందుకు రావడం లేదు. రేషన్ కార్డుదారులకు సబ్సిడీపై కిలో కందిపప్పు రూ.67కే అందించాలి. ప్రభుత్వం బహిరంగ మార్కెట్‌లో హోల్‌సేల్‌లో కొన్నా కిలో రూ.100కు లభిస్తుంది. అది కొని ప్రజలకు పంపిణీ చేసినా రూ.30కి మించి ప్రభుత్వంపై భారం పడదు. అయినా ఎందుకొచ్చిన తలనొప్పి అన్నట్టుగా సర్కారు మిన్నకుండిపోతోంది.
పేదలపై భారం
జిల్లావ్యాప్తంగా 5 (మండల స్థాయి స్టాక్ (ఎంఎల్‌ఎస్) పాయింట్ల ద్వారా నిత్యావసర సరకులు పంపిణీ చేస్తున్నారు. ప్రస్తుతం ఏ ఒక్క ఎంఎల్‌ఎస్ పాయింటులోనూ కందిపప్పు కిలో కూడా నిల్వ లేకపోవడం గమనార్హం. రేషన్ షాపులు, ఎంఎల్‌ఎస్ పాయింట్లలో కందిపప్పు నిల్వలు నిండుకోవడంతో కార్డుదారులు బహిరంగ మార్కెట్‌లో అధిక ధరలకు కొనాల్సిన దుస్థితి నెలకొంటోంది. దీంతో పేద, మధ్య తరగతి ప్రజలపై భారం పడుతోంది.
జిల్లాలో ఇలా..
రేషన్ డీలర్లు ప్రతి నెలా 20వ తేదీ లోపు డీడీలు తీసి, తమ పరిధిలోని కార్డుదారులకు అవసరమైన బియ్యం, కందిపప్పు, పంచదార తదితర సరకులు దిగుమతి చేసుకుంటారు. కొన్ని నెలలుగా డీలర్లు డీడీలు తీస్తున్నా పౌర సరఫరాల శాఖ మాత్రం అవసరమైన మేరకు కందిపప్పు సరఫరా చేయడం లేదు. జిల్లాకు 564.9 టన్నుల కందిపప్పు అవసరం కాగా, వంద, 150 టన్నులు మాత్రమే సరఫరా చేస్తోంది. దీంతో, కార్డుదారులకు పూర్తి స్థాయిలో కందిపప్పు అందడం లేదు. కందిపప్పు కోసం డీడీలు తీయవద్దని డీలర్లకు అధికారులు ముందుగానే సమాచారం ఇచ్చారు. దీంతో వారు పూర్తి స్థాయిలో డీడీలు కట్టడం మానేశారు. బియ్యం, పంచదారతో పాటు కందిపప్పు కావాలని ప్రజలు అడుగుతూంటే.. తమకే రాలేదని డీలర్లు బదులిస్తున్నారు. ప్రభుత్వ వ్యవహార శైలి చూస్తూంటే రేషన్ షాపుల నుంచి కందిపప్పు పంపిణీని పూర్తిగా ఎత్తివేసేలా ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
పది నెలలుగా సక్రమంగా జరగని సరఫరా
ఈ నెల పూర్తిగా నిలిపివేసిన ప్రభుత్వం
కార్డుదారులకు అవస్థలు
బహిరంగ మార్కెట్‌లో
అధిక ధరలకు కొనలేక గగ్గోలు
జిల్లాలో రేషన్ షాపులు కార్డుల వివరాలు
మండలం రేషన్ రేషన్
షాపులు కార్డులు
అనపర్తి 39 22,488
బిక్కవోలు 40 22,480
చాగల్లు 36 21,072
దేవరపల్లి 34 25,416
గోకవరం 36 22,644
గోపాలపురం 43 21,128
కడియం 45 29,138
కోరుకొండ 43 26,991
కొవ్వూరు 55 33,320
నల్లజర్ల 42 27,554
నిడదవోలు 51 34,483
పెరవలి 43 23,233
రాజమహేంద్రవరం రూరల్ 59 50,511
రాజమహేంద్రవరం అర్బన్ 105 83,403
రాజానగరం 48 36,324
రంగంపేట 30 19,778
సీతానగరం 44 24,085
తాళ్లపూడి 34 16,811
ఉండ్రాజవరం 44 24,135
జిల్లావ్యాప్తంగా రేషన్ కార్డులు 5,64,000
కార్డుల్లోని సభ్యులు 15,77,393
వీరికి అవసరమైన కందిపప్పు 564.9 టన్నులు
అంగన్‌వాడీ కేంద్రాలకు మాత్రమే
సరఫరా చేసినది 25 టన్నులు