
మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీగా సత్యనారాయణ
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): జిల్లా మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీగా కేవీ సత్యనారాయణ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. 1991 బ్యాచ్‌కు చెందిన ఆయన ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో సీఐగా, కాకినాడ ట్రాఫిక్ డీఎస్పీగా, రాజమహేంద్రవరం స్పెషల్ బ్రాంచి, ఏలూరు మహిళా పోలీస్ స్టేషన్, పరవాడ డీఎస్పీగా విధులు నిర్వహించారు. రాష్ట్ర పోలీస్ ప్రధాన కార్యాలయంలో పని చేస్తూండగా సాధారణ బదిలీల్లో భాగంగా ఆయనను జిల్లా మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీగా నియమించారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ, శక్తి యాప్ గురించి జిల్లా ఎస్పీ డి.నరసింహ కిషోర్ ఆధ్వర్యాన జిల్లావ్యాప్తంగా విస్తృత అవగాహన కల్పిస్తానని చెప్పారు. మహిళల మొబైల్ ఫోన్లలో ఈ యాప్ ఇన్‌స్టాల్ చేయించి, తద్వారా మహిళలు, బాలికలపై జరిగే నేరాలను అరికడతామని అన్నారు. మహిళల ఫిర్యాదులపై తక్షణమే స్పందించి, తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
అంబేడ్కర్ ఆశయాలు స్ఫూర్తిదాయకం
రాజమహేంద్రవరం రూరల్: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆశయాలు భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకమని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అన్నారు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఆ మహనీయుని చిత్రపటానికి బొమ్మూరులోని రూరల్ నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో వేణు పూలమాలలు వేసి, నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, అణగారిన వర్గాల అభ్యున్నతికి అంబేడ్కర్ విశేషంగా కృషి చేశారన్నారు. వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గత ఐదేళ్ల పాలనను అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా అందించారని గుర్తు చేశారు. కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ నక్కా రాజబాబు, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి గిరజాల వీర్రాజు (బాబు), మాజీ ఎంపీపీ రేలంగి సత్యనారాయణ, ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షుడు చీకురుమిల్లి చిన్న, మహిళా అధ్యక్షురాలు అంగాడి సత్యప్రియ తదితరులు పాల్గొన్నారు.
అంబేడ్కర్‌కు ఘన నివాళి
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఆ మహనీయునికి జాయింట్ కలెక్టర్ ఎస్.చిన్నరాముడు ఘనంగా నివాళి అర్పించారు. కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన ఈ కార్యక్రమంలో అంబేడ్కర్ చిత్రపటానికి ఆయన పూలమాల వేసి నివాళి అర్పించారు. ఆ మహనీయుని సేవల ను స్మరించుకున్నారు. వివిధ శాఖలు, కలెక్టరేట్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
చదువుతోనే ఉన్నత స్థాయికి..
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహాల విద్యార్థులు ఇంటర్మీడియెట్ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించి, ఆదర్శంగా నిలిచారని జాయింట్ కలెక్టర్ ఎస్.చిన్నరాముడు అన్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా గోకవరం బస్టాండ్ సమీపాన సోమవారం నిర్వహించిన వేడుకల్లో.. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థినులను అభినందించి, ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాజమహేంద్రవరంలోని సాంఘిక సంక్షేమ కళాశాల బాలికల వసతి గృహం–2కు చెందిన గోలి మౌనిక ఫస్టియర్‌లో 423/500, సెకండియర్‌లో మద్దల సుశీల 910/1000 చొప్పున అత్యధిక మార్కు లు సాధించారని తెలిపారు. వారిని అభినందించారు. వచ్చే విద్యా సంవత్సరంలో మరింత మెరుగైన ఫలితాలు సాధించేలా కృషి చేస్తామని జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి ఎంఎస్ శోభారాణి అన్నారు. అదనపు ఎస్పీ మురళీకృష్ణ, ఆర్‌డీఓ ఆర్.కృష్ణనాయక్ పాల్గొన్నారు. అనంతరం దాతల సహకారంతో పలువురికి చీరలు పంపిణీ చేశారు.

మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీగా సత్యనారాయణ

మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీగా సత్యనారాయణ