
మోసం.. చంద్రబాబు నైజం
తాళ్లపూడి (కొవ్వూరు): మోసం చేయడం చంద్రబాబు నైజమని, మోసగాడిని జనం నమ్మరని తెలిసి, వేషగాడు పవన్ కల్యాణ్ సాయంతో అధికారంలోకి వచ్చి, ప్రజలను మళ్లీ మోసం చేశారని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అన్నారు. కొవ్వూరు లిటరరీ క్లబ్ వద్ద బాబు ష్యూరిటీ.. మోసం గ్యారంటీ నియోజకవర్గ స్థాయి కార్యక్రమం ఆదివారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా వైఎస్సార్ సీపీ కొవ్వూరు నియోజకవర్గ కో ఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో వేణు, పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా, రాజమండ్రి పార్లమెంటరీ ఇన్‌చార్జి డాక్టర్ గూడూరి శ్రీనివాస్, నియోజకవర్గ పరిశీలకుడు గొందే శ్రీనివాసరెడ్డి ‘బాబు ష్యూరిటీ.. మోసం గ్యారంటీ’ బ్రోచర్లను ఆవిష్కరించారు. అనంతరం ఎల్‌ఈడీ తెరపై చంద్రబాబు ఎన్నికల మేనిఫెస్టో చూపించారు. ఈ సందర్భంగా వేణు మాట్లాడుతూ, ఇసుక, మట్టి, మద్యం, మైనింగ్ ఇలా అన్నింటిలోనూ దోపిడీ పాలన సాగుతోందని విమర్శించారు. ప్రజలను మభ్యపెట్టేందుకు ఎమ్మెల్యేలపై చంద్రబాబు కోప్పడ్డారంటూ పెద్ద కథనాలు ఇస్తారని అన్నారు. ప్రజల పట్ల వైఎస్సార్ సీపీకి బాధ్యత ఉందని, రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలని, చంద్రబాబు మోసాలను జనంలోకి తీసుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. తలారి వెంకట్రావు మాట్లాడుతూ, ఇచ్చిన మాట అమలు చేయకుండా మోసం చేయడం చంద్రబాబు నైజమని విమర్శించారు. 2019లో కూడా ఎన్నికలకు కేవలం ఆరు నెలల ముందు తూతూమంత్రంగా పథకాలు అమలు చేసి, చేతులు దులుపుకొన్నారని అన్నారు. గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాత్రం ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసి చూపించారని గుర్తు చేశారు. జక్కంపూడి రాజా మాట్లాడుతూ, ఏడాది పాలన పూర్తయినా ఎన్నికల హామీలను చంద్రబాబు అమలు చేయని విషయాన్ని ‘బాబు ష్యూరిటీ.. మోసం గ్యారంటీ’ కార్యక్రమం ద్వారా ప్రజలకు వివరిస్తామని చెప్పారు. నాయకులు, కార్యకర్తలు చిత్తశుద్ధితో ఇప్పటి నుంచే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటే 2029లో అధికారం మనదేనని అన్నారు. ఆఖరి ఆరు నెలల్లో ఏమీ చేయలేమని, ఇప్పటి నుంచే ప్రజల్లో ఉండాలని పిలుపునిచ్చారు. మనం చేసిన మంచి, కూటమి నేతలు చేస్తున్న మోసాలను ప్రజలకు వివరించాలని సూచించారు. డాక్టర్ గూడూరి శ్రీనివాస్ మాట్లాడుతూ, పథకాలు అమలు చేయలేదని అడిగితే నాలుక మందమని చంద్రబాబు అంటున్నారని, ఎవరి నాలుక మందమో ప్రజలకు తెలియజేయాలని అన్నారు. ఈ సమావేశంలో నియోజకవర్గంలోని మూడు మండలాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
ఫ జనం నమ్మరని తెలిసి వేషగాడి
సాయంతో అధికారం
ఫ వైఎస్సార్ సీపీ నేత చెల్లుబోయిన
వేణు విమర్శ
ఫ కొవ్వూరులో బాబు ష్యూరిటీ..
మోసం గ్యారంటీ కార్యక్రమం ప్రారంభం