కూటమి కోతలు
పంటంతా నీటిపాలు
మామిడికుదురు మండలం నగరంలో తుపాను వల్ల వీచిన ఈదురు గాలులకు పెద్ద ఎత్తున చేలు నేలనంటాయి. దీనికి వర్షం తోడు కావడంతో విరిగిన కంకులు నీట నానుతున్నాయి. అంతకు ముందు అల్పపీడనం వల్ల కురిసిన వర్షాలకు, తుపాను వర్షం తోడు కావడంతో ముంపు అధికంగా ఉంది. గ్రామానికి చెందిన పితాని మోహన్, బల్ల చంటి, గుత్తుల వెంకటేశ్వరరావు కౌలు రైతులు. వీరు సుమారు ఏడు ఎకరాలను సాగు చేశారు. ఒక్కొక్కరూ ఎకరాకు రూ.30 వేల వరకు పెట్టుబడి పెట్టారు. ముంపు నీరు దిగే అవకాశం లేక పంట కుళ్లిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కూలీలు రాక ఒకరికి ఒకరు సాయంగా పంటను ఒబ్బిడి చేసుకుంటున్నారు. పడిపోయిన వరి కంకులను రక్షించేందుకు అష్టకష్టాలు పడుతున్నారు.
చేనేత సాగక...
మోంథా తుపానుకు కురిసిన వర్షాలతో మగ్గం వద్ద కాళ్లు పెట్టుకునే గోతుల్లోకి నీరు చేరింది. దీంతో నేత నేయడానికి వీలు కుదరడం లేదు. చీరల తయారీకి ఉపయోగించే ముడి సరుకు తడిసి ముద్దయ్యింది. బూజు కూడా పట్టింది. వీటి విలువ రూ.ఐదు వేల వరకు ఉంది. గతంలో అల్పపీడనం వల్ల వారం రోజులు, ఇప్పుడు మరో ఐదు రోజుల పాటు పనులు లేకపోవడంతో పస్తులుంటున్నాం. మళ్లీ ముడి సరకు తెద్దామన్నా సొమ్ములు లేవు. ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలి. – తమ్మిశెట్టి వెంకట రామకృష్ణారావు, చేనేత కార్మికుడు,
తూర్పుపాలెం, మలికిపురం మండలం


