కూటమి సర్కారువి దిగజారుడు రాజకీయాలు | - | Sakshi
Sakshi News home page

కూటమి సర్కారువి దిగజారుడు రాజకీయాలు

Jul 4 2025 3:56 AM | Updated on Jul 4 2025 3:56 AM

కూటమి సర్కారువి దిగజారుడు రాజకీయాలు

కూటమి సర్కారువి దిగజారుడు రాజకీయాలు

సంక్షేమం మరచి రెడ్‌బుక్‌

రాజ్యాంగం అమలు చేస్తున్నారు

మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు

చాగల్లు: దళితుడైన చీలి సింగయ్య మృతిలో కూటమి ప్రభుత్వం దిగజారుడు రాజకీయాలు చేస్తోందని, ఇది కక్ష సాధింపు రాజకీయాలకు పరాకాష్ట అని వైఎస్సార్‌ సీపీ కొవ్వూరు నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు ధ్వజమెత్తారు. చాగల్లు మండలం నందిగంపాడులో గురువారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. సింగయ్య మృతిపై అక్రమ కేసులు పెట్టి, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కారు కింద పడి, మరణించినట్లు చూపించేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. దానిలో భాగంగానే 37 సెకెన్ల నిడివితో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌తో తయారు చేసిన వీడియోను సోషల్‌ మీడియాలో విడుదల చేశారని, దాని ఆధారంగా అక్రమ కేసులు కట్టారని ఆరోపించారు. ఈ కేసులపై జగన్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారని, కోర్టుకు ప్రభుత్వం ఇప్పటికీ ఆధారాలు చూపించలేక వాయిదాలు అడుగుతోందని అన్నారు. నిజంగా 4 టన్నుల బరువున్న జగన్‌ కారు కింద పడి చనిపోయి ఉంటే సింగయ్య తల నుజ్జునుజ్జు కాకుండా ఎలా ఉందో చంద్రబాబే చెప్పాలని ప్రశ్నించారు. కారు చక్రం ఎక్కి ఉంటే దాని తరువాత వీడియో కానీ, కారు కింద నుంచి సింగయ్యను బయటకు తీసిన వీడియో కానీ ప్రభుత్వం వద్ద ఎందుకు లేవని నిలదీశారు. వీడియోతో ప్రభుత్వం ఆడుతున్న నాటకాన్ని ప్రజలు అర్థం చేసుకున్నారన్నారు. ప్రమాదాలు జరిగితే వాహనం డ్రైవర్‌తో పాటు అందులో ప్రయాణిస్తున్న వారిపై కేసులు పెట్టిన చరిత్ర ఎక్కడా ఎప్పుడూ లేదని, తొలిసారి కూటమి ప్రభుత్వమే ఆ రికార్డు కూడా నమోదు చేసుకుందని విమర్శించారు. బస్సు డ్రైవర్‌ యాక్సిడెంట్‌ చేస్తే అందులోని ప్రయాణికులదరిపై కేసు పెడతారా అని ప్రశ్నించారు. సింగయ్య మృతిపై సీబీఐ విచారణ జరిపి, దీని వెనుక ఉన్న కుట్రను వెలికి తీయాలని డిమాండ్‌ చేశారు. కేవలం జగన్‌ను కేసులో ఇరికించే దురుద్దేశంతో కూటమి నాయకులు ఒక నిండు ప్రాణం బలిగొన్నారని అన్నారు.

గతంలో గోదావరి పుష్కరాల్లో చంద్రబాబు పబ్లిసిటీ కోసం 29 మంది ప్రాణాలు తీశారని, ఈ ఘటనలో మొదటి ముద్దాయి ఆయనేనని వెంకట్రావు ఆరోపించారు. ఎన్నికల ముందు ఇరుకు సందుల్లో మీటింగులు పెట్టి ఎనిమిది మంది మరణానికి, వైకుంఠ ఏకాదశి టోకెన్ల జారీ సందర్భంగా తిరుపతిలో ఆరుగురు భక్తుల మృతికి కారకులయ్యారని, వీటన్నింటికీ సంబంధించి చంద్రబాబుపై ఎందుకు కేసు పెట్టకూడదని ప్రశ్నించారు.

అక్రమ కేసులు

కూటమి ప్రభుత్వం వచ్చి 13 నెలలవుతున్నా ప్రజా సంక్షేమాన్ని పక్కన పెట్టి రెడ్‌బుక్‌ రాజ్యాంగం అమలు చేస్తున్నారని వెంకట్రావు దుయ్యబట్టారు. అధికారంలోకి రాగానే అక్రమ కేసులతో నందిగం సురేష్‌, వల్లభనేని వంశీ, కాకాణి గోవర్ధన్‌రెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పోసాని కృష్ణమురళి, జోగి రమేష్‌ కుమారుడిని అరెస్టు చేశారని గుర్తు చేశారు. మాజీ మంత్రి పేర్ని నాని, ఆయన భార్య జయసుధపై అక్రమ కేసులు పెట్టి అరెస్టుకు ప్రయత్నించారన్నారు. అసలు జరగని లిక్కర్‌ స్కామ్‌ను జరిగినట్లు చూపించి చెవిరెడ్డి భాస్కరరెడ్డిని కూడా అక్రమంగా అరెస్టు చేసి జైలులో నిర్బంధించారని చెప్పారు. ఐపీఎస్‌ అధికారులు, కొమ్మినేని శ్రీనివాసరావు వంటి జర్నలిస్టులను సైతం కేసులు, అరెస్టులతో కక్ష సాధిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టినందుకు వైఎస్సార్‌ సీపీకి చెందిన సోషల్‌ మీడియా కార్యకర్తలు 240 మందిని జైళ్లకు పంపించారని చెప్పారు. కక్ష సాధింపు రాజకీయాలు చేస్తున్న చంద్రబాబుకు గుణపాఠం చెప్పడానికి ప్రజలు సిద్ధమవుతున్నారని వెంకట్రావు అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement