గడచిన 8 రోజుల్లో జీజీహెచ్‌లో జ్వర బాధిత చిన్నారుల గణాంకాలు

- - Sakshi

14/3 – 49 మంది

15/3 – 55 మంది

16/3 – 52 మంది

17/3 – 79 మంది

18/3 – 81 మంది

19/3 – 89 మంది

20/3 – 88 మంది

21/3 – 96 మంది

తీవ్ర జ్వరానికి గురైన బాలుడిని పరీక్షిస్తున్న

అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ వెంకటేశ్వర్లు

కాకినాడ క్రైం: కోవిడ్‌ వైరస్‌ ప్రభావానికి గురైంది మొదలు వ్యక్తి శరీరంలో యావత్‌ జీవ వ్యవస్థ కంపించిపోయింది. శరీర వ్యవస్థాగత జీవ నిర్మాణంలో పెను మార్పులకు కారణమైంది. చిన్నారులపై కోవిడ్‌ వైరస్‌ ప్రభావం తక్కువగానే ఉన్నా, అనుబంధ మహమ్మారుల దాడి మాత్రం ఆందోళన కలిగిస్తోంది. ఆ కోవలోనివే తాజాగా తెరపైకి వచ్చిన జ్వరాలు. ఇప్పటికే ఈ జ్వరాలపై కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైరాలజీ విభాగం పరిశీలన మొదలు పెట్టింది.

అసాధారణ లక్షణాలు

నెల రోజులుగా కాకినాడ జీజీహెచ్‌ సహా చిన్న పిల్లల ప్రైవేటు ఆరోగ్య కేంద్రాల్లో చిన్నారుల ఓపీ గణనీయంగా పెరిగింది. 11–13 సంవత్సరాల వయసు మధ్య పిల్లలు తీవ్ర జ్వరాలకి గురవుతున్నారు. తీవ్ర జ్వరం, జలుబు, విపరీతమైన గొంతునొప్పి, వికారం, దగ్గు, ఆయాసం, వాంతులు, విరేచనాలు, ఒళ్లు నొప్పులు, కంట్లో నీరు, ఈ జ్వరం వచ్చినవారికి సాధారణ లక్షణాలు కాగా, ఐదేళ్లలోపు చిన్నారుల్లో అయితే ముక్కు, గొంతు నుంచి రక్తం కారడం తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తోంది. వైరల్‌ జ్వరంగా మొదలవుతున్న అనారోగ్యం బ్యాక్టీరియల్‌గా రూపాంతరం చెందుతుందని వైద్యులు చెబుతున్నారు. సెకండరీ బ్యాక్టీరియల్‌ ఇన్ఫెక్షన్‌గా వృద్ధ్ది చెంది తీవ్ర అనారోగ్యానికి దారి తీస్తుందని అంటున్నారు. వైరల్‌ జ్వరం సాధారణంగా 3–5 రోజుల మధ్య తగ్గిపోతే, బ్యాక్టీరియల్‌ ఇన్ఫెక్షన్ల వల్ల కలిగే జ్వరాలు తగ్గడానికి ఇన్ని రోజులనే నిర్ణీత వ్యవధి లేదు.

సాధారణ మందులకు లొంగక

సాధారణంగా పారాసిట్మాల్‌ సహా యాంటీబయాటిక్‌లు పిల్లల జ్వరాలు నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తుంటాయి. ఇప్పుడా పరిస్థితి లేదు. మందులెన్ని ఇస్తున్నా, ప్రయోజనం కానరావడం లేదు. వైరల్‌ జ్వరాలకు యాంటీ బయాటిక్స్‌ పనిచేయవని చెబుతున్న వైద్యులు గరిష్టంగా ఐదు రోజుల వ్యవధిలో కొనసాగే ఈ జ్వరాలకు లక్షణాల ఆధారంగా మాత్రమే మందులు