కళారంగానికి సీఆర్‌సీ సేవలు ఎనలేనివి

- - Sakshi

రావులపాలెం: భారతీయ సంస్కృతి, సంప్రదాయాల్లో కళారంగానికి ఒక ప్రత్యేక స్థానం ఉందని అంతరించి పోతున్న కళలను, కళాకారులను ప్రోత్సహించేందుకు కాస్మోపాలిటన్‌ రిక్రియేషన్‌ క్లబ్‌(సీఆర్‌సీ) కాటన్‌ కళా పరిషత్‌ చేస్తున్న కృషి అభినందనీయం అని ప్రముఖ సినీనటుడు, సీఆర్‌సీ కాటన్‌ కళాపరిషత్‌ గౌరవ అధ్యక్షుడు తనికెళ్ళ భరణి, ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. బుధవారం రావులపాలెంలోని సీఆర్‌సీ కాటన్‌ కళాపరిషత్‌ ఆధ్వర్యంలో 23వ ఉగాది జాతీయ తెలుగు నాటికల పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్‌, కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి, ప్రముఖ రచయిత, సినీ నటుడు తనికెళ్ళ భరణితో పాటు సినీనటుడు కోట శంకరరావు, గౌతంరాజు, నైనా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం నాటిక పోటీలను ఎమ్మెల్యే జగ్గిరెడ్డి జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా జగ్గిరెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజలకు 23 వసంతాలుగా నాటికలతో ఆలోచన రేకేత్తిస్తున్న సీఆర్‌సీ సేవలు ప్రశంసనీయం అని కొనియాడారు.

కార్యక్రమంలో భాగంగా సీఆర్‌సీ కాటన్‌ కళాపరిషత్‌లో తల్లావఝుల సుందరం స్మారక పురస్కారాన్ని మల్లాది గోపాలకృష్ణకు తనికెళ్ళ భరణి అందజేశారు. సీఆర్‌సీ అధ్యక్షుడు తాడి నాగమోహనరెడ్డి, కార్యదర్శి కర్రి అశోక్‌రెడ్డి, నాటక కళాపరిషత్‌ డైరెక్టర్‌ కె.సూర్య, పరిషత్‌ పర్యవేక్షణ డైరెక్టర్‌ వెలగల సతీష్‌రెడ్డి, డైరెక్టర్లు సీహెచ్‌ గోపాలకృష్ణ, కొవ్వూరి నరేష్‌కుమార్‌రెడ్డి, పడాల సత్యనారాయణరెడ్డి, మల్లిడి ఆంజనేయరెడ్డి, చిర్ల కనికిరెడ్డి, పాల్గొన్నారు.

ఆలోచింపజేసిన నాటికలు

జాతీయ తెలుగు నాటికల పోటీల్లో భాగంగా మొదటిరోజు రెండు నాటికలను ప్రదర్శించారు. తెనాలి కళలు కణాచి వారి ‘అంధస్వరం’ నాటిక సందేశాత్మకంగా సాగింది. మృగం నుంచి మనిషి మానవరూపం దాల్చడానికి కొన్ని లక్షల సంవత్సరాలు పడితే, మానవరూపం దాల్చిన మనిషి మృగంగా మారడానికి ఒక్క క్షణం మాత్రమే పడుతుందని, సృష్టి, స్థితి, లయలు నిక్షిప్తమైన పవిత్ర దేవాలయం సీ్త్ర, ఆ దేవాలయానికి మృగాలకి మధ్య జరిగే సంఘర్షణే అంధస్వరం నాటికలో సందేశాత్మకంగా చెప్పారు. పొన్నూరు రసఝురి వారి ‘కాపలా’ నాటికలో ఇవాళ ప్రపంచం మొత్తం కాపలా నీడలో, భయం గుప్పిట్లో జీవిస్తోంది. ఈ కాపలాకు ఏ వ్యవస్థ మినహాయింపు కాదు, అంగవైకల్యం ఉన్నా తలెత్తుకుని జీవించవచ్చు, బుద్ధి వైకల్యం తలదించుకునేలా చేస్తుంది. మనిషి తన బుద్ధికి తనను కాపలా పెట్టుకుంటే ఇన్ని కాపలాలతో పనిలేదని చెప్పిన తీరు విశేషంగా ఆకట్టుకుంది.

జ్యోతి వెలిగించి నాటిక పోటీలను

ప్రారంభిస్తున్న ప్రభుత్వ విప్‌ జగ్గిరెడ్డి

నాటికను వీక్షిస్తున్న సినీనటులు తనికెళ్ల భరణి,

కోట శంకరరావు, గౌతంరాజు, నైనా తదితరులు

నటుడు తనికెళ్ళ భరణి, ప్రభుత్వ విప్‌ జగ్గిరెడ్డి

అట్టహాసంగా జాతీయ తెలుగు

నాటిక పోటీలు ప్రారంభం




 

Read also in:
Back to Top