
వానాకాలం.. పిడుగుల గండం..
రాయవరం/అంబాజీపేట: ఎండాకాలం తర్వాత వచ్చే వర్షాకాలం చాలా ఆహ్లాదంగా ఉంటుంది. వానల కారణంగా చెట్లు, పొలాలు ఆకుపచ్చ రంగులో కనువిందు చేస్తుంటాయి. సాగు పనులతో గ్రామాల్లో సందడి నెలకొంటుంది. అదే సమయంలో వర్షాకాలం ప్రమాదాలను కూడా తీసుకువస్తుంది. వాటిలో పిడుగులతో అనేక అనర్థాలు కలుగుతాయి. సాధారణంగా వర్షం కురిసే సమయంలో ఉరుములతో పాటు పిడుగులు పడుతుంటాయి. వాటి వల్ల పెద్ద ధ్వనులు, వెలుతురుతో పాటు విద్యుత్ శక్తి విడుదలవుతుంది. తుపానులు, భారీ వర్షాల సమయంలో పిడుగులు పడే అవకాశం ఉందంటూ విపత్తు నివారణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. అయితే పిడుగు ఎలా పడుతుంది, ఆ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
అనేక అనర్థాలు
పిడుగుల వల్ల అనేక అనర్థాలు కలుగుతాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పొలాల్లో పశువులను మేపుకొనే కాపరులు, వ్యవసాయ పనులు చేసుకునే రైతులు, కూలీలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఒక్కొక్కసారి చెట్లు, మూగజీవాలు కూడా పిడుగుపాటుకు గురై మృత్యువాత పడుతున్నాయి. పిడుగు అంటే ఆకాశంలో సహజ సిద్ధంగా ఉత్పన్నమయ్యే విద్యుదాపాతం. మేఘాలు ఢీకొన్నప్పుడు వెలువడే కాంతిని మెరుపు, శబ్దాన్ని ఉరుము, ఉత్పన్నమయ్యే విద్యుత్తును పిడుగు అని పిలుస్తారు. అత్యధిక విద్యుత్తును కలిగిన పిడుగు పడడం వల్ల అసాధారణ నష్టాలు సంభవిస్తుంటాయి.
ఒక్క పిడుగులో..
ఒక్క పిడుగులో ఒక పట్టణ అవసరాలకు ఆరు నెలల పాటు విద్యుత్తు అందించగలిగే శక్తి ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. విరుద్ధ ఆవేశాలున్న మేఘాల మధ్య రాపిడి జరిగినప్పుడు మెరుపులు, ఉరుములు ఏర్పడతాయి. ఆ సమయంలో మేఘాల్లో రాపిడితో జనించే ఉష్ణం 50 వేల డిగ్రీల ఫారన్ గ్రేడ్ వరకూ ఉంటుందని అంచనా. ఈ వేడి అణువులన్నీ కలిసి ఒక నాళం మాదిరిగా ఏర్పడి భూమి మీద ఉన్న పాజిటివ్ ఎనర్జీతో కలిస్తే పిడుగు అవుతుంది. ఒక మిల్లీ సెకను కాలంలో మెరుపులతో కూడిన పిడుగు 20 ఆంపియర్ల విద్యుత్తు ప్రవాహాన్ని ఏర్పరుస్తుంది. ఆ సమయంలో ఏర్పడే క్షేత్ర తీవ్రత మీటర్‌కు 2 లక్షల ఓల్టులతో సమానమని చెబుతారు. మేఘాలు ఢీకొన్నప్పుడు జనించే విద్యుత్ తరంగాలు సన్నని మార్గంలో భూమి మీదకు చేరేందుకు వాహనాలను వెదుక్కొంటాయి. ఎత్తయిన చెట్లు, ఇనుప స్తంభాలు, ధ్వజ స్తంభాలు, ఎత్తయిన భవనాలపై కూడా పడతాయి.
కాపర్ ఎర్త్
పిడుగు నుంచి తప్పించుకునేందుకు ఎత్తయిన ప్రదేశం నుంచి నేరుగా భూమిలోకి కాపర్ ఎర్త్ (రాగి వైరును అనుసంధానం చేస్తూ భూమిలోకి పాతాలి) ఏర్పాటు చేసుకోవాలి. ఇది దాదాపు కిలోమీటరు దూరంలో పడిన పిడుగును నేరుగా భూమిలోకి ఆకర్షించుకుంటుంది. ఉప్పు, కర్పూర బొగ్గు, నీటి మిశ్రమాలతో రాగి వైరు కలిగిన రాడ్‌ను భూమి లోపలకు ఏర్పాటు చేయడం వల్ల ప్రమాదాలను నివారించే అవకాశం ఉంటుంది.
పిడుగులతో అత్యంత ప్రమాదం
వర్షాల సమయంలో అప్రమత్తత అవసరం
జాగ్రత్తలు అవసరం
వర్షం కురిసేటప్పుడు చెట్ల కింద ఉండకూడదు. ముఖ్యంగా ఎత్తయిన చెట్లపై ఎక్కువగా పిడుగులు పడే అవకాశం ఉంది.
ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే సమయంలో పొలాలు, బహిరంగ ప్రదేశాల్లో ఉండకూడదు. పిడుగులో లక్షల డిగ్రీల ఉష్ణోగ్రతతో విడుదలయ్యే వేడి ఒక్కసారిగా మనిషిని చేరగానే గుండైపె ప్రభావం చూపుతుంది.
వర్షం కురుస్తున్న సమయంలో అందరూ గొడుగులను వాడుతుంటారు. అయితే వాటిపై ఇనుప బోల్టులు లేకుండా చూసుకోవాలి. మీ దగ్గర కెమెరాలు, సెల్ ఫోన్లు ఉంచుకోకూడదు. లేకుంటే రేడియేషన్ తరంగాలకు గురై ప్రమాదం జరిగే అవకాశం ఉంది.
మెరుపులు, పిడుగుల వల్ల విద్యుత్ ఉపకరణాలు కాలిపోయే అవకాశం ఉంది. ఆ సమయంలో టీవీలకు ఉన్న విద్యుత్ కేబుల్ కనెక్షన్ తొలగించాలి.
వర్షం కురుస్తున్న సమయంలో విద్యుత్ తీగల కింద, ట్రాన్స్‌ఫార్మర్ సమీపంలో ఉండకూడదు. తడి ప్రదేశాల్లో ఉండకపోవడం చాలా మంచిది.
ఉరుములతో కూడిన వర్షం పడే సమయంలో చెరువులు, నది, సముద్రంలో ఈత కొట్టరాదు.

వానాకాలం.. పిడుగుల గండం..