పేదలకు ప్రైవేటు విద్య.. ప్రభుత్వం అండతో అడ్మిషన్లు

- - Sakshi

ప్రైవేటు, కార్పొరేట్‌ పాఠశాలల్లో

పేద విద్యార్థులకు ఉచిత విద్య

25 శాతం ప్రవేశాలు కల్పించేలా ప్రభుత్వం చర్యలు

పాఠశాలకు కిలో మీటర్‌ దూరంలో

నివాసం ఉన్న వారికి అవకాశం

జిల్లా వ్యాప్తంగా విశేష స్పందన

సాక్షి, రాజమహేంద్రవరం: పేదలకు కార్పొరేట్‌ విద్య అందించే దిశగా ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. ప్రైవేటు, కార్పొరేట్‌ పాఠశాలల్లో 1వ తరగతి ప్రవేశాల్లో 25 శాతం సీట్లు పేద విద్యార్థులకు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. ఎంపిక చేసుకున్న పాఠశాలల్లో పూర్తి స్థాయిలో ఉచితంగా విద్యను అభ్యసించే అవకాశం కల్పించింది. కేవలం నామమాత్రపు ఫీజు మాత్రమే వసూలు చేసేలా ఆదేశాలు జారీ చేసింది.

ప్రవేశం పొందిన విద్యార్థుల ఫీజును ‘అమ్మఒడి’ పథకంలో ప్రభుత్వమే చెల్లించనుంది. ఈ విద్యా సంవత్సరం నుంచి పకడ్బందీగా అమలయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించింది. ప్రభుత్వ ఆదేశాలతో జిల్లా విద్యాశాఖ అధికారులు ప్రవేశాలపై దృష్టి సారించారు. మొదటి విడత ప్రవేశాల ప్రక్రియ పూర్తవగా.. రెండో దశలో మరింత మందికి అవకాశం కల్పించనున్నారు.

ప్రైవేటులోనూ రిజర్వేషన్‌

ప్రభుత్వం పేద విద్యార్థులకు ప్రైవేటు విద్యలోనూ రిజర్వేషన్లు అమలు చేసింది. ప్రైవేటు, కార్పొరేట్‌ స్కూళ్లల్లో 25 శాతం సీట్లు పేదలకు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. అందులో 10 శాతం ఎస్సీలకు, 5 శాతం దివ్యాంగులకు కేటాయించింది. మరో 4 శాతం ఎస్టీలకు, బలహీన వర్గాలకు 6 శాతం సీట్లు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. బలహీన వర్గాల జాబితాలో బీసీలు, మైనార్టీలు, ఓసీలకు సీట్లు కేటాయించాల్సి ఉంది.

ఓసీల్లో ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు (పల్లెల్లో సంవత్సర ఆదాయం రూ.1.20 లక్షలకు తక్కువగా) అవకాశం కల్పించాలని నిర్ణయించింది. పట్టణ ప్రాంతాల్లో రూ.1.44 లక్షలకు ఆదాయం మించని వారిని అర్హులుగా గుర్తించారు. పాఠశాలకు, విద్యార్థులు ఉన్న నివాసానికి కిలో మీటర్‌ దూరం ఉన్నవారికి ప్రవేశాలు కల్పించారు.

వినియోగించుకోవాలి

పేద విద్యార్థులకు ప్రైవేటు, కార్పొరేట్‌ స్కూళ్లలో సీట్లు కేటాయించడం మంచి నిర్ణయం. ప్రభుత్వ నిర్ణయంతో పేదలు ప్రైవేటు స్కూళ్లో చదువుకోవాలన్న కోరిక నెరవేరుతుంది. ఎలాంటి ఫీజులు చెల్లించకుండా ఉచిత విద్య అందుతుంది. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. జిల్లాలో తొలి దశలో ప్రవేశాలు కల్పించాం. మొదటి విడతలో లబ్ధి పొందని వారు రెండో దశలో దరఖాస్తులు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకుని సీటు పొందేందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశాం.

