
అప్రమత్తతతో పాములకు చెక్
ఖరీఫ్ వేళ పొంచి ఉన్న ప్రమాదాలు
భయంతోనే ప్రాణానికి గండం
ధైర్యం.. అవగాహన.. తప్పనిసరి
రాయవరం: తొలకరి పలకరించడంతో రైతులు పొలంబాట పడుతున్నారు. వాతావరణం చల్లబడడంతో పంట పొలాల్లోని బొరియల్లో ఉన్న విష పురుగులు, పాములు బయటకు వస్తుంటాయి. వ్యవసాయ పనుల్లో తలమునకలయ్యే రైతులు పాము కాటుకు గురై నిండు ప్రాణాలను కోల్పోతున్న సంఘటనలు జిల్లాలో చోటు చేసుకుంటున్నాయి.
పాముకాటుకు గురైన సందర్భాలలో సకాలంలో వైద్యం అందక పోతే మత్యువాత పడుతుంటారు. పాము కాటుకు గురికాకుండా ఏం చేయాలి? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ప్రాథమిక చికిత్సపై అవగాహన అందరికీ అవసరం.
ప్రాణసంకటమే..
రబీ ముగిశాక వేసవిలో రైతులు పొలాల వద్దకు తక్కువుగా వెళ్తుంటారు. సుమారు రెండు నెలల పాటు పొలాల్లో అంతగా అలికిడి ఉండక పోవడంతో అక్కడికి పాములు చేరతాయి. తిరిగి ఖరీఫ్ పనులు మొదలుపెట్టే సందర్భంలో పాములు బయటకు వచ్చి కాటు వేస్తుంటాయి. ఏటా వర్షాకాలం ప్రారంభంలో ఇలాంటి ఘటనలు అధికమవుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో పొలం గట్ల పక్కన నివాసం ఉండే ప్రాంతాల్లో ఎక్కువుగా పాముకాటు మరణాలు సంభవిస్తుంటాయి.
అప్రమత్తంగా ఉండాలి
● రైతులు చేల గట్లపై నడిచే సమయంలో పాదరక్షలు ధరించాలి.
● కర్రతో చప్పుడు చేస్తూ నడవడం వల్ల అలికిడికి పాములు వెళ్లిపోతాయి.
● ధాన్యపు గాదెలు, గడ్డివాములు, తడిగా ఉండే చోట కప్పలు, ఎలుకల కోసం పాములు తిరుగుతుంటాయి.
● దుంగలు, కట్టెల్లో పాములు ఎక్కువుగా ఉండే అవకాశం ఉంటుంది.
● రైతులు ఇళ్ల వద్ద ఏర్పాటు చేసుకునే పిడకలు, డొక్కల గూళ్ల మధ్య విష కీటకాలు ఉండే అవకాశం ఉంది.
● రాత్రి పూట మోటార్ వేయడానికి, పొలాలకు నీరు పెట్టడానికి వెళ్లేటప్పుడు విధిగా టార్చిలైట్ ఉపయోగించాలి.
● మోటార్ షెడ్‌లో స్టార్టర్ వద్ద కూడా పాములు ఉండే అవకాశం ఉంటుంది.
● ఇళ్ల చుట్టూ శుభ్రంగా ఉంచుకోవాలి. ఎలాంటి చెత్తాచెదారం, ముళ్ల పొదలు ఉండకూడదు.
● గోడల వారన పాములు నక్కే అవకాశం ఉన్నందున కట్టెల వంటివి ఉంటే వాటిని తొలగించాలి.
రెండు గాట్లు పడితే
సాధారణ విష సర్పం కాటు వేసిన ప్రదేశంలో కోరల గాయం స్పష్టంగా కన్పించి, నొప్పి తీవ్రంగా ఉంటుంది. నొప్పి క్రమంగా పైకి వ్యాపిస్తూ తిమ్మిరిగా అనిపిస్తుంది. పాక్షిక పక్షవాతం వల్ల నాలుక మందమైనట్లు, గొంతు కండరాలు బిగుసుకున్నట్లు, గొంతులో ఏదీ దిగని పరిస్థితి తలెత్తవచ్చు. చొంగ కారడంతో పాటు కళ్లు మగతగా, శరీరం మత్తుగా ఉండి స్పృహ కోల్పోవచ్చు. రెండు గాట్లు పడితే విషపూరితమైన పాము అని గుర్తించాలి. తాచు పాము కంటే కట్లపాము ప్రమాదకరం. కట్లపాము కాటేసిన క్షణాల్లోనే విషం రక్త కణాల్లో కలుస్తుంది. రక్తపింజర కాటేస్తే విషం రక్తంలో చేరుతుంది. నోరు, ముక్కు ద్వారా రక్తం బయటకు వస్తుంది. వెంటనే బాధితులను ఆస్పత్రికి చేర్పించాలి. తాచుపాము కాటేసిన 15 నిమిషాల్లోనే శరీరంలోనికి విషం ప్రవేశిస్తుంది.
ధైర్యం చెప్పాలి
● పాము విషం కన్నా చాలా మంది షాక్‌తోనే ప్రాణం మీదకు తెచ్చుకుంటారు. పాముకాటుకు గురైన వ్యక్తికి ధైర్యం చెప్పాలి.
● చాలా పాములకు విషం ఉండదు. తాచుపాము, కట్లపాము, రక్తపింజరి, పొడపాము వంటి 15శాతం సర్పజాతులు ప్రమాదరకమైనవి.
● నాటు వైద్యం, మంత్ర తంత్రాలు అని ఆలస్యం చెయ్యకుండా సాధ్యమైనంత త్వరగా దగ్గర్లోని ఆస్పత్రికి రోగిని తీసుకెళ్లాలి. రోగిని ఎట్టి పరిస్థితుల్లో నడిపించకూడదు.
● సాధ్యమైనంత వరకు 108 అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించాలి. పాము కాటు వేసిన ప్రదేశం పైభాగంలో రక్త ప్రసరణ జరగకుండా బలంగా కట్టుకట్టాలి.
ఆధునిక చికిత్సతో లాభాలు
● విషం విరుగుడు ఇంజెక్షన్ రూపంలో త్వరగా పనిచేస్తుంది.
● బాధితునికి ఆందోళన, షాక్ వల్ల తలెత్తే ఇతర సమస్యలు సమర్ధవంతంగా నివారించవచ్చు.
● సైలెన్ రూపంలో చికిత్సను మెరుగ్గా అందించే వీలుంటుంది.
● చికిత్స ఆలస్యం వల్ల ఏదైనా ప్రమాదం జరిగితే మెడికో లీగల్ కేసుగా అధికారికంగా నమోదై ఆపద్బంధు పథకం కింద ప్రభుత్వం నుంచి పరిహారం పొందవచ్చు.
జిల్లాలో పరిస్థితి ఇదీ
కోనసీమ జిల్లాలో 2014 జనవరి నుంచి ఈ ఏడాది జూన్ 27వ తేదీ వరకు 72 మంది పాముకాట్లకు గురయ్యారు. వీరిలో ఇద్దరు మృతి చెందారు. జిల్లాలో ప్రస్తుతం 1,724 యాంటీ వీనమ్ ఇంజెక్షన్లు అందుబాటులో ఉన్నట్లు వైద్యశాఖ అధికారులు చెబుతున్నారు. ప్రతి పీహెచ్‌సీలోనూ 20 వరకు యాంటీ వీనమ్ వైల్స్ అందుబాటులో ఉన్నట్లు చెబుతున్నారు.
ఇంజెక్షన్ల కొరతలేదు
ప్రస్తుతం వర్షాకాలం ప్రారంభమైనందున విషసర్పాల సంచా రం అధికమవుతుంది. ముఖ్యంగా పొలాలకు వెళ్లే రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. పాము కాటు బాధితులు ఆస్పత్రికి చేరేలోగా ప్రాథమిక వైద్యం చాలా ముఖ్యం. యాంటీ వీనమ్ ఇంజెక్షన్లకు కొరతలేదు. – దుర్గారావు దొర, జిల్లా వైద్యాధికారి,
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా
నిర్లక్ష్యం చేయకూడదు
ఎటువంటి పాముకాట్లకు గురైన వారైనా ముందుగా ఆస్పత్రికి చేర్చితే ప్రాథమిక చికిత్స చేసి యాంటీ వీనమ్ ఇంజెక్షన్ చేస్తారు. పాముకాటుకు గురైన వారు ఎటువంటి భయాందోళనలకు గురి కాకుండా చూసుకోవాలి. పాము కరిచిన వ్యక్తికి చుట్టుపక్కల వారు ధైర్యం చెప్పాలి. పాము, కుక్కకాటుకు మందులు అందుబాటులో ఉన్నాయి.
– వి.అనిరుధ్, ప్రాథమిక వైద్యాధికారి, పీహెచ్‌సీ, రాయవరం.