కుమ్మక్కు, వెన్నుపోటు రాజకీయాలలో చంద్రబాబు దిట్ట

- - Sakshi

ఎంపీ మార్గాని భరత్‌ రామ్‌

రాజమహేంద్రవరం సిటీ: వైఎస్సార్‌ సీపీలో గెలిచి టీడీపీకి ఓటువేసిన ఎమ్మెల్యేలపై పార్టీ నిర్ణయం తీసుకుందని ఎంపీ మార్గాని భరత్‌ రామ్‌ అన్నారు. ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలలో తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడినట్లు అధిష్టానం గుర్తించిందన్నారు. చంద్రబాబు కుమ్మక్కు, వెన్నుపోటు రాజకీయాల్లో దిట్ట అన్నారు. తెలంగాణలో ఓటుకు నోటు ఘటనను ఇప్పటికీ ఎవరూ విస్మరించలేదని, అదే మాదిరిగా ఇప్పుడు ఏపీలో చంద్రబాబు కుట్ర చేశారని ధ్వజమెత్తారు. టీడీపీ అనుకుంటున్నట్లు ఇది ప్రజా విజయం కాదని, సంక్షేమ పథకాలు తీసుకుంటున్న ప్రజలు జగన్‌ పక్షానే ఉన్నారన్నారు. మొత్తం 21 ఎమ్మెల్సీ స్థానాలకు వైఎస్సార్‌ సీపీ 17 విజయం సాధిస్తే, టీడీపీ నాలుగు స్థానాల్లో మాత్రమే గెలిచిందన్నారు. అడ్డదారుల్లో అధికారం చేజిక్కించుకోవడం టీడీపీకే చెల్లిందన్నారు.

28న మెగా జాబ్‌మేళా

కంబాలచెరువు (రాజమహేంద్రవరం): స్థానిక ఆర్ట్స్‌ కళాశాలలోని జవహర్‌ నాలెడ్జ్‌ సెంటర్‌లో ఈ నెల 28న మెగా జాబ్‌మేళా నిర్వహించనున్నారు. ఈ మేరకు జిల్లా ఉపాధి కల్పనాధికారి కె.హరీష్‌ చంద్రప్రసాద్‌, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎం.కొండలరావు, జేడీఎం కేశవ శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. గ్రీన్‌టెక్‌ ఇండస్ట్రీస్‌, పరమేశు బయోటెక్‌, విజన్‌ డ్రగ్స్‌, అమరరాజా గ్రూప్‌, ఐసాన్‌, అపోలో ఫార్మసీ, డెక్కన్‌ ఫైన్‌ కెమికల్స్‌, వరుణ్‌ మోటార్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, ఇండియన్‌ డెయిరీ ఎక్విప్‌మెంట్‌ అండ్‌ ఫ్యాబ్రికేటర్స్‌, మూత్తూట్‌ ఫైనాన్స్‌, కీర్తన ఫైనాన్స్‌, పేటీఎం కంపెనీల ప్రతినిధులు హాజరవుతారన్నారు. ఈ సంస్థల్లో పనిచేయడానికి పీజీ, బీటెక్‌, ఫార్మసీ, డిగ్రీ, పాలిటెక్నిక్‌, ఐటీఐ, ఇంటర్‌, పదో తరగతి పూర్తి చేసిన 19 ఏళ్ల నుంచి 29 ఏళ్ల వయసున్న అభ్యర్థులు అర్హులన్నారు. ఉద్యోగాలకు ఎంపికై న వారికి నెలకు రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకూ వేతనం ఉంటుందన్నారు. ఆసక్తి, అర్హత కలవారు ముందుగా తమ పూర్తి వివరాలతో ఎస్‌హెచ్‌ఓఆర్‌టీయుఆర్‌ఎల్‌.ఏటీ/హెచ్‌వోఎఫ్‌జేయూలో రిజిస్టర్‌ చేసుకుని నేరుగా ఇంటర్వ్యూలకు హాజరుకావాలన్నారు. ఉదయం 9 గంటలకు రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆర్ట్స్‌ డిగ్రీ కళాశాలలోని జవహర్‌ నాలెడ్జ్‌ సెంటర్‌ వద్దకు రావాలన్నారు. మరిన్ని వివరాలకు 89198 68419, 95818 10049 నంబర్లను సంప్రదించాలన్నారు.

నిబంధనలు తప్పనిసరిగా

పాటించాలి

రాజమహేంద్రవరం రూరల్‌: పదో తరగతి పరీక్షల నేపథ్యంలో ప్రభుత్వం జారీ చేసిన నియమ, నిబంధనలను వైద్యసిబ్బంది తప్పనిసరిగా పాటించాలని జిల్లా వైద్య,ఆరోగ్యశాఖాధికారి (డీఎంఅండ్‌హెచ్‌ఓ) డాక్టర్‌ కె.వెంకటేశ్వరరావు ఆదేశించారు. బొమ్మూరులోని జిల్లా వైద్య,ఆరోగ్యశాఖాధికారి కార్యాలయంలో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్యశిబిరం నిర్వహించే పరీక్షా కేంద్రానికి వైద్యసిబ్బంది అరగంట ముందుగా హాజరుకావాలన్నారు. పరీక్షల సమయంలో మొబైల్‌ ఫోన్‌ ఉపయోగించరాదన్నారు. ఆయా పరీక్షా కేంద్రాల చీఫ్‌ సూపరింటెండెంట్ల వద్ద ఫోన్లను డిపాజిట్‌ చేసి, పరీక్ష పూర్తయిన తర్వాత తీసుకోవాలన్నారు. వైద్యశిబిరాల్లో ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు, శానిటైజర్‌, థర్మల్‌ స్కానర్‌, మాస్కులు, ప్రథమ చికిత్స మందులు తప్పనిసరిగా ఉంచుకోవాలన్నారు. రాజమహేంద్రవరం డివిజన్‌కు డాక్టర్‌ ఆదిత్య, కొవ్వూరు డివిజన్‌కు డాక్టర్‌ వెంకటేష్‌ను ప్రత్యేకాధికారులుగా నియమించామన్నారు.

Read latest East Godavari News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top