
వాహనాల ఫిట్‌నెస్ టెస్టులు ప్రైవేటు పరం చేయొద్దు
ఫ నిర్ణయం ఉపసంహరించుకోకుంటే
ఆందోళన ఉధృతం
ఫ మాజీ ఎంపీ మార్గాని భరత్‌రామ్
రాజానగరం: రవాణా వాహనాల ఫిట్‌నెస్ (బ్రేక్) టెస్టులను రాష్ట్ర రవాణా శాఖ నుంచి ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని మాజీ ఎంపీ, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్‌రామ్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వివిధ రవాణా వాహన కార్మిక సంఘాల ప్రతినిధుల జేఏసీ కన్వీనర్లు వాసంశెట్టి గంగాధరరావు, బాక్స్ ప్రసాద్‌ల ఆధ్వర్యాన స్థానిక ఫిట్‌నెస్ టెస్టింగ్ పాయింట్ వద్ద మంగళవారం జరిగిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రాజమహేంద్రవరంలోని హైటెక్ బస్ షెల్టర్ నుంచి నిరసనకారులు ఆటోల్లో ఊరేగింపుగా ఇక్కడకు చేరుకుని, ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం రవాణా శాఖ అధికారులకు వినతిపత్రం అందజేశారు.
కూటమి ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత
ఈ సందర్భంగా భరత్‌రామ్ మాట్లాడుతూ, రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుంటోందని అన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను పట్టించుకోకుండా, వివిధ రకాల పన్నులతో ఆర్థిక భారం మోపుతోందన్నారు. కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలు అనుసరించడమే కాకుండా, స్వార్థ రాజకీయాలతో ప్రతిపక్షాలపై పోలీసు జులుం ప్రదర్శిస్తోందని దుయ్యబట్టారు. గత ప్రభుత్వంలో కరెంటు బిల్లు నెలకు రూ.600 నుంచి రూ.700 వస్తే, కూటమి సర్కారులో రూ.1,500 నుంచి రూ.3 వేలు వస్తోందని, ప్రజలపై పడుతున్న ఆర్థిక భారానికి ఇది ఒక ఉదాహరణని చెప్పారు. అన్నదాతల పరిస్థితి మరీ అధ్వానంగా తయారైందన్నారు. అలాగే, ఆటో, వ్యాన్, కారు, లారీ నడుపుతూ, రోజువారీ సంపాదనతో జీవనం సాగిస్తున్న కార్మికులకు ప్రభుత్వం ఎటువంటి సాయమూ చేయడం లేదని, పైగా ఆయా వాహనాల ఫిట్‌నెస్ ప్రక్రియను పరుల పరం చేసి, ఫీజుల భారం మోపిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి చర్యలు ఏ రాష్ట్రంలోనూ లేవన్నారు. ఈ క్రమంలో ఇబ్బందులు చెప్పుకునేందుకు కూడా అవకాశం ఇవ్వకుండా, తక్కువ మందితోనే నిరసన తెలపాలంటూ ప్రజాస్వేచ్ఛను హరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏడాదిలోనే ఇంతటి దారుణ పరిస్థితులుంటే మిగిలిన నాలుగేళ్లలో ఎంతటి ఘోరాలు ఎదుర్కోవలసి వస్తుందోనని ప్రజలు బెంబేలెత్తుతున్నారని అన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రజా సంక్షేమాన్ని కోరుకునే ప్రభుత్వమేదో ప్రజలే తెలుసుకోవాలన్నారు. సమస్యల పరిష్కారానికి చేసే పోరాటాలకు తమ మద్దతు ఎప్పుడూ ఉంటుందని భరత్‌రామ్ చెప్పారు.