
గంటలో బాలిక ఆచూకీ లభ్యం
పెదపూడి: అనపర్తి మండలం కుతుకులూరు గ్రామంలో నాలుగో తరగతి విద్యార్థిని అదృశ్యం సంఘటన కలకలం రేపగా, గంట వ్యవధిలో పోలీసులు ఆ బాలికను పట్టుకుని తల్లిదండ్రులకు అప్పగించారు. అనపర్తి ఎస్సై శ్రీనునాయక్ తెలిపిన వివరాల మేరకు, కుతుకులూరు గ్రామంలో లంక సత్యనారాయణ కుమార్తె షర్మిల రామవరం ఎంపీపీ స్కూల్‌లో నాలుగో తరగతి చదువుతోంది. గురువారం ఉదయం టిఫిన్ తెచ్చుకోడానికి ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆమె తిరిగి రాలేదు. దీంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు చట్టుపక్కల వెతికినా బాలిక ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ సుమంత్ సూచనలతో రంగంలోకి దిగిన అనపర్తి ఎస్సై శ్రీను నాయక్, అదనపు ఎస్సై దుర్గాప్రసాద్ తమ సిబ్బంది బాలిక కోసం గాలింపు చేపట్టారు. గంట వ్యవధిలోనే కుతుకులూరు గ్రామంలో ఓ చోట బాలికను పోలీసులు కనుగొన్నారు. ఈ సంఘటనపై బాలికను పోలీసులు వివరాలు అడగ్గా, బాగా చదవడం లేదని తల్లిదండ్రులు మందలించినందుకు వెళ్లిపోయినట్టు చెప్పిందని ఎస్సై తెలిపారు. వెంటనే స్పందించి, బాలిక ఆచూకీని కనుగొన్న పోలీసులను తల్లిదండ్రులు, గ్రామస్తులు అభినందించారు.
తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు