వాడపల్లి వాసా.. శ్రీవేంకటేశా..
● వెంకన్న దర్శనానికి పోటెత్తిన భక్తులు
● ఒక్కరోజే రూ. 63 లక్షల ఆదాయం
కొత్తపేట: వాడపల్లిలోని శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి క్షేత్రం భక్తజనంతో కిక్కిరిసింది. కార్తిక మాసంలో శనివారం, ఏకాదశి పర్వదినం సందర్భంగా భక్తుల తాకిడి పెరిగింది. ఏడు ప్రదక్షిణలు చేస్తున్న వేలాది మంది భక్తులతో మాడ వీధులు, స్వామి దర్శనానికి క్యూలైన్లు నిండిపోయాయి. దేవదాయ, ధర్మాదాయశాఖ డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు పర్యవేక్షణలో సిబ్బంది ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఆలయ ప్రధాన అర్చకుడు ఖండవిల్లి ఆదిత్య అనంత శ్రీనివాస్ ఆధ్వర్యంలో అర్చకులు, వేద పండితులు స్వామివారికి పూజలు, అభిషేకాలు నిర్వహించారు. వేంకటేశ్వర సహిత ఐశ్వర్యలక్ష్మీ హోమం ఘనంగా జరిపారు. ఏడు శనివారాల నోము ఆచరిస్తున్న భక్తులు మాడ వీధుల్లో ఏడు ప్రదక్షిణలు చేశారు. స్వామివారి దర్శనానంతరం ఆలయ ప్రాంగణంలోని అన్నపూర్ణా సమేత విశ్వేశ్వరస్వామిని దర్శించుకుని, తీర్థ ప్రసాదాలు, అన్నప్రసాదం స్వీకరించారు. వివిధ మార్గాల ద్వారా దేవస్థానికి శనివారం ఒక్కరోజే రూ.62,53,527 ఆదాయం వచ్చినట్టు డీసీ, చక్రధరరావు తెలిపారు. ధర్మపథం కార్యక్రమంలో భాగంగా రాత్రి వివిధ ప్రాంతాలకు చెందిన కళాకారులు నృత్య ప్రదర్శనలు చేశారు.
వాడపల్లి క్షేత్రంలో ప్రదక్షిణలు చేస్తున్న భక్తజనం


