
కుమార సుబ్రహ్మణేశ్వరునికి అభిషేకాలు
బిక్కవోలు: స్థానిక శ్రీ కుమార సుబ్రహ్మణేశ్వరుని ఆలయంలో స్వామివారికి పెద్ద సంఖ్యలో భక్తులు మంగళవారం అభిషేకాలు నిర్వహించారు. స్వామివారికి ప్రీతికరమైన మంగళవారం, షష్ఠి కలసి రావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలి వచ్చారు. అభిషేకాల అనంతరం స్వామివారికి అర్చకులు ప్రత్యేక అలంకరణ చేశారు. దేవదాయ శాఖ ఆధ్వర్యాన అన్నసమారధన నిర్వహించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందీ కలగకుండా ఈఓ రామలింగ భాస్కర్ ఆధ్వర్యాన సిబ్బంది ఏర్పాట్లు చేశారు.
దేవస్థానం పునర్నిర్మాణానికి
రూ.లక్ష విరాళం
అమలాపురం టౌన్: పురాతన దేవస్థానమైన అమలాపురం భూపయ్య అగ్రహారంలోని సీతారామచంద్రమూర్తి స్వామి దేవస్థానం పునర్నిర్మాణానికి పట్టణానికి చెందిన జీవీఎంఎం సేవా ట్రస్ట్ చైర్మన్ గుళ్లపల్లి సత్యనారాయణ రూ.1,01,116 విరాళాన్ని అందజేశారు. దేవస్థానం వద్ద దాత గుళ్లపల్లి సత్యనారాయణ పునర్నిర్మాణ కమిటీ ప్రతినిధులకు ఈ విరాళాన్ని మంగళవారం అందించారు. తన తల్లిదండ్రులు దివంగత గుళ్లపల్లి వెంకట్రామయ్య, మహాలక్ష్మమ్మ, తన భార్య దివంగత కామేశ్వరి సంస్మరణార్థం విరాళం అందజేసినట్టు సత్యనారాయణ తెలిపారు. కమిటీ ప్రతినిధులు జిల్లెళ్ల గోపాల్, విస్సాప్రగడ చాన్న, మండలీక నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు.

కుమార సుబ్రహ్మణేశ్వరునికి అభిషేకాలు