ఎస్‌.అబ్రహం, డీఈఓ

జిల్లాలోని ప్రైవేటు పాఠశాలల్లో సీట్ల కేటాయింపు ఇలా..

మండలం ప్రవేశాలు

అనపర్తి 3

బిక్కవోలు 5

చాగల్లు 15

దేవరపల్లి 43

గోపాలపురం 15

కడియం 11

కోరుకొండ 6

కొవ్వూరు 54

నల్లజెర్ల 18

నిడదవోలు 14

పెరవలి 3

రాజమండ్రి రూరల్‌ 54

రాజమండ్రి అర్బన్‌ 110

రాజానగరం 15

రంగంపేట 3

సీతానగరం 22

తాళ్లపూడి 18

ఉండ్రాజవరం 7

తక్కువ ఫీజుతో ఊరట

ప్రైవేటు, కార్పొరేట్‌ విద్యా సంస్థల్లో రాష్ట్ర విద్యాశాఖ సిఫార్సు మేరకు చేరిన పేద విద్యార్థులకు ప్రభుత్వమే ఫీజు చెల్లిస్తుంది. వాస్తవానికి వీటిల్లో ఫీజులు వేలల్లో ఉంటాయి. సగటున రూ.20 నుంచి రూ.30 వేల వరకు వసూలు చేస్తుంటారు. తమ పిల్లలు మంచి స్కూల్లో చదవాలన్న ఆకాంక్షతో తల్లిదండ్రులు అప్పుల చేసి మరీ చెల్లించే వారు. సమయానికి కట్టని పరిస్థితుల్లో వేధింపులు, అవమానాలు ఎదుర్కొనేవారు.

అలాంటి వేధింపులు అరికట్టేందుకు ప్రభుత్వం ఫీజు ఎంత వసూలు చేయాలన్న విషయమైన ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలకు దిశా నిర్దేశం చేసింది. విద్యార్థుల నుంచి రూపాయి కూడా వసూలు చేయకూడదని, అమ్మ ఒడి ద్వారా ప్రభుత్వమే చెల్లిస్తుందని ఆదేశించింది. అర్బన్‌ ప్రాంతంలో పాఠశాలల్లో ఒక్కో విద్యార్థికి రూ.8,000, గ్రామీణ ప్రాంతాల్లో రూ.6,500, గిరిజన/షెడ్యూల్‌ ప్రాంతాల్లో రూ.5,100 ప్రభుత్వం పాఠశాలలకు చెల్లించనుంది.

జిల్లాలో ఇలా..

తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా 190 ప్రైవేటు, కార్పొరేట్‌ పాఠశాలలున్నాయి. వీటి పరిధిలో 1వ తరగతిలో ప్రవేశానికి ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు ఆహ్వానించగా.. 1,100 మంది దరఖాస్తు చేసుకున్నారు. వాటిని పరిశీలించిన అధికారులు 416 మందిని అర్హులుగా గుర్తించి ప్రైవేటు, కార్పొరేట్‌ పాఠశాలల్లో సీట్లు కేటాయించారు. కొందరు తమకు ఇష్టమైన స్కూళ్లల్లో మాత్రమే చేరుతామని ప్రవేశం పొందే అవకాశం వచ్చినా సద్వినియోగం చేసుకోలేకపోయారని విద్యాశాఖ అధికారులు వెల్లడించారు.

జిల్లా వ్యాప్తంగా 190 పాఠశాలలు ఉండగా.. పది స్కూళ్లల్లో ప్రవేశాలకు క్రేజ్‌ దక్కింది. ఆ పాఠశాలలో తమకు సీటు కావాలంటే తమకు కావాలని విద్యార్థులు తల్లిదండ్రులు, విద్యార్థులు పోటీ పడ్డారు. అర్హత లేదన్న విషయం తెలిసినా అక్కడైతేనే తాము చదువుతామని భీష్మించారు. ఈ క్రమంలో కొంత మంది సీటు క్యాన్సిల్‌ చేసుకున్నట్లు తెలిసింది.

Read latest East Godavari News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top