హత్య ఘటనలో నిందితులను అరెస్టు చేయరా?
● మృతుడు శ్రీనివాస్
కుటుంబ సభ్యుల ఆవేదన
● జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన
అమలాపురం టౌన్: అమలాపురంలోని కొంకాపల్లికి చెందిన కంచిపల్లి శ్రీనివాస్ హత్య జరిగి ఐదు రోజులు కావస్తున్నా నిందితులను ఇంకా ఎందుకు అరెస్టు చేయలేదంటూ మృతుడి కుటుంబీకులు, స్థానికులు శనివారం జాతీయ రహదారిపై ధర్నాకు దిగారు. కొంకాపల్లిలోని మృతుడి శ్రీనివాస్ ఇంటి వద్ద ఎదురుగా ఉన్న జాతీయ రహదారిపై బైఠాయించారు. ఈ సందర్భంగా అంజి మాట్లాడుతూ తన సోదరుడు శ్రీనివాస్ తల నీలాలు, కనుబొమ్మలు, కళ్లు తొలగించి, నాలుక కోసి అతి దారుణంగా, కిరాతంగా చంపారని ఆవేదన వ్యక్తం చేశాడు. హత్య జరిగి ఐదు రోజులు గడుస్తున్నా నిందితులను ఇంకా అరెస్ట్ చేయలేదన్నారు. 24 గంటల్లోపు నిందితులను అదుపులోకి తీసుకోకపోతే తమ ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కాగా.. ధర్నా ప్రాంతానికి అమలాపురం డీఎస్పీ టీఎస్‌ఆర్‌కే ప్రసాద్, పట్టణ సీఐ పి.వీరబాబు, ఎస్సైలు చేరుకున్నారు. మృతుడి కుటుంబీకులు, స్థానికులు, కొంకాపల్లి పెద్దలతో డీఎస్పీ ప్రసాద్ చర్చించారు. నిందితుల ఆచూకీ కోసం ప్రత్యేక పోలీసు బృందాలను రంగంలోకి దింపామని, కేసును నిష్పక్షపాతంగా దర్యాప్తు చేస్తున్నామని, నిందితులను త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో ఆందోళనకారులు తాత్కాలికంగా ఆందోళనను విరమించారు. ధర్నా సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా పోలీసు అధికారులు బందోబస్తు నిర్వహించారు. కొంకాపల్లిలో ముందు జాగ్రత్తగా పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. మృతుడి భార్య దేవి, పిల్లలు, అతడి సోదరుడు అంజి తదితరులు ధర్నాలో పాల్గొన్నారు.


