
కూటమి పాలనలో అన్ని వర్గాలకూ అన్యాయం
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): కూటమి ప్రభుత్వం వచ్చాక అన్ని వర్గాలకూ అన్యాయం జరుగుతోందని, ఇప్పుడు కార్మికులకు కూడా అన్యాయం చేస్తున్నారని మాజీ ఎంపీ, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్‌రామ్ అన్నారు. జాబు కావాలంటే బాబు రావాలని 2014 ఎన్నికల్లో చెప్పి చంద్రబాబు మోసం చేశారని, గత ఎన్నికల్లో ‘బాబు ష్యూరిటీ.. భవిష్యత్తు గ్యారంటీ’ అని హామీ ఇచ్చి ఎవ్వరికీ గ్యారంటీ లేకుండా చేస్తున్నారని విమర్శించారు. రవాణా వాహనాల ఫిట్‌నెస్‌ను రవాణా శాఖ నుంచి ప్రైవేటు సంస్థలకు కూటమి ప్రభుత్వం అప్పగించిన నేపథ్యంలో జరుగుతున్న అక్రమాలను వివరించేందుకు వివిధ రవాణా వాహన కార్మిక సంఘాల ప్రతినిధులు, కన్వీనర్లు వాసంశెట్టి గంగాధరరావు, బాక్స్ ప్రసాద్ తదితరుల ఆధ్వర్యాన శనివారం నగరంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భరత్‌రామ్ మాట్లాడుతూ, గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ‘వాహన మిత్ర’ పేరిట నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రూ.10 వేల చొప్పున అందించారని, కూటమి ప్రభుత్వం ఆవిధంగా ఇవ్వడం లేదని అన్నారు. రెక్కాడితేనే కానీ డొక్కాడని కార్మికులపై ప్రైవేటు సంస్థల ద్వారా ఫిట్‌నెస్ సర్టిఫికెట్ జారీ చేసే విధానం అమలు చేయడం దారుణమన్నారు. ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలనే డిమాండుతో వచ్చే నెల 1న తలపెట్టిన చలో రాజానగరం నిరసన కార్యక్రమంలో తాము కూడా భాగస్వాములవుతామని భరత్‌రామ్ ప్రకటించారు. ఇప్పటికై నా ఈ విధానాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక దళితులకు తీరని అన్యాయం జరుగుతోందన్నారు. ఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటనను రత్ ప్రస్తావించారు. దీనిపై తాము పోరాడామని గుర్తు చేశారు. అలాగే ఒక దళిత బాలికను మోసం చేసి, బలవంతపు అబార్షన్ చేయించి, పసి బిడ్డ మరణానికి కారకులైన ఘటనను కూడా ప్రస్తావించారు. తనకు న్యాయం చేయాలని బాధితురాలు ఆరు నెలలుగా తిరుగుతూంటే, ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. పావన గోదావరిలో మురుగు నీరు కలుస్తూంటే పట్టించుకోకపోవడం శోచనీయమని భరత్ విమర్శించారు. తాను ఎంపీగా ఉండగా కేంద్రం నుంచి రూ.88 కోట్లు మంజూరు చేయించి, మురుగునీటి శుద్ధికి 40 ఎంఎల్‌డీ ప్లాంట్ నిర్మాణం చేపట్టామని, కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది అయినా దీనిని ఇంకా పూర్తి చేయకపోవడం దారుణమని అన్నారు. దీంతో, మురుగునీరు కలసి గోదావరి కలుషితమవుతోందన్నారు. గోదావరిలో ఇష్టారాజ్యంగా ఇసుక తవ్వేసి, అక్రమంగా దోచుకుంటున్నారని, దీంతో, ఉచిత ఇసుక అనేది ఎక్కడా అమలు కావడం లేదని భరత్‌రామ్ పేర్కొన్నారు.