
పంట కాల్వలు కలుషితం
అమలాపురం టౌన్: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పంట కాల్వల ద్వారా ప్రవహిస్తున్న గోదావరి జలాలు మానవ తప్పిదాలతో కలుషిత అవుతున్నాయని ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు ఆందోళన వ్యక్తం చేశారు. అమలాపురంలో గురువారం ప్రకటన విడుదల చేశారు. ఈ మానవ నిర్లక్ష్యం, తప్పిదాలపై తాను హ్యూమన్ రైట్స్‌కు ఫిర్యాదు చేస్తున్నట్టు తెలిపారు. కాల్వల ద్వారా ప్రవహించే గోదావరి జలాలతో పంటల సాగే కాకుండా పలు గ్రామాల్లో తాగునీటి ప్రాజెక్ట్‌లు నిర్వహిస్తున్నారని వివరించారు. కొందరు తమ ఇళ్ల మరుగుదొడ్ల గొట్టాలు కాల్వల్లోకి అమర్చుకొని కలుషితం చేస్తున్నారని, తద్వారా పంట కాల్వలు మానవ మల మూత్రాలతో ప్రవహిస్తున్నాయని ఎమ్మెల్సీ ఆందోళన వ్యక్తం చేశారు. సాగు, తాగునీరు కోసం కాటన్ దొర పంట కాల్వల వ్యవస్థను తీసుకుని వస్తే స్వార్థుపరులు, కాల్వలను పర్యవేక్షించాల్సి అధికారుల నిర్లక్ష్యం వల్ల కలుషితం అవుతున్నాయని పేర్కొన్నారు. కాల్వలను కలుషితం చేయవద్దని, వ్యర్థాలను వదల వద్దని న్యాయస్థానాలు హెచ్చరిస్తున్నాయని గుర్తు చేశారు. కాల్వలను కలుషిత చేసే వ్యక్తులపై క్రిమినల్ కేసులు పెట్టి చర్యలు తీసుకునే అవకాశం ఉన్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు ఉంటున్నారని ఎమ్మెల్సీ సూర్యనారాయణరావు పేర్కొన్నారు.
హ్యూమన్ రైట్స్‌కు ఫిర్యాదు చేయనున్న
ఎమ్మెల్సీ సూర్యనారాయణరావు