
విద్యుదాఘాతంతో ఇద్దరి మృతి
● విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం
వల్లేనని బాలిక కుటుంబీకుల ఆందోళన
● న్యాయం చేయాలని డిమాండ్
తాళ్లపూడి(కొవ్వూరు): విద్యుదాఘాతంతో పదో తరగతి విద్యార్థి మృతి చెందిన ఘటన కొవ్వూరు మండలం ధర్మవరంలో చోటుచేసుకుంది. ధర్మవరానికి చెందిన జొన్నకూటి సౌమ్య (15) స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతుంది. శుక్రవారం ఉదయం ఇంటి వద్ద దుస్తులు ఆరేసే తీగపై విద్యుత్ లైన్ తెగిపడడంతో విద్యుదాఘాతానికి గురై ఆమె మృతి చెందింది. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు విద్యుదాఘాతంతో విలవిలలాడుతున్న ఆమెను కాపాడటానికి తన అన్నయ్య, ఓ స్నేహితుడు చేసిన ప్రయత్నంలో వారు సైతం స్వల్పంగా గాయపడ్డారు. వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. తమ కుటుంబాలకు తగిన న్యాయం వెంటనే చేయాలని కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రి పంచనామా కేంద్రం వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా మృతురాలి బంధువులు మాట్లాడుతూ ధర్మవరం గ్రామంలో సర్వీస్ వైరు కిందకి ఉందని పదే పదే చెబుతున్నా పట్టించుకోని అధికారుల నిర్లక్ష్యం వల్ల ఒక నిండు ప్రాణం బలైందని వారు ధర్నా చేశారు. బాలిక కుటుంబానికి తగిన న్యాయం జరగాలని, గ్రామంలో విద్యుత్ స్తంభాలన్నీ వెంటనే మార్చి మరో ప్రాణం పోకుండా చూసుకోవాలని కోరారు. పోలీసులు సద్దిచెప్పడంతో వారు ఆందోళన విరమించారు. ఈ సంఘటనపై కొవ్వూరు రూరల్ పోలీసులు, ఎస్సై శ్రీహరి వివరాలు సేకరించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
గాదరాడలో యువకుడు..
కోరుకొండ: మండలంలోని గాదరాడ గ్రామానికి చెందిన సేనాపతి శ్రీను (34) గురువారం విద్యుదాఘాతంతో మృతిచెందిన ఘటనపై కేసు నమోదు చేసినట్టు ఎస్సై కూన నాగరాజు తెలిపారు. వ్యవసాయకూలీగా జీవించే శ్రీను గురువారం తన ఇంటి వద్ద మోటార్ ఆన్ చేయగా విద్యుత్ షాక్ తగిలింది. అతడిని కాపాడబోయిన తల్లి మోటార్‌ను ఆపే క్రమంలో తానూ షాక్‌కు గురైనా విద్యుత్ సరఫరాను ఆపగలిగింది. దీంతో కింద పడిపోయిన శ్రీనును స్థానికుల సాయంతో ఆస్పత్రికి తరలిస్తుండగానే అతడు మృతి చెందాడు. శ్రీనుకు భార్య ఉంది. విద్యుదాఘాతంతో మృతిచెందినట్టు కేసు నమోదు చేసి శుక్రవారం రాజమహేంద్రవరం జీహెచ్‌లో శవపంచనామా నిర్వహించారు.

విద్యుదాఘాతంతో ఇద్దరి మృతి

విద్యుదాఘాతంతో ఇద్దరి మృతి