
విద్యార్థులతో కలెక్టర్ సహపంక్తి భోజనం
తాళ్లపూడి: మలకపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. మధ్యాహ్నం భోజనం నిర్వహణ తీరును పరిశీలించారు. విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. భోజనం చాలా బాగుందని సంతృప్తి వ్యక్తం చేశారు. ‘ప్రతి రోజూ ఇలాగే ఉంటుందా’ అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. భవిష్యత్తులో ఏం కావాలనుకుంటున్నారని ప్రశ్నించగా విద్యార్థులు ఉత్సాహంతో సమాధానం చెప్పారు. జాయింట్ కలెక్టర్ ఎస్.చిన్నరాముడు, కొవ్వూరు ఆర్‌డీఓ రాణి సుస్మిత, జిల్లా పాఠశాల విద్యాశాఖాధికారి కె.వాసుదేవరావు కూడా విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. కార్యక్రమంలో ఎంఈఓలు సీహెచ్ బాలమణి, సీహెచ్ నెహ్రూజీ, హెచ్‌ఎం వాసవి తదితరులు పాల్గొన్నారు.
ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్య
సేవల ధరలు ప్రదర్శించాలి
రాజమహేంద్రవరం రూరల్: ప్రైవేటు ఆసుపత్రుల్లో అందించే వైద్య సేవల ధరలను 15 రోజుల్లోగా ప్రదర్శించాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ కె.వెంకటేశ్వరరావు ఆదేశించారు. రిసెప్షన్ కౌంటర్లో స్థానిక భాష, ఇంగ్లిషులో ఈ ధరల పట్టికను స్పష్టంగా ప్రదర్శించాలని పేర్కొన్నారు. ఏటా జూన్ ఒకటో తేదీ నాటికి ధరల జాబితాను రిజిస్ట్రేషన్ అధికారికి పంపించాలన్నారు. వైద్యం ప్రారంభించే సమయంలోనే రోగి లేదా వారి బంధువులకు సేవల వివరాలు, ధరలను స్పష్టంగా వివరించాలన్నారు. ఈ సూచనలు పాటించకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
పీజీఆర్‌ఎస్‌కు 187 అర్జీలు
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) జిల్లా స్థాయి కార్యక్రమంలో 187 అర్జీలు స్వీకరించినట్లు డీఆర్‌ఓ సీతారామ్మూర్తి తెలిపారు. జిల్లా అధికారులతో కలసి ఆయన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, తమ సమస్యల పరిష్కారానికి ప్రజలు 1100 టోల్‌ఫ్రీ నంబర్ ద్వారా మీకోసం కాల్ సెంటర్‌కు ఫిర్యాదు చేయవచ్చని, అర్జీ స్థితిగతులు తెలుసుకోవచ్చని తెలిపారు. వాట్సాప్ గవర్నెన్స్ నంబర్ 9552300009 ద్వారా కూడా పౌర సేవలు పొందవచ్చన్నారు.
సత్యదేవునికి ఘనంగా
జన్మనక్షత్ర పూజలు
అన్నవరం: జన్మ నక్షత్రం మఖను పురస్కరించుకుని సత్యదేవునితో పాటు అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవార్లకు సోమవారం ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆయుష్య హోమం ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజామున రెండు గంటలకు స్వామివారి ఆలయం తెరచి అర్చకులు సుప్రభాత సేవ, ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవార్ల మూలవిరాట్టులకు, శివలింగానికి మహన్యాస పూర్వక పంచామృతాభిషేకం నిర్వహించి, సుగంధభరిత పుష్పాలతో పూజించారు. ఉదయం ఆరు గంటల నుంచి దర్శనానికి భక్తులను అనుమతించారు. యాగశాలలో ఉదయం 9 గంటల నుంచి సత్యదేవుడు, అమ్మవారికి ఆయుష్య హోమం ఘనంగా నిర్వహించారు. స్వామివారిని సుమారు 20 వేల మంది భక్తులు దర్శించారు. వెయ్యి వ్రతాలు జరిగాయి. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.20 లక్షల ఆదాయం సమకూరింది. సత్యదేవుడు, అమ్మవారు, శంకరులను ముత్యాల కవచాల అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు.

విద్యార్థులతో కలెక్టర్ సహపంక్తి భోజనం

విద్యార్థులతో కలెక్టర్ సహపంక్తి భోజనం

విద్యార్థులతో కలెక్టర్ సహపంక్తి భోజనం