రబీకి సమృద్ధిగా సాగునీరు | Sakshi
Sakshi News home page

రబీకి సమృద్ధిగా సాగునీరు

Published Thu, Nov 16 2023 6:18 AM

- - Sakshi

సాక్షి, రాజమహేంద్రవరం: గోదావరి డెల్టాలో రబీ ఆయకట్టుకు అత్యంత ప్రాధాన్యముంది. తూర్పుగోదావరి, కోనసీమ, కాకినాడ, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల పరిధిలో విస్తరించి ఉండటమే ఇందుకు కారణం. అంతటి ప్రాధాన్యాన్ని సంతరించుకున్న రబీ సాగుకు సంవృద్ధిగా సాగునీటిని అందించేందుకు ప్రభుత్వం, అధికార యంత్రాంగం ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తోంది. వర్షాభావ పరిస్థితులతో గోదావరిలో ఇన్‌ఫ్లో తక్కువగా ఉంది. ఈ పరిణామం రబీ పంటల సాగుపై చూపే అవకాశం ఉంది. అలాంటి పరిస్థితులు తలెత్తకుండా, ఏ ఒక్క రైతూ నీటి కొరత కారణంగా నష్టపోకూడదన్న మహోన్నత ఆశయంతో చర్యలు చేపడుతోంది. ఇప్పటికే అందుబాటులో ఉన్న నీటితో పాటు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా సేకరించి అందించేందుకు కార్యచరణ ప్రణాళిక రూపొందించింది. రబీకి అవసరమైన సాగునీరు (డిసెంబర్‌ 23 నుంచి మార్చి 24 వరకూ) సరఫరా కార్యాచరణ ప్రణాళికపై బుధవారం కలెక్టరేట్‌లో జిల్లా స్థాయి నీటి పారుదల సలహా మండలి సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ కె.మాధవీలత అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలు అంశాలపై మంత్రులు, ఎంపీ, జెడ్పీ చైర్మన్‌, అధికారులు చర్చించారు.

8,96,507 ఎకరాల రబీ ఆయకట్టు

గోదావరి డెల్టా పరిధిలో 8,96,507 ఎకరాల రబీ ఆయకట్టు ఉంది. తూర్పు డెల్టా పరిధిలో 2,64,507 ఎకరాలు, సెంట్రల్‌ డెల్టాలో 1,72,000 ఎకరాలు, వెస్ట్రన్‌ డెల్టా కింద 4,60,000 ఎకరాలు విస్తరించింది. వీటిలో పంటల సాగుకు 91.35 టీఎంసీల సాగునీటి ఆవశ్యకత ఉంది. ప్రస్తుతం 82.49 టీఎంసీలు అందుబాటులో ఉంది. దీంతో 8.86 టీఎంసీల నీటి కొరత ఏర్పతుందని అంచనా వేస్తున్నారు. వాటిని అధిగమించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారించారు. టర్న్‌ సిస్టం(వారబందీ) ద్వారా నీటిని పొదుపు చేసి 5 టీఎంసీలు, కాలువలపై క్రాస్‌ బండ్‌ల ఏర్పాటు, డీజిల్‌ పంపుల వినియోగించి నీటిని ఎత్తి వేయడం లాంటి పద్ధతులతో 3.86 టీఎంసీల నీటిని సమకూర్చేందుకు ప్రణాళికలు రూపొందించారు. ఈ అంశంపై జిల్లా మంత్రులు, ఎంపీ, కలెక్టర్‌ ఏ మన్నారంటే..

సాగునీటి వనరులపై చర్చ:

కె.మాధవీలత, కలెక్టర్‌

వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రానున్న రబీ సీజన్‌లో సాగునీటి వనరులపై చర్చించాం. అందుబాటులో ఉన్న సాగునీటి వనరులను ఎలా వినియోగించాలి, తద్వారా రబీ సాగుకు సమర్థంగా ఎలా అందించాలి? అన్న అంశాలపై చర్చించాం. ఆ మేరకు ప్రభుత్వానికి నివేదిక అందజేస్తాం. పోలవరం ప్రాజెక్టు వద్ద నీటి నిల్వ చేయడం, మండల స్థాయి వ్యవసాయ సలహా మండలి సమావేశం రెండుసార్లు (నవంబర్‌ నెలాఖరు, డిసెంబర్‌ రెండో వారం) నిర్వహించి డిసెంబర్‌లో నాట్లు పూర్తి చేసేలా అవగాహన కల్పించడంపై తీర్మానం చేశాం. లిఫ్ట్‌ ఇరిగేషన్‌ కింద మోటార్ల మరమ్మతులు, క్రాస్‌ బండ్‌ ఏర్పాట్లు, డీ సిల్టింగ్‌, డీ వీడింగ్‌, స్లూయీస్‌ తదితర 20 పనులకు రూ.103.69 లక్షలతో ప్రతిపాదనలు పంపించాం. కాగా.. సమావేశంలో ఎంపీ మార్గాని భరత్‌ రామ్‌, జెడ్పీ చైర్మన్‌ విప్పర్తి వేణుగోపాలరావు, డీసీసీబీ చైర్మన్‌ ఆకుల వీర్రాజు, ఎమ్మెల్యేలు జక్కంపూడి రాజా, సత్తి సూర్యనారాయణ రెడ్డి, రైతు ప్రతినిధులు పలు అంశాలను సమావేశం దృష్టికి తీసుకవచ్చారు. జేసీ తేజ్‌ భరత్‌, వ్యవసాయ సలహా మండలి చైర్మన్‌ బూరుగుపల్లి సుబ్బారావు, రైతు ప్రతినిధులు, ఇరిగేషన్‌ ఎస్‌ఈ జి.శ్రీనివాసరావు, వ్యవసాయ అధికారి ఎస్‌.మాధవరావు పాల్గొన్నారు.

కొరత ఉన్నా పూర్తిస్థాయిలో

అందించేందుకు కార్యాచరణ

సాగునీటి ఆవశ్యకత 91.35 టీఎంసీలు

అందుబాటులో 82.49 టీఎంసీలు

ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా

సమకూర్చేందుకు ప్రణాళిక

జిల్లా నీటి పారుదల సలహా మండలి సమావేశంలో నిర్ణయం

ప్రతి నీటి బొట్టు వినియోగం

తానేటి వనిత, హోం మంత్రి

నీటి లభ్యత తక్కువగా ఉన్న దృష్ట్యా ప్రతి నీటి బొట్టు వినియోగించుకోవాలి. ప్రతి నియోజకవర్గ పరిధిలో ఆయకట్టుకు సాగునీరు అందించే సామర్థ్యం పెంచుకోవాలి. గత సీజన్‌లో మాదిరి ప్రస్తుతం కూడా రైతులకు సకాలంలో నీరు అందించాల్సిన బాధ్యత మనపై ఉంది. రైతు సంక్షేమ ప్రభుత్వ విధానంలో రైతు స్నేహ పూర్వక విధానం అమలు చేయడం జరుగుతోంది.

రైతులకు సూచనలు

నవంబర్‌ 30వ తేదీలోగా ఖరీఫ్‌ పంట కోతలు పూర్తి చేయాలి.

రబీ నాట్లను ముమ్మరం చేసేలా డిసెంబర్‌ 1 నుంచి 10వ తేదీ వరకు రైతులకు అవగాహన కల్పించడం.

డిసెంబర్‌ 31 నాటికి రబీ సీజన్‌ నాట్లు పూర్తి చేయాలి.

వరికి ప్రత్యామ్నాయంగా మినుములు సాగు చేసే రైతులకు సబ్సిడీపై విత్తనాలు అందిస్తారు.

రైతు పక్షపాత ప్రభుత్వం

చెల్లుబోయిన వేణు, జిల్లా ఇన్‌చార్జి మంత్రి

జిల్లాలో ప్రస్తుత రబీ సీజన్లో వరికి అనుకూలంగా ఉన్న 64,361 ఎకరాలకు సాగునీరు అందిస్తాం. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఆదేశాల మేరకు ప్రతి ఎకరాకు సాగునీరు ఇస్తాం. అందుకు అవసరమైన నిధులు సమకూర్చుకుంటాం. నవంబర్‌ నెలాఖరు నాటికి ఖరీఫ్‌ కోతలు పూర్తి చేసి, డిసెంబర్‌ 1 నుంచి 10 లోగా రబీ సీజన్‌ నాట్లు కోసం రైతులు సిద్ధంగా ఉండాలి. అప్పుడే డిసెంబర్‌ 31వ తేదీ నాటికి నాట్లు పూర్తి చేయగలం. ఖరీఫ్‌లో ఆలస్యంగా పంట వేసిన వారిని రబీకి త్వరతగతిన సిద్ధం చేయాల్సిన చర్యలపై సమావేశంలో తీర్మానం చేశాము. పోలవరం ప్రాజెక్టు కింద రైతుల అవసరాలకు అనుగుణంగా నీటి నిల్వ ఏ విధంగా ఉంచాలనే అంశం చర్చించి, ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని ప్రతిపాదించాము. రబీ పంట పండిస్తామా ? లేదా? అనే ఆందోళనలో ఉన్న పచ్చ పత్రికల్లో కథనాలు, ప్రతి పక్షాల ఆరోపణలకు ఫుల్‌ స్టాప్‌ పెడుతూ సాగునీరు అందించే దిశగా అడుగులు వేస్తున్నాం. ఈ మేరకు ముఖ్యమంత్రికి రైతుల పక్షాన ధన్యవాదాలు తెలుపుతున్నాం.

 
Advertisement
 
Advertisement