
అన్నవరప్పాడుకు పోటెత్తిన భక్తులు
పెరవలి: దశమి శనివారం కలసి రావడంతో అన్నవరప్పాడు వేంకటేశ్వరస్వామి ఆలయానికి వేలాదిగా భక్తులు పోటెత్తారు. వివిధ ప్రాంతాల నుంచి వేకువజామునే ఆలయానికి తరలివచ్చి, స్వామివారి దర్శనానికి బారులు తీరారు. ముడుపులు, మొక్కులు చెల్లించుకున్నారు. వందలాది మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి దర్శనానికి గంట సమయం పట్టింది. స్వామివారికి అభిషేకం అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించారు. స్వామి, అమ్మవార్లను వివిధ రకాల కూరగాయలతో విశేషంగా అలంకరించారు. దాతల ఆర్థిక సాయంతో 6,500 మందికి అన్నసమారాధన నిర్వహించామని ఆలయ ఈఓ మీసాల రాధాకృష్ణ తెలిపారు.
ఇసుక లోడు పరిమితికి
మించితే కఠిన చర్యలు
రాజమహేంద్రవరం సిటీ: పరిమితికి మించి ఇసుక లోడు చేస్తున్న వాహనదారులపై కఠిన చర్యలు చేపట్టాలని, ఆ వాహనాలను సీజ్ చేయాలని కలెక్టర్ పి.ప్రశాంతి అధికారులను ఆదేశించారు. ఇసుక అంశంపై తన క్యాంపు కార్యాలయంలో శనివారం ఆమె సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, తాళ్లపూడి, ప్రక్కిలంక, వేగేశ్వరపురాల్లో పూడికతీత చేసే రీచ్‌ల వద్ద వాహనాల్లో ఇసుకను అధికంగా లోడు చేస్తున్నట్లు ఫిర్యాదులు అందాయన్నారు. జిల్లావ్యాప్తంగా ఇటువంటి ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని, నిఘా పెంచాలని అధికారులను ఆదేశించారు. నిబంధనలు పాటించని పూడికతీత రీచ్‌ల లైసెన్సులు రద్దు చేయాలన్నారు. వాహనాల లోడింగ్, రహదారిపై పడిన ఇసుక తొలగింపు బాధ్యత ఆయా ఏజెన్సీలదేనని, వీటి పర్యవేక్షణ బాధ్యతను ఆయా మండల స్థాయి అధికారులకు అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేయాలని స్పష్టం చేశారు. రహదారిపై పడిన ఇసుకను అదే రోజు సాయంత్రంలోగా సంబంధిత ఏజెన్సీ తొలగించాలన్నారు. ఇసుక తొలగింపునకు ముందు, తర్వాత తీసిన ఫొటోలను ఆయా ఏజెన్సీలు జిల్లా యంత్రాంగానికి సమర్పించాలని ఆదేశించారు. ఈ నిబంధనలు పాటించని ఏజెన్సీల ఆథరైజేషన్‌ను ఎటువంటి ముందస్తు నోటీసూ లేకుండా రద్దు చేస్తామని హెచ్చరించారు. జిల్లాలో ఇసుక తవ్వకాలపై అక్టోబర్ 15 వరకూ నిషేధం ఉందని కలెక్టర్ చెప్పారు. సమావేశంలో జిల్లా మైనింగ్ అధికారి ఎం.ఫణిభూషణ్‌రెడ్డి, జిల్లా రవాణా అధికారి ఆర్.సురేష్ కుమార్ పాల్గొన్నారు.

అన్నవరప్పాడుకు పోటెత్తిన భక్తులు