కులగణనతో సమసమాజ స్థాపన | Sakshi
Sakshi News home page

కులగణనతో సమసమాజ స్థాపన

Published Wed, Nov 15 2023 7:21 AM

- - Sakshi

ఎంపీ భరత్‌రామ్‌

రాజమహేంద్రవరం రూరల్‌: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న కులగణనతో సమ సమాజ స్థాపన సాధ్యమవుతుందని వైఎస్సార్‌ సీపీ పార్లమెంటరీ చీఫ్‌ విప్‌, ఎంపీ మార్గాని భరత్‌ రామ్‌ అన్నారు. ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఆశయ సాధన దిశగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అడుగులు వేస్తున్నారన్నారు. కులగణనతో అన్ని వర్గాల ప్రజలకూ న్యాయం జరుగుతుందన్నారు. సామాజిక, రాజకీయ, ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయన్నారు. ఏ కులంలో ఎంత మంది జనాభా ఉన్నారనేది స్పష్టంగా వెల్లడవుతుందన్నారు. జనాభా దామాషా ప్రకారం ఆయా కులాలకు న్యాయం చేయడానికే సీఎం జగన్‌ ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టారన్నారు. కులగణన పూర్తి నివేదిక తయారైన తరువాత అందుకు తగ్గ రిజర్వేషన్లు, తదితర వాటిల్లో సమన్యాయం పాటించడానికి అవకాశం ఉంటుందన్నారు.

నేడు వైద్యశిబిరాలు

రాజమహేంద్రవరం రూరల్‌: జిల్లాలోని రాజవోలు–2(రాజమహేంద్రవరం రూరల్‌), లాలాచెరువు–2 (రాజానగరం) సచివాలయాల పరిధిలోని విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌లలో బుధవారం జగనన్న ఆరోగ్య సురక్ష వైద్యశిబిరాలు జరగనున్నాయి. కలెక్టర్‌ మాధవీలత మంగళవారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు.

నేడు ట్రైనింగ్‌ సెంటర్‌కు

శంకుస్థాపన

కంబాలచెరువు (రాజమహేంద్రవరం): రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో రీజినల్‌ ట్రైనింగ్‌ సెంటర్‌కు బుధవారం రాష్ట్ర హోం, విపత్తుల నిర్వహణశాఖ మంత్రి డాక్టర్‌ తానేటి వనిత శంకుస్థాపన చేయనున్నారు. ఈ విషయాన్ని కేంద్ర కారాగారం సూపరింటెండెంట్‌ ఎస్‌.రాహుల్‌ మంగళవారం ప్రకటనలో తెలిపారు. రీజినల్‌ ట్రైనింగ్‌ సెంటర్‌లో ఇండక్షన్‌ ట్రైనింగ్‌, రిఫ్రెషర్‌ ట్రైనింగ్‌ ఇన్‌ సర్వీస్‌ ట్రైనింగ్‌, ఓరియంటేషన్‌ కోర్సులలో శిక్షణ ఇస్తారన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా ఇన్‌చార్జి మంత్రి, బీసీ సంక్షేమం, ప్రజా సంబంధాల సమాచార, సినిమాటోగ్రఫీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, ఎంపీ మార్గాని భరత్‌ రామ్‌, ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని, ఏపీగ్రీనింగ్‌, బ్యూటిఫికేషన్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ చందన నాగేశ్వర్‌ తదితరులు హాజరవుతారన్నారు.

25న తునిలో సామాజిక, సాధికారక యాత్ర

తుని: దేశంలో ఏ రాజకీయ పార్టీ చేయని విధంగా రాష్ట్రంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి న్యాయం చేశారని రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖ మంత్రి దాడిశెట్టి రాజా అన్నారు. మంగళవారం తుని మండలం ఎస్‌.అన్నవరం క్యాంపు కార్యాలయంలో సామాజిక, సాధికారక యాత్ర పోస్టర్‌ను మంత్రి రాజా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో చేపట్టిన సామాజిక, సాధికారక యాత్ర ఈ నెల 25న తునికి చేరుకుంటుందన్నారు. స్థానిక రాజా కళాశాల మైదానంలో సాయంత్రం నాలుగు గంటలకు బహిరంగ సభ జరుతుందన్నారు. తుని నియోజకవర్గానికి చెందిన బీసీ,ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

Advertisement
 
Advertisement