
ధాన్యం బకాయిలు చెల్లించాలి
కాకినాడ సిటీ: దాళ్వా పంటలో సీఎంఆర్ ద్వారా అమ్మిన ధాన్యం బకాయిలను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఏపీ కౌలు రైతుల సంఘం ఆధ్వర్యాన కలెక్టరేట్ వద్ద సోమవారం ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం మే నెల నుంచి రూ.110 కోట్లు బకాయి పెట్టడంతో జిల్లాలోని రైతులు అనేక అవస్థలు పడుతున్నారని ఆందోళనకారులు వివరించారు. ఒక్క తాళ్లరేవు మండలంలోనే 300 మంది రైతులకు రూ.5 కోట్లు, కాజులూరు మండలంలో 400 మందికి రూ.6 కోట్లు పైగా చెల్లించాల్సి ఉందన్నారు. ఇప్పటికే ఖరీఫ్ మొదలైందని, ఇటు పెట్టుబడికి డబ్బులు లేక, అటు పాత బకాయిలు తీర్చలేక నానా ఇక్కట్లూ పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పెట్టుబడి సాయం కింద ప్రభుత్వం ఇస్తానన్న రూ.20 వేలు కూడా వేయలేదన్నారు. వెంటనే ధాన్యం బకాయిలు, పెట్టుబడి సాయం డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. నూతన కౌలు చట్టం తీసుకురావాలని, కాజులూరు, ఇంజరం వంతెనలు తక్షణం నిర్మించాలని కోరారు. ఈ సంఘం జిల్లా నాయకులు వల్లు రాజబాబు, టేకుమూడి ఈశ్వరరావు, దువ్వా శేషుబాబ్జీ, ఎం.రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.