
కొబ్బరి ధరహాసం
ఫ వెయ్యి కాయలకు
రూ.21 వేలకు పెరిగిన రేటు
ఫ కేరళ, కర్ణాటక, తమిళనాడుల్లో
తగ్గిన దిగుబడులు
ఫ మన కొబ్బరికి డిమాండ్
పెరవలి: కొబ్బరి కాయలకు మంచి ధర లభిస్తూండటంతో రైతులు, వ్యాపారులు ఖుషీగా ఉన్నారు. కొద్ది రోజుల కిందట జరిగిన ప్రయాగరాజ్ కుంభమేళాతో మొదలైన కొబ్బరి ధరల పెరుగుదల నేటికీ కొనసాగుతూనే ఉంది. గతంలో నాణ్యతను బట్టి వెయ్యి కాయలకు రూ.5,500 నుంచి రూ.6,500 చెల్లించేవారు. అటువంటిది కుంభమేళా దగ్గర నుంచి కొబ్బరి ధర క్రమంగా పెరుగుతూ నేడు రూ.21 వేలకు పెరిగింది. కోనసీమ జిల్లాలోని అంబాజీపేట మార్కెట్‌లో ఏకంగా రూ.22 వేలకు కూడా ధర ఎగబాకింది. దీంతో, ఇటు రైతులు, అటు వ్యాపారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
దండిగా దిగుబడి
మన జిల్లాలో 8,979 హెక్టార్లలో కొబ్బరి తోటలు విస్తరించి ఉన్నాయి. వీటితో పాటు చేలు, పుంత, చెరువు గట్లు, లంక భూముల్లో రైతులు కొబ్బరి సాగు చేస్తున్నారు. పెరవలి మండలంలోని కానూరు, కానూరు అగ్రహారం, నడుపల్లి, తీపర్రు, కాకరపర్రు, ముక్కామల, ఖండవల్లి గ్రామాల్లో 400 ఎకరాల్లో కొబ్బరి సాగు జరుగుతోంది. కొబ్బరి తోటల్లో గతంలో ఎకరానికి ప్రతి దింపునకు 600 నుంచి 800 కాయలు వచ్చేవి. ప్రస్తుతం తోటలు ఆరోగ్యంగా ఉండటంతో 1,200 నుంచి 1,500 కాయల దిగుబడి వస్తోంది. గతంలో ధర ఉంటే దిగుబడి ఉండేది కారు. ప్రస్తుతం దిగుబడితో పాటు మార్కెట్ పరిస్థితుల నేపథ్యంలో గిట్టుబాటు ధర కూడా లభించడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
మన కొబ్బరికి డిమాండ్ వచ్చిందిలా..
దక్షిణాదిలోని తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో కొబ్బరి దిగుబడులు అనూహ్యంగా పడిపోయాయి. దీంతో, ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లోని కొబ్బరికి డిమాండ్ వచ్చింది. ప్రస్తుతం మహారాష్ట్ర, ఒడిశా, పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాలకు ఇక్కడి నుంచే ఎగుమతులు జరుగుతున్నాయి. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల నుంచి నిత్యం 400 నుంచి 500 లారీల వరకూ కొబ్బరికాయల ఎగుమతులు జరుగుతున్నాయి. గతంలో కొబ్బరి దింపు తీయండంటూ వ్యాపారుల చుట్టూ రైతులు తిరిగేవారు. నేడు రైతుల చుట్టూ వ్యాపారులు తిరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. గతంలో 40 రోజులకు ఒక దింపు తీసేవారు. అటువంటిది ఇప్పుడు వ్యాపారులు రైతులకు ముందుగానే సొమ్ము చెల్లించి మరీ 30 రోజులకే కాయలు దింపుతున్నారంటే కొబ్బరికి ఏవిధంగా డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు.