ఎమ్మెల్సీ ఇజ్రాయిల్
అమలాపురం రూరల్: దళితులపై దాడులు జరిగాయని టీడీపీ ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు, కూటమి నాయకులు చేపడుతున్న నిరసన కార్యక్రమాలు హాస్యాస్పదంగా ఉన్నాయని ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ విమర్శించారు. దళతులపై జరిగిన దాడులపై చర్చలకు ఎమ్మెల్యే, కూటమి నాయకులు సిద్ధమా అని సవాల్ విసిరారు. శుక్రవారం అమలాపురంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ దళితులపై దాడుల విషయంలో కూటమి నేతలు ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారని విమర్శించారు. జగన్ ప్రభుత్వ కాలాన్ని మాత్రమే లక్ష్యంగా చేసుకుని మాట్లాడుతున్నారని అన్నారు. సీఎం చంద్రబాబు రెండేళ్ల పాలనలో దళితులపై దాడులు, అత్యాచారాలు, హత్యలు ఎమ్మెల్యే ఆనందరావుకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. పల్నాడులోని పిన్నెల్లిలో దళితులపై దాడుల ఘటన, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ నియోజకవర్గం పిఠాపురంలో దళితుల వెలివేత వంటి ఘటనలపై ఎందుకు స్పందించలేదని నిలదీశారు. డిప్యూటీ స్పీకర్ రాఘురామకృష్ణరాజు ఆకివీడులో 58 మంది దళితులపై దాడులు చేసి అక్రమ కేసులు పెట్టినప్పడు ఎమ్మెల్యే ఆనందరావు ఎందుకు ప్రశ్నించలేదన్నారు. కోనసీమలో గతంలో జరిగిన ఘటనలపై ఆనందరావు స్పందించకపోవడం విచారకరమన్నారు. డాక్టర్ సుధాకర్ మరణంపై తప్పుడు ప్రచారం చేయవద్దని, ఆయన మానసిక పరిస్థితి సరిగా లేక మృతి చెందారని అన్నారు. దళితులకు నిజమైన అండగా ఉన్నది వైఎస్సార్ సీపీ మాత్రమేనని స్పష్టం చేశారు.
ఒక్క పూడికతీత పని అయినా చేశారా?
జిల్లాలో పూడికతీత, డ్రైయిన్లు గుర్రప్ప డెక్క తొలగింపు పనులు 480 మంజూరు చేసినట్లు ఎమ్మెల్యేలు ప్రకటించారు. ఏప్రిల్ 25న పంట కాలువలు మూసివేయగా మే 23 తేదీ వచ్చినా ఒక్క పనిఅయినా ప్రారంభించారా అని ఎమ్మెల్సీ నిలదీశారు. నియోజకవర్గానికి రూ.3.90 కోట్ల పనులకు ఎమ్మెల్యేలు శంకుస్థాపన చేశారని, వీటిలో ఒక పని కూడా ఎందుకు పూర్తి చేయలేదన్నారు.


