
స్వల్పంగా పెరిగిన పొగాకు ధర
దేవరపల్లి: వర్జీనియా పొగాకు ధర మార్కెట్‌లో స్వల్పంగా పెరిగింది. రాజమహేంద్రవరం రీజియన్ పరిధిలోని ఐదు వేలం కేంద్రాలకు బుధవారం 5,516 బేళ్లు అమ్మకానికి రాగా, వాటిలో 3917 బేళ్లు కొనుగోలు చేశారు. 1,599 బేళ్లను ట్రేడర్లు తిరస్కరించారు. కిలో గరిష్ట ధరను రూ.3 పెంచి కొనుగోలు చేశారు. మార్చి 24 నుంచి ఈ నెల 22 వరకు మార్కెట్లో కిలో గరిష్ట ధర రూ.290 పలికింది. దాదాపు 72 రోజులు ఈ ధర నిలకడగా కొనసాగింది. మంగళవారం మార్కెట్లో కిలో ధర రూ.291 పలకగా, బుధవారం మార్కెట్లో రూ.292 నుంచి రూ.293 లభించింది. అంటే మూడు రోజుల వ్యవధిలో రూ.3 పెరిగింది.
ఎక్స్ గ్రేడ్ పొగాకుపై ఆసక్తి
ఎక్స్ గ్రేడ్ పొగాకు కొనుగోలుకు ట్రేడర్లు ఆసక్తి చూపడంతో రైతులు తమ వద్ద ఉన్న ఆ గ్రేడ్ పొగాకును వేలం కేంద్రాలకు తీసుకువచ్చి విక్రయిస్తున్నారు. అయితే ఈ ధర కంటితుడుపు చర్య మాత్రమేనని, కిలోకు సగటు ధర రూ.350 ఉంటే గిట్టుబాటు అవుతుందని కౌలు రైతులు చెబుతున్నారు. బుధవారం మార్కెట్లో ఐదు వేలం కేంద్రాల్లో ఎన్‌ఎల్‌ఎస్ పొగాకు 1,66,537 కిలోలు కొనుగోలు చేయగా, బ్లాక్ సాయిల్(బీఎస్) పొగాకు 7,086 కిలోలు కొనుగోలు చేశారు. ఇప్పటి వరకు 21.41 మిలియన్ల కిలోల పొగాకు విక్రయాలు జరిగినట్టు పొగాకు బోర్డు రీజినల్ మేనేజర్ జీఎల్‌కే ప్రసాద్ తెలిపారు. వేలం కేంద్రాల వారీగా దేవరపల్లిలో కిలో గరిష్ట ధర రూ.292, సగటు ధర రూ.268, జంగారెడ్డిగూడెం–1లో గరిష్ట ధర రూ.293, సగటు ధర రూ.276, జంగారెడ్డిగూడెం–2లో గరిష్ట ధర రూ.292, సగటు ధర రూ.279.27, కొయ్యలగూడెంలో గరిష్ట ధర రూ.293, సగటు ధర రూ.271.55, గోపాలపురంలో గరిష్ట ధర రూ.293, సగటు ధర రూ.279.17 లభించింది. ఐదు వేలం కేంద్రాల కిలో సగటు ధర రూ. 275.09 పలికింది.
కిలో గరిష్ట ధర రూ.293
కొనసాగుతున్న కొనుగోళ్లు