ముత్యాలమ్మకు ఆభరణాల సమర్పణ

శంకుస్థాపన చేస్తున్న ఎమ్మెల్యే చిట్టిబాబు - Sakshi

మండపేట: మండలంలోని మెర్నిపాడులో కొలువైన ముత్యాలమ్మ వారికి బుధవారం భక్తులు బంగారు, వెండి వస్తువులను కానుకగా అందజేశారు. ఆ పంచాయతీ సర్పంచ్‌ గారపాటి సౌజన్య, వైఎస్సార్‌ సీపీ నేత అశోక్‌కుమార్‌ దంపతులు 13 గ్రాముల బంగారు నత్తి సమర్పించగా, రాజమహేంద్రవరం రూరల్‌ మండలం, తొర్రేడుకు చెందిన బాలాజీ బిల్డర్స్‌ మేనేజింగ్‌ పార్టనర్‌ మాసిన పెద్ద సుబ్బారావు కేజీ వెండి నక్లెస్‌ను సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని అధిక సంఖ్యలో గ్రామస్తులు అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పంచాంగ పఠనం నిర్వహించారు. గారపాటి మురళీకృష్ణ దంపతులు, వల్లూరి చిన్నబాబు, ముత్యాల పెద్దబ్బు, యలమాటి సత్తిబాబు, గారపాటి శ్రీసతీష్‌, వల్లూరి సత్తిపండు, పంపన బుల్లియ్య, బొజ్జా సుబ్బారావు, మద్దిపాటి వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.

ప్రధాన పంట కాలువపై

వంతెనకు శంకుస్థాపన

పి.గన్నవరం: వశిష్ట నదీపాయపై ఊడిమూడిలంక వంతెన నిర్మాణ పనుల్లో భాగంగా ముందుగా ప్రధాన పంట కాలువపై వంతెనకు ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు బుధవారం శంకుస్థాపన చేశారు. రూ.49.5 కోట్ల వ్యయంతో ఊడిమూడిలంక వంతెన నిర్మాణానికి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అన్ని అనుమతులు మంజూరు చేసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో పంట కాలువపై వంతెన పనులకు చిట్టిబాబు శ్రీకారం చుట్టారు. ఈ వంతెన నిర్మాణం అనంతరం నదీపాయపై వంతెన పనులను ప్రారంభిస్తారు. ఎమ్మెల్యే చిట్టిబాబు మాట్లాడుతూ ఊడిమూడిలంక, జి.పెదపూడిలంక, అరిగెలవారిపేట, బూరుగులంక ప్రజల కష్టాలను పరిష్కరిస్తున్న జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. సర్పంచ్‌లు నూకపెయ్యి ప్రసన్నకుమార్‌, దంగేటి అన్నవరం, పీఆర్‌ ప్రాజెక్టు డీఈ అన్యం రాంబాబు పాల్గొన్నారు.

తాబేళ్ల సంరక్షణే ధ్యేయం

– డీఏఫ్‌వో ప్రసాదరావు

ఉప్పలగుప్తం: తీర ప్రాంతాల్లో నివసించే జలచరాలైన ఆలీవ్‌రిడ్‌ తాబేళ్ల సంరక్షణే ధ్యేయంగా అటవీశాఖ పనిచేస్తుందని జిల్లా అటవీశాఖాధికారి ఎంవీ ప్రసాదరావు అన్నారు. మండలంలోని ఎస్‌.యానం తీర ప్రాంతంలో కొన్ని రోజులుగా తాబేళ్ల గుడ్లను భద్రపరచి ఉత్పత్తి అయిన పిల్లలను సముద్రంలోకి వదిలే ప్రక్రియను బుధవారం నిర్వహించారు. ఆయన విలేకర్లతో మాట్లాడుతూ కాట్రేనికోన మండలం కందికుప్ప, గచ్చకాయలపొర, ఉప్పలగుప్తం మండలం ఎస్‌.యానం, వాసాలతిప్ప సముద్ర తీర ప్రాంతాల్లో తాబేళ్ల స్థావరాలు ఏర్పాటుచేసి గుడ్ల నుంచి విడుదలయ్యే పిల్లలను సముద్రంలోకి విడుదల చేస్తామని తెలిపారు. జనవరి నెల నుంచి నేటికి 743 తాబేళ్లు ఉత్పత్తి చేసిన 74 వేల గుడ్లను సేకరించామని, వాటి నుంచి ఉత్పత్తి అయిన 12,500 పిల్లలను సముద్రంలోకి వదిలామని తెలిపారు. ఇవి సముద్రంలో నాచును, గడ్డిని తిని జీవిస్తాయని తెలిపారు. ఎఫ్‌ఆర్‌వో ఎన్‌ హరికుమార్‌, డీఆర్‌వో బి.నాగ సత్యనారాయణ, ఎఫ్‌బీవో ఎం.సత్యసాయిబాబా పాల్గొన్నారు.




 

Read also in:
Back to Top