బిడ్డకు భరోసా.. తల్లికి రక్షణ | Sakshi
Sakshi News home page

బిడ్డకు భరోసా.. తల్లికి రక్షణ

Published Sat, Nov 11 2023 2:44 AM

అంగన్‌వాడీ కేంద్రంలో చిన్నారులకు వైద్యసేవలు అందిస్తున్న వైద్యురాలు - Sakshi

రాజమహేంద్రవరం రూరల్‌: అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెడుతోంది. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అంగన్‌వాడీ కేంద్రాలకు సొంత భవనాలు సమకూర్చింది. నాడు–నేడు ద్వారా పాత భవనాలను ఆధునీకరించింది. ప్రైవేటు భవనాల్లో నడుస్తున్న కేంద్రాలకు అద్దెను పెంచింది. కేంద్రాల నిర్వహణతో పాటు చిన్నారులు, గర్భిణులు, బాలింతల ఆరోగ్యంపై కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. వారికి వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ పథకం ద్వారా పౌష్టికాహారం అందిస్తోంది. చిన్నారులకు ఇంగ్లిషు మీడియం బోధనకు శ్రీకారం చుట్టింది. ఫ్యామిలీ డాక్టర్‌ కార్యక్రమం ద్వారా ప్రతి నెలా మొదటి, మూడు శుక్రవారాల్లో అంగన్‌వాడీ కేంద్రాలను వైద్యులు సందర్శించేలా ఆదేశాలిచ్చింది. గర్భిణులకు, బాలింతలకు టేక్‌ హోం రేషన్‌ విధానం అమలు చేసింది. నాణ్యతలో రాజీ లేకుండా స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్స్‌ (ఎస్‌ఓపీ) అమలులో కచ్చితత్వం పాటించేలా చర్యలు చేపట్టింది. క్వాలిటీ సర్టిఫికేషన్‌ తప్పనిసరి చేసింది. అంగనవాడీ కేంద్రాల్లో మూడు నుంచి ఆరేళ్లలోపు పిల్లలకు 19 రకాల ఆట వస్తువులతో కూడిన కిట్లను అందించింది. పిల్లల ఎదుగుదలకు స్టడీ, ఇన్‌ఫాంటో మీటర్లు, సాల్టర్‌ స్కేల్‌, బరువు తూచే యంత్రాలను సమకూర్చింది.

అత్యవసర కిట్ల పంపిణీ

తాజాగా జిల్లా వ్యాప్తంగా ఉన్న అంగన్‌వాడీ కేంద్రాల్లోని చిన్నారుల ఆరోగ్యాన్ని పరిరక్షించేందుకు అత్యవసర ప్రథమ చికిత్స (ఫస్ట్‌ ఎయిడ్‌) కిట్లు పంపిణీ చేసింది. ఈ కిట్లలో పారాసిటమాల్‌ సిరప్‌, సిప్రోఫ్లాక్సిన్‌ చుక్కల మందు, ప్రమిసటిన్‌ స్కిన్‌ క్రీమ్‌ ఆయింట్‌మెంట్‌, కాటన్‌, ఓరల్‌ రీహైడ్రేషన్‌ సాల్ట్స్‌, సొనిడిన్‌ అయోడిన్‌, రోలర్‌ బ్యాండేజ్‌ ఉన్నాయి. సమగ్ర శిశు అభివృద్ధి సేవా పథకం పేరిట పిల్లల్లో సాధారణంగా వచ్చే వ్యాధులు, ఏయే మందులను ఎంతెంత మోతాదులో ఎలా వినియోగించాలో పేర్కొంటూ తెలుగులో సమాచారం కూడా ఇచ్చారు. ఆయా మందుల వినియోగంపై అంగన్‌వాడీ కార్యకర్తలకు వైద్య సిబ్బంది అవగాహన కల్పించారు.

అంగన్‌వాడీ కేంద్రాలకు ఔషధ కిట్లు

జిల్లాలోని 1,556 కేంద్రాలకు సరఫరా

ఒక్కో ఫస్ట్‌ ఎయిడ్‌ కిట్‌లో

ఏడు రకాల మందులు

76,138 మంది చిన్నారులకు ప్రయోజనం

18,576 మంది

గర్భిణులు, బాలింతలకు మేలు

పిల్లల ఆరోగ్యంపై ఏఎన్‌ఎం,

ఆశా కార్యకర్తల పర్యవేక్షణ

జిల్లాలో ఐసీడీఎస్‌ ప్రాజెక్టులు : 7

అంగన్‌వాడీ కేంద్రాలు : 1,530

మినీ కేంద్రాలు : 26

గర్భిణులు : 8,857

బాలింతలు : 9,719

6 నెలల్లోపు చిన్నారులు : 9,719

6 నెలల నుంచి ఏడాది లోపు పిల్లలు : 9,830

ఏడాది నుంచి మూడేళ్లలోపు పిల్లలు : 37,486

మూడు నుంచి ఆరేళ్ల మధ్య పిల్లలు : 19,103

ఎంతో ప్రయోజనం

అంగనవాడీ కేంద్రాలకు మెడికల్‌ కిట్లు పంపిణీ చేశాం. గతంలో కంటే ఈసారి వచ్చిన కిట్లలో ఎక్కువ మందులున్నాయి. ప్రజారోగ్యానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోంది. పిల్లలకు జ్వరం, చిన్నపాటి గాయాలు, ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తితే ఈ కిట్‌లోని మందులు ఎంతో ఉపయోగపడతాయి. పిల్లల్లో సాధారణంగా వచ్చే చర్మవ్యాధుల నిర్మూలనకు సంబంధించిన ఆయింట్‌మెంట్లు ఇందులో ఉన్నాయి.

– కె.విజయకుమారి, జిల్లా మహిళ,

శిశు సంక్షేమ సాధికారత అధికారి

పిల్లల ఆరోగ్య పరిరక్షణకు..

ఏఎన్‌ఎం, ఆశా వర్కర్లు ప్రతి మూడు నాలుగు రోజులకోసారి అంగన్‌వాడీ కేంద్రాల్ని పర్యవేక్షిస్తారు. కేంద్రంలోని పిల్లల ఎదుగుదల, ఎత్తు, బరువు పరీక్షల నిర్వహణతో పాటు కిట్‌లోని మందులను అవసరమైన వారికి అందిస్తారు. ఫస్ట్‌ ఎయిడ్‌ కిట్‌లోని మందులపై అంగన్‌వాడీ కార్యకర్తలకు అవగాహన కల్పించారు.

– బేబీరాణి, సూపర్‌వైజర్‌,

ఐసీడీఎస్‌, బొమ్మూరు సెక్టార్‌

అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా చేసిన మందులు
1/3

అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా చేసిన మందులు

2/3

3/3

Advertisement
 
Advertisement