
అన్నవరప్పాడుకు పోటెత్తిన భక్తులు
పెరవలి: అన్నవరప్పాడు వేంకటేశ్వరస్వామి ఆలయానికి శనివారం వేలాదిగా భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు రావడం ప్రారంభమైంది. భక్తులు క్యూ లైన్లలో ఆలయ ప్రాంగణం చుట్టూ బారులు తీరారు. స్వామివారి దర్శనానికి గంట సమయం పట్టింది. స్వామివారికి అభిషేకం నిర్వహించిన అనంతరం, విశేషంగా అలంకరించి, భక్తులకు దర్శనాలు కల్పించారు. స్వామివారికి వందలాది మంది భక్తులు తలనీలాలు ఇచ్చారు. సుమారు 5 వేల మందికి అన్నసమారాధన నిర్వహించినట్లు ఈఓ మీసాల రాధాకృష్ణ తెలిపారు.
నూతన ఆలయ నిర్మాణానికి కృషి
పెరవలి: జీర్ణోద్ధరణకు వచ్చిన అన్నవరప్పాడు వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని పునర్నిర్మించాలని ఆలయ అధికారులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళ్లారు. ఈ నేపథ్యంలో ఆలయాన్ని జిల్లా దేవదాయ, ధర్మాదాయ శాఖ అధికారి ఇ.సుబ్బా రావు శనివారం పరిశీలించారు. స్థానిక అధికారులు తెలిపిన వివరాల మేరకు పరిశీలనకు వచ్చానని, గతంలో ఇంజినీరింగ్ అధికారులు ఇచ్చిన నివేదికలో ఉన్న అంశాలు వాస్తవమేనని గుర్తించామని చెప్పారు. ఈఓ మీసాల రాధాకృష్ణ మాట్లాడుతూ, ప్రస్తుత ఆలయాన్ని 50 ఏళ్ల క్రితం నిర్మించారని, ప్రస్తుతం జీర్ణోద్ధరణకు వచ్చిందని తెలిపారు. అంతే కాకుండా జాతీయ రహదారి విస్తరణ పనులతో రోడ్డు ఎత్తు పెరిగి, గుడి ఐదడుగుల పల్లంలో ఉందని, దీని వలన వర్షాలు కురిసినప్పుడు ఆలయంలోకి నీరు వస్తోందని వివరించారు. ఆలయ శ్లాబ్ కూడా పాడైపోయి, వానలు కురిసినప్పుడు శ్లాబ్ నుంచి నీరు కారిపోతోందని చెప్పారు. అక్కడక్కడ శ్లాబ్ పెచ్చులు ఊడి పడుతున్నాయన్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర అధికారుల దృష్టికి తీసుకువెళ్లి నూతన ఆలయ నిర్మాణానికి తన వంతు సహకారం అందిస్తానని సుబ్బారావు తెలిపారు.