
ప్రేయసి లేని జీవితం వద్దని!
పిఠాపురం: ప్రేమించిన యువతి చనిపోయింది. ఆమె లేని జీవితం వద్దనుకుని ఆ యువకుడు పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. చివరకు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. గొల్లప్రోలు పోలీసులు తెలిపిన కథనం మేరకు మండలంలోని దుర్గాడ జగనన్న కాలనీకి చెందిన ములగపాటి నాగమణికి ఇద్దరు కుమారులు. వారిలో పెద్ద కుమారుడు సురేష్ అరబిందో కంపెనీలో టాంకర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. రెండో కుమారుడు విజయ్ కుమార్ (24) కాకినాడ ఆర్టీసీలో కాంట్రాక్ట్ పద్ధతిపై డ్రైవర్‌గా పనిచేసి, మానేసి ప్రస్తుతం ఇంటి వద్దనే ఉంటున్నాడు. తాను ప్రేమించిన యువతి చనిపోయిందని తానూ చనిపోవాలనుకుంటున్నట్టు కొంతకాలంగా విజయ్‌కుమార్ తల్లితో చెప్పేవాడు. ఎవరి కోసమో నువ్వెందుకు చనిపోవడం మేమందరం ఉన్నాం కదా అని తల్లి ధైర్యం చెప్పేది. ఈ నేపథ్యంలో ఈనెల 24వ తేదీ సాయంత్రం విజయ్ కుమార్ గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అతడు వాంతులు చేసుకోవడం చూసిన స్థానికులు అతని అన్న సురేష్‌కు సమాచారం ఇచ్చారు. అతడు వెంటనే వచ్చి అంబులెన్స్‌లో పిఠాపురం ప్రభుత్వాస్పత్రికి తీసుకువెళ్లగా అక్కడ ప్రధమ చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. బుధవారం చికిత్స పొందుతూ అతడు మృతి చెందాడు. బంధువుల ఫిర్యాదు మేరకు ఎస్సై ఎన్.రామకృష్ణ కేసు దర్యాప్తు చేసున్నారు.
పురుగు మందు తాగి యువకుడి ఆత్మహత్య