
రోడ్డు.. బ్యాడ్..
● యమపురికి దారుల్లా..
దేవరపల్లి/పెరవలి: ‘సంక్రాంతి నాటికి గుంతలు లేని రోడ్లు’ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు, కూటమి నేతలు చాలా గొప్పగా ప్రకటించారు. యుద్ధ ప్రాతిపదికన పనులు చేసేస్తామన్నారు. రోడ్లు అద్భుతంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. ఎక్కడైనా ఒక రోడ్డుకు చిన్నపాటి మరమ్మతులు చేయగానే.. ‘అద్దంలా రోడ్లు.. నాడు నరకం – నేడు స్వర్గం అనే రీతిలో ‘పచ్చ’ మీడియా డప్పేసి చాటింది. సంక్రాంతి వెళ్లిపోయింది.. ఉగాది వెళ్లిపోయింది.. కాలం గడుస్తూనే ఉంది. ఇప్పుడు కూటమి వారి ఏలికలో ఎక్కడ చూసినా గుంతలు పడిన రోడ్లే దర్శనమిస్తున్నాయి. నిలువునా ఛిద్రమై.. అడుగడుగునా గుంతలు పడి.. చిన్నపాటి వర్షాలకే చెరువుల్లా మారిన రోడ్లపై వెళ్తూంటే నడుములు విరిగిపోతున్నాయని ప్రయాణికులు గగ్గోలు పెడుతున్నారు. గ్రామీణ, ఆర్‌అండ్‌బీ, హైవే అనే తేడా లేకుండా జిల్లాలో ఎక్కడ చూసినా రహదారులు దారుణంగా కనిపిస్తున్నాయి.
● నిడదవోలు – పొంగుటూరు ఆర్‌అండ్‌బీ రోడ్డు యర్నగూడెం – పొంగుటూరు మధ్య పరమ అధ్వానంగా ఉంది. దీనిని 2016–17లో సుమారు రూ.15 కోట్లతో విస్తరించారు. తరువాత జంగారెడ్డిగూడెం నుంచి దేవరపల్లి రోడ్డు పూర్తిగా దెబ్బ తిడంతో హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరం వైపు వెళ్లే భారీ వాహనాలను పొంగుటూరు నుంచి యర్నగూడెం వైపు మళ్లించారు. దీంతో, ఈ రోడ్డు పూర్తిగా ధ్వంసమైంది. యాదవోలు – పొంగుటూరు మధ్య వాన నీటితో చెరువులను తలపిస్తోంది.
● తల్లాడ – దేవరపల్లి రహదారి గోపాలపురం వద్ద పెద్దపెద్ద గుంతలు పడి ధ్వంసమైంది. ఈ రోడ్డుపై ప్రయాణిస్తున్న వారు ప్రమాదాలకు గురవుతున్నారు. మూడేళ్ల క్రితం ఈ రోడ్డును రెండు లేన్లుగా అభివృద్ధి చేశారు.
● గుండుగొలను – కొవ్వూరు హైవే నుంచి బుచ్చియపాలెం వెళ్లే రోడ్డు దారుణంగా మారింది. సుమారు 9 కిలోమీటర్ల మేర ఈ తారు రోడ్డు ప్రస్తుతం మట్టి రోడ్డులా మారింది. పెద్దపెద్ద గోతులు ఏర్పడ్డాయి. బుచ్చియపాలెం, అచ్చియపాలెం, కోమటికుంట మీదుగా ఈ రోడ్డు గోపాలపురం వెళుతుంది.
● దేవరపల్లి – దుద్దుకూరు మధ్య పెట్రోలు బంకు వద్ద పాత జాతీయ రహదారి పూర్తిగా గుంతలు పడి బురదమయంగా మారింది. భారీ వాహనాలు వెళ్తున్నప్పుడు బురద చిమ్మటంతో రోడ్డుపై వెళుతున్న వారు అసహనానికి గురవుతున్నారు.
● దుద్దుకూరు – పంగిడి మధ్య రోడ్డు పూర్తిగా బురద మయంగా మారింది. ఈ ప్రాంతాల్లో రోడ్డుకు ఇరువైపులా క్వారీలు, క్రషర్లు ఉన్నాయి. దీంతో క్వారీల్లోని మట్టి లారీల టైర్ల ద్వారా రహదారిని కప్పేస్తోంది. చినుకు పడితే చాలు.. ఈ రోడ్డుపై ప్రయాణం సాహసోపేతంగా ఉంటోంది. బైక్‌లు బురద మట్టిలో జర్రున జారి పడిపోతున్నాయి. ఆ ప్రాంతాల్లో నిత్యం ప్రయాణికులు ప్రమాదాలకు గురవుతున్నారు.
● ఏలూరు – గుండుగొలను – కొవ్వూరు (ఈజీకే) రోడ్డు నుంచి లక్ష్మీపురం ఆర్‌అండ్‌బీ రోడ్డు పూర్తిగా మట్టి రోడ్డుగా మారిపోయింది. సుమారు 50 టన్నుల బరువైన క్వారీ లారీలు తిరగడంతో ఈ రహదారి పూర్తిగా దెబ్బ తింది.
● పెరవలి మండలం కానూరు – నడుపల్లి మధ్య ఆర్‌అండ్‌బీ రోడ్డుపై నిత్యం వందలాది మంది రాకపోకలు సాగిస్తారు. ఈ రోడ్డు ప్రస్తుతం అడుగో గొయ్యి – గజానికో నుయ్యి అన్న చందంగా మారింది. చినుకు పడితే చాలు.. ఈ రోడ్డులో ఏర్పడిన గోతులు మడుగుల్లా మారిపోతున్నాయి. దీంతో ఈ రోడ్డుపై ప్రయాణం ప్రాణసంకటంలా మారిందని ప్రయాణికులు వాపోతున్నారు. అయినప్పటికీ అధికారులు మాత్రం కన్నెత్తి కూడా చూడటం లేదు. ఈ మార్గంలో నిత్యం ఎవరో ఒకరు పడిపోయి గాయపడటం పరిపాటిగా మారింది. కానూరు వద్ద కల్వర్టు నిర్మించకపోవడంతో నిడదవోలు – నరసాపురం ఆర్‌అండ్‌బీ రోడ్డులో రాకపోకలు నిలిపివేశారు. దీంతో ఈ రోడ్డులో రాకపోకలు సాగించే వాహనాలను కానూరు – నడుపల్లి మీదుగా మళ్లించారు. ఫలితంగా అసలే అంతంత మాత్రంగా ఉన్న రోడ్డు పూర్తిగా దెబ్బ తింది. అయినప్పటికీ, ప్రభుత్వం అటు కల్వర్టు నిర్మాణాన్ని, ఇటు రోడ్డు అభివృద్ధిని పట్టించుకోవడం లేదు. పగటి వేళ గోతులు కనిపిస్తున్నా రాత్రి సమయాల్లో ఈ రోడ్డులో రావాలంటే ప్రయాణికులు హడలిపోతున్నారు.
ధ్వంసమైన రహదారులు
అడుగడుగునా గుంతలు
చెరువులను తలపించేలా ఛిద్రం
బెంబేలెత్తుతున్న ప్రయాణికులు
పట్టించుకోని సర్కారు

రోడ్డు.. బ్యాడ్..

రోడ్డు.. బ్యాడ్..

రోడ్డు.. బ్యాడ్..

రోడ్డు.. బ్యాడ్..