నేటి నుంచి గోదావరి హారతి పునఃప్రారంభం | - | Sakshi
Sakshi News home page

నేటి నుంచి గోదావరి హారతి పునఃప్రారంభం

Published Sun, Oct 1 2023 3:12 AM | Last Updated on Sun, Oct 1 2023 3:12 AM

విలేకరుల సమావేశంలో 
మాట్లాడుతున్న టీకే.విశ్వేశ్వరరెడ్డి - Sakshi

సీటీఆర్‌ఐ(రాజమహేంద్రవరం): గోదావరి హారతి కార్యక్రమాన్ని ఆదివారం నుంచి పునరుద్ధరిస్తున్నారు. ఇటీవల వర్షాలు వల్ల కొద్దిరోజులు నిలిపివేశారు. మళ్లీ ఎప్పటిలా గోదావరి హారతిని ప్రారంభించనున్నామని శ్రీపందిరి మహాదేవుడు సత్రం సహాయ కమిషనర్‌, గోదావరి హారతులు పర్యవేక్షణాఽధికారి వీవీ.పళ్లంరాజు శనివారం ఒక ప్రకటనలో తెలియచేశారు. పుష్కర్‌ఘాట్‌ వద్ద ప్రతిష్టాత్మకంగా దేవదాయ ధర్మదాయ శాఖ, శ్రీవీరవెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో రోజూ సాయంత్రం 6.30 గంటలకు గోదావరి హారతి ఇస్తున్న సంగతి తెలిసిందే. భక్తులు, యాత్రీకులు, నగర ప్రజలు ఈ హారతులను తిలకించేందుకు తరలి రావాలని కోరారు.

5 నుంచి ప్రపంచ

అంతరిక్ష వారోత్సవాలు

కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ఇస్రో ఆధ్వర్యంలో ఈనెల 5 నుంచి 8 వరకూ ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలు నిర్వహిస్తున్నట్టు ప్రైవేట్‌ కాలేజీ అసోసియేషన్‌ నాయకులు టీకే విశ్వేశ్వరరెడ్డి తెలిపారు. శనివారం ప్రెస్‌క్లబ్‌లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మున్సిపల్‌ కార్పొరేషన్‌, ప్రైవేట్‌ కాలేజీల అసోసియేషన్‌, ప్రైవేట్‌ స్కూల్స్‌ అసోసియేషన్‌ సంయుక్త ఆధ్వర్యంలో వీటిని నిర్వహిస్తున్నామన్నారు. చంద్రయాన్‌–3 విజయవంతమైన నేపథ్యంలో ఇస్ట్రో వేడుకలకు రాజమహేంద్రవరం కూడా వేదిక కానుందన్నారు. ప్రారంభ రోజు ఉదయం నందం గనిరాజు జంక్షన్‌ నుంచి ఆనం కళాకేంద్రం వరకు స్పేస్‌ వాక్‌ ఉంటుందన్నారు. అన్ని జూనియర్‌, డిగ్రీ కాలేజీల విద్యార్థులు జాతీయ జెండాలు చేతబట్టి పాల్గొంటారన్నారు. 25 మంది ఇస్రో శాస్త్రవేత్తలు హాజరవుతున్నారన్నారు. 6న ఆనం కళాకేంద్రంలో మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమీషనర్‌ దినేష్‌ కుమార్‌ అధ్యక్షతన జరిగే వేడుకలో కలెక్టర్‌ డా కె మాధవీలత, నన్నయ యూనివర్సిటీ వీసీ ఆచార్య కె పద్మరాజు హాజరవుతారన్నారు. 19 మండలాల్లో క్విజ్‌ పోటీలు జరుగుతాయన్నారు. కళాకేంద్రం ఆవరణలో ఇస్రో రాకెట్ల నమూనాల ప్రదర్శన ఉంటుందన్నారు. 7న 10 మంది ప్రముఖులకు ఇస్రో ఆధ్వర్యంలో సత్కారం చేస్తారన్నారు. విలువైన బహుమతులు, సర్టిఫికెట్లు, మెమెంటోలు, కిట్లు ఇస్రో అందిస్తుందన్నారు. గంగిరెడ్డి, టి.నాగరత్నం, మురళి, సురేష్‌, రమేష్‌, ప్రెస్‌ క్లబ్‌ గౌరవాధ్యక్షులు ఎం. శ్రీరామ్మూర్తి, రాజా రమేష్‌ పాల్గొన్నారు.

రేపు స్పందన రద్దు

సీటీఆర్‌ఐ(రాజమహేంద్రవరం): మహాత్మా గాంధీ జయంతి నేపథ్యంలో సోమవారం కలెక్టరేట్‌లో స్పందన కార్యక్రమం నిర్వహించడం లేదు. జిల్లా కలెక్టర్‌ డా కె. మాధవీలత శనివారం ఈమేరకు ఒక ప్రకటనలో తెలిపారు.

పోలీసు అధికారులతో నేర సమీక్ష

కంబాలచెరువు(రాజమహేంద్రవరం): పోలీస్‌ కార్యాలయంలో జిల్లా నేర పరిశోధన విభాగం అధికారులతో ఎస్పీ జగదీష్‌ శనివారం సమీక్ష నిర్వహించారు. పోలీస్‌ స్టేషన్ల వారిగా నేరాల తీరుపై ఎస్పీ అడిగి తెలుసుకున్నారు. పెండింగ్‌లో ఉన్న ముఖ్యమైన కేసుల పరిశోధన, పురోగతిపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ రాత్రిపూట ఇంటి నేరాలు, చైన్‌ స్నాచింగ్‌, బైక్‌ దొంగతనాలు, సెల్‌ఫోన్‌ దొంగతనాలు, దారిదోపిడీలు జరగకుండా పాత నేరస్తులపై నిఘా పెంచాలన్నారు. నైట్‌ గస్తీ, పెట్రోలింగ్‌ పెంచాలని, నేరాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనుమానాస్పద వ్యక్తుల వేలు ముద్రలను చెక్‌ చేయాలన్నారు. ఆధునిక సాంకేతికతను ఉపయోగించాలని సూచించారు. క్రైం అడిషనల్‌ ఎస్పీ జి.వెంకటేశ్వరరావు, సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్లు విద్యాసాగర్‌, పీవీ.త్రినాథ్‌, సబ్‌ ఇన్‌స్పెక్టర్లు పాల్గొన్నారు.

30 ఆర్జేసీ 108 ఎ–270083: పోలీసు అధికారులతో నేర సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న ఎస్పీ పి.జగదీష్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement