
అభినందన సీమ
ఉద్యాన పంటలు భేష్
● అరుదైన ఎర్ర చక్కెరకేళీ
సాగులో అగ్రస్థానం
● ‘పాన్’కు పెట్టింది పేరు సీమ తమలపాకు
● కేరళను మించిన ‘వక్క’
● ఘనా దేశానికి దీటుగా కోకో నాణ్యత
● గూడపల్లి మామిడికి యమ క్రేజ్
సాక్షి, అమలాపురం: ఉద్యాన పంటల సాగులో కోనసీమ జిల్లాకు ప్రత్యేక స్థానం ఉంది. ఇక్కడ పండే పంటలకు దేశవ్యాప్తంగా గిరాకీ ఉంది. ఇక్కడి ఉత్పత్తుల కొనుగోలుకు ఉత్తరాది వ్యాపారులు ఎంతో ఆసక్తి చూపుతారు. సాగులో నాణ్యతా ప్రమాణాలు పాటించడం, రుచిలోనూ చవులూరించడమే దీనికి కారణం.
ఆను‘పాను’ తెలుసు
కోనసీమ నుంచి వెళ్తున్న తమలపాకును ఉత్తర, దక్షిణాది రాష్ట్రాల్లో కిళ్లీల తయారీలో ఎక్కువగా వినియోగిస్తారు. ఆనుపానులు తెలుసుకుని ఇక్కడి రైతులు పండించే తమలపాకు రుచి బాగుంటుందని ఉత్తరాది వ్యాపారులు చెబుతారు. జిల్లాలోని పి.గన్నవరం, రావులపాలెం, అయినవిల్లి మండలాల్లో సుమారు 240 ఎకరాల్లో ఈ పంట పండుతోందని అంచనా. ఇప్పుడు పశ్చిమ గోదావరి నుంచి వచ్చే ఆకుతో కలిపి రోజుకు ఒక లారీ వరకు ఎగుమతి జరుగుతున్నట్టు వ్యాపారులు చెబుతున్నారు.