
దేవుని భూములపై స్కెచ్!
● టీడీపీ ప్రజాప్రతినిధి
అనుచరుడికే దక్కేలా ప్లాన్
● వేలంలో చక్రం తిప్పిన అధికార
పార్టీ నాయకులు
రాజమహేంద్రవరం రూరల్: అధికారం అండతో టీడీపీ నాయకులు ఏకంగా దేవుడి ఆదాయానికే టెండర్ పెట్టారనే ఆరోపణలు వస్తున్నాయి. వివరాల్లోకి వెళ్తే.. రాజమహేంద్రవరం శ్రీ ఉమా కోటిలింగేశ్వరస్వామి, శ్రీ సీతారామస్వామి దేవస్థానానికి బొమ్మూరులోని సర్వే నంబర్ ఎల్‌పీ నంబర్–65లో 6.15 ఎకరాల భూమి ఉంది. అందులో నాలుగెకరాలను కమర్షియల్ విధానంలో నాలుగు బిట్లుగా విభజించి బహిరంగ వేలం వేస్తున్నట్లు దేవదాయ శాఖ అధికారులు ఇటీవల ప్రకటించారు. ఈ మేరకు బొమ్మూరు గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో దేవదాయ శాఖ రీజినల్ జాయింట్ కమిషనర్ వి.త్రినాథరావు, డిప్యూటీ కమిషనర్ డీఎల్‌వీ రమేష్‌బాబు, అసిస్టెంట్ కమిషనర్ సుబ్బారావు సమక్షంలో గురువారం వేలం నిర్వహించారు. ముందుగా డీడీలు తీసిన వారే వేలంలో పాల్గొనాలని నిర్ణయించారు. జాతీయ రహదారికి చేరువన ఉన్న ఈ భూమిపై కన్ను వేసిన అధికార పార్టీ నాయకులు చక్రం తిప్పారు. తమ వారి పేర్లతోనే నాలుగు టెండర్లు దాఖలు చేశారు. వాస్తవానికి నాలుగు బిట్లుగా వేలం ప్రక్రియ చేపట్టడంతో ప్రతి బిట్‌కు ప్రత్యేకంగా డీడీ తీయాల్సి ఉంటుంది. కానీ, అధికార పార్టీ కనుసన్నల్లో ఈ వేలం జరగడంతో కేవలం ఒకే ఒక్క డీడీతో నాలుగు బిట్లకు పాల్గొనే వెసులుబాటు కల్పించారు. అధికార పార్టీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి ప్రధాన అనుచరుడు స్వయంగా ఈ వేలంలో పాల్గొనడంతో ఇతరులెవ్వరూ పాల్గొనకుండా కట్టడి చేశారనే ఆరోపణలు వస్తున్నాయి. నాలుగు బిట్లకు నెలకు రూ.3,24,000, జీఎస్‌టీతో కలిపి రూ.3,82,320 చొప్పున చెల్లించే విధంగా పాట దక్కించుకున్నారు. పదకొండేళ్ల లీజు కాలానికి గాను ప్రతి నెలా రూ.3,82,320తో పాటు మూడేళ్లకోసారి 30 శాతం పెంచే విధంగా ఒప్పందం జరిగింది. ఈ భూములను దేనికి వినియోగించాలనేది అధికారులు చెప్పలేదు. జాతీయ రహదారి సమీపాన ప్రత్యేకమైన రోడ్డు కలిగిన ఈ భూముల్లో షెడ్లు నిర్మించి, ఉల్లిపాయలు నిల్వ చేసుకునేందుకు నిర్ణయించారని సమాచారం. అయితే, విస్తృత ప్రచారం చేసి, ఈ భూములకు బహిరంగ వేలం నిర్వహిస్తే దేవదాయ శాఖకు మరింత ఆదాయం చేకూరేదని పలువురు అంటున్నారు.