సీమెన్స్‌లో దోషులను బయటపెడతాం

విలేకరులతో మాట్లాడుతున్న మార్గాని భరత్‌రామ్‌ - Sakshi

రాజమహేంద్రవరం సిటీ: యువతకు నైపుణ్యాభివృద్ధి కల్పిస్తామని కల్లబొల్లి మాటలు చెప్పి సీమెన్స్‌ అనే సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని కోట్లాదిరూపాయలు పక్కదారి పట్టించిన వైనంలో దోషులను బయటకు లాగుతామని రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్‌రామ్‌ అన్నారు. బుధవారం విలేకరులతో మాట్లాడుతూ నాటి చంద్రబాబు ప్రభుత్వం ఒప్పందం పేరిట రూ.3,300 కోట్లు వెచ్చించనున్నట్టు ప్రకటించిందన్నారు. రాష్ట్రం పది శాతం, మిగిలిన 90 శాతం సీమెన్స్‌ సంస్థ వెచ్చిస్తుందని పేర్కొందన్నారు. ప్రభుత్వ వాటా రూ.371.25 కోట్లు చంద్రబాబు మళ్లించి అవకతవకలకు పాల్పడ్డారని ఎంపీ ఆరోపించారు. దీనికి సంబంధించి కీలక పత్రాలు చంద్రబాబు మాయం చేశారని ధ్వజమెత్తారు చంద్రబాబుతో తామేమీ ఒప్పందం కుదుర్చుకోలేదని సీమెన్స్‌ సంస్థ లిఖితపూర్వకంగా చెబుతోందన్నారు. ప్రభుత్వం వాటా రూ.371.25కోట్లు ఎవరి ఖాతాలోకి మళ్లాయో చంద్రబాబు, ఆయన పుత్రుడు లోకేష్‌ రాష్ట్ర ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. సీమెన్స్‌ అంటే చంద్రబాబు, ఆయన అనుచరులు అని కాకినాడ రూరల్‌ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు చెప్పింది నూరుశాతం వాస్తవమన్నారు. చంద్రబాబు, లోకేష్‌ స్కాంల్లో ఇదొకటి మాత్రమేనన్నారు. తవ్వేకొద్దీ మరెన్నో బయటపడతాయన్నారు. ప్రజల సొమ్మును అడ్డంగా బొక్కేసి మళ్లీ ఈ రాష్ట్రాన్ని నట్టేట ముంచేయడానికి తండ్రీ కొడుకులు సిద్ధపడుతున్నారన్నారు. యువగళం అంటూ గందరగోళం చేస్తున్న లోకేష్‌ కూడా తండ్రితో పాటు జైలు కెళ్లడం ఖాయమన్నారు.

ఎంపీ మార్గాని భరత్‌ రామ్‌

Read latest East Godavari News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top