రత్నగిరిపై ప్రభంజనం
సత్యదేవుని దర్శనానికి క్యూలో నిల్చున్న భక్తులు
● సత్యదేవుని దర్శించిన 80 వేల మంది
● 8 వేల వ్రతాలు.. రూ.80 లక్షల ఆదాయం
అన్నవరం: కార్తిక శుద్ధ ఏకాదశి పర్వదినం కావడంతో వేలాదిగా వచ్చిన భక్తులతో రత్నగిరి శనివారం కిక్కిరిసిపోయింది. సుమారు 80 వేల మంది భక్తులు సత్యదేవుని దర్శించారని అధికారులు అంచనా వేశారు. స్వామివారి వ్రతాలు 8 వేలు జరిగాయి. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.80 లక్షల ఆదాయం వచ్చిందని అధికారులు అంచనా వేశారు. సత్యదేవుని ఉచిత దర్శనానికి రెండు గంటలు, రూ.200 టికెట్టు దర్శనానికి గంట సమయం పట్టింది. ఉదయం 9 గంటల వరకూ మాత్రమే రూ.200 టికెట్టుపై అంతరాలయ దర్శనానికి భక్తులను అనుమతించారు. ఆ తరువాత రద్దీ అధికంగా ఉండడంతో అంతరాలయ దర్శనం నిలిపివేసి, ఆ భక్తులను కూడా వెలుపలి నుంచే అనుమతించారు. వ్రత మండపాలతో బాటు సత్యదేవుని నిత్య కల్యాణ మండపంలో కూడా స్వామివారి రూ.300 వ్రతాలు నిర్వహించారు. స్వామివారి నిత్య కల్యాణాన్ని పాత కల్యాణ మండపంలో జరిపారు. దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్ ఉదయం నుంచీ ఆలయ ప్రాంగణంలోనే ఉండి ఏర్పాట్లను పర్యవేక్షించారు. వ్రత మండపాలు, క్యూ లైన్లు పరిశీలించి, సిబ్బందికి తగు సూచనలు చేశారు. స్వామివారి ఆలయం వద్ద దర్శనం చేసుకుని వెలుపలకు వస్తున్న భక్తులకు అభిముఖంగా కొంతమంది భక్తులను ఆలయానికి తీసుకువస్తూండటంతో వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవస్థానం ఈఓ వీర్ల సుబ్బారావు కమాండ్ కంట్రోల్ రూములో సీసీ కెమెరాల ద్వారా ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఏకాదశి పర్వదినం సందర్భంగా సత్యదేవునికి ఉదయం 7 గంటలకు స్వర్ణ పుష్పార్చన, 9 నుంచి 11 గంటల వరకూ కుంకుమార్చన నిర్వహించారు.
నేడు సత్యదేవుని తెప్పోత్సవం
క్షీరాబ్ధి ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవార్ల తెప్పోత్సవం ఆదివారం సాయంత్రం పంపా సరోవరంలో ఘనంగా నిర్వహించనున్నారు. స్వామి, అమ్మవార్లను సాయంత్రం 5 గంటలకు రత్నగిరి నుంచి ఊరేగింపుగా పంపా తీరానికి తీసుకువస్తారు. అక్కడి పూజా మండపంలో 5.30 గంటలకు తులసీధాత్రి పూజ నిర్వహిస్తారు. సాయంత్రం ఆరు గంటలకు పంపా సరోవరంలో హంస వాహనంగా అలంకరించిన పంటు మీద ఉన్న రుద్రాక్ష మండపంలో స్వామి, అమ్మవార్లను వేంచేయించి, పూజలు చేస్తారు. అనంతరం పండితుల మంత్రోచ్చారణలు, కళ్లు మిరుమిట్లు కొలిపే బాణసంచా కాల్పుల నడుమ సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసిన హంస వాహనంపై స్వామి, అమ్మవార్లు సాయంత్రం 6.30 గంటల నుంచి పంపా సరోవరంలో మూడుసార్లు విహరించనున్నారు. దేవస్థానంలో స్వామివారి కల్యాణం తరువాత అంతటి ప్రాధాన్యం ఉన్న ఈ వేడుకను కన్నులారా వీక్షించేందుకు వేలాదిగా భక్తులు తరలి రానున్నారు. ఈ నేపథ్యంలో విస్తృత ఏర్పాట్లు చేశామని దేవస్థానం చైర్మన్ రోహిత్, ఈఓ సుబ్బారావు తెలిపారు. తెప్పోత్సవ నిర్వహణపై వారు అధికారులతో సమీక్షించారు. భక్తులందరూ ఈ ఉత్సవాన్ని తిలకించేందుకు వీలుగా పంపా తీరంలో బారికేడ్లు నిర్మించామన్నారు. తెప్పోత్సవం అనంతరం భక్తులకు ప్రసాదం పంపిణీ చేస్తారు. తెప్పోత్సవం నిర్వహించే పవర్ హౌస్ వద్ద పంపా తీరాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ఘాట్ రోడ్ ముఖద్వారం నుంచి పవర్ హౌస్ వరకూ రంగురంగుల విద్యుద్దీపాలతో అలంకరించారు. తెప్ప మీదకు 33 మందిని మాత్రమే అనుమతిస్తారు. వీరందరూ విధిగా లైఫ్ జాకెట్లు ధరించాలి. తెప్పోత్సవానికి ప్రజాప్రతినిధులను, జిల్లా అధికారులను ఆహ్వానించారు. వీరి కోసం పంపా తీరంలో వీఐపీ లాంజ్ ఏర్పాటు చేశారు. తెప్పోత్సవానికి 150 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. పంపాలో గజ ఈతగాళ్లు, రెండు మోటార్ బోట్లను, అగ్నిమాపక శకటాన్ని కూడా ముందు జాగ్రత్తగా సిద్ధం చేశారు. మోటార్ బోట్లతో కూడా పంపాలో ట్రయల్ రన్ నిర్వహించారు.
రత్నగిరిపై ప్రభంజనం


