● ముగ్గురి అరెస్టు, మరొకరు పరారీ
● 14 కిలోల గంజాయి, 14 బైక్‌ల స్వాధీనం
గోకవరం: గంజాయికి అలవాటు పడిన యువకులు చోరీల బాట పట్టారు. బైక్‌లను చోరీ చేస్తూ వాటిని గంజాయి ముఠాకి అప్పగించి వారి వద్ద నుంచి గంజాయి తెచ్చుకుంటూ జల్సాలు చేస్తున్నారు. ఈ విధంగా బైక్‌లు చోరీ చేస్తున్న ముగ్గురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకుని 14 బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు. ఆ వివరాలను స్థానిక పోలీస్‌స్టేషన్‌లో నార్త్‌జోన్ డీఎస్పీ శ్రీకాంత్ శుక్రవారం వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల మేరకు గోకవరం మండలం కామరాజుపేటకు చెందిన పాశం కొండలరావు అలియాస్ నాని అలియాస్ కళ్యాణ్, వాకాడ పవన్‌కుమార్ అలియాస్ ముక్కా పవన్, కాకర్ల వెంకటకుమార్ అలియాస్ వెంకట్, గోకవరానికి చెందిన ఆవుల వంశీ వ్యసనాలకు బానిసలయ్యారు. వీరు మరికొంత మందితో కలిసి గంజాయి కోసం ఇళ్ల బయట నిలిపిఉంచిన ఖరీదైన స్పోర్ట్స్ బైక్‌లను దొంగతనాలు చేసి ఏజెన్సీలోని గంజాయికి మారకం చేసి ఆ మత్తును సేవిస్తున్నారు. శుక్రవారం గోకవరం శివారు కొత్తపల్లికి వెళ్లే మార్గంలో బాపనమ్మ ఆలయం వద్ద ఎస్సై పవన్‌కుమార్ ఆధ్వర్యంలో సిబ్బంది వాహనాలు తనిఖీ చేస్తుండగా రెండు బైక్‌లపై వస్తున్న వీరిని పోలీసులు గుర్తించి నిలువరించగా తప్పించుకునే ప్రయత్నం చేశారు. సిబ్బంది వారిని చాకచక్యంగా పట్టించుకునే ప్రయత్నంలో వంశీ తప్పించుకున్నాడు. మిగిలిన ముగ్గురు నుంచి 14 కేజీల గంజాయి స్వాధీనం చేసుకుని వారిని విచారించారు. ఈ సందర్భంగా బైక్‌ల చోరీ గురించి వెల్లడించారు. ఈ సమాచారంతో కామరాజుపేట శివారున ఫారెస్టు చెక్‌పోస్టు సమీపంలోని పైపులైన్ బ్రిడ్జి కింద దాచి ఉంచిన 14 బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. వీరిపై కేసు నమోదు చేసి రిమాండ్ నిమిత్తం రాజమహేంద్రవరం తరలించనున్నామనని, తప్పించుకున్న మరో యువకుడిని త్వరలోనే పట్టుకుంటామని డీఎస్పీ తెలిపారు. మండలంలో గంజాయి రవాణా, విక్రయాల సమాచారం ఉంటే తమకు చెప్పాలని ఆయన కోరారు. కోరుకొండ సీఐ సత్యకిశోర్, ఎస్సై పవన్‌కుమార్, ఇతర సిబ్బంది ఈ దర్యాప్తులో పాల్గొన్నారు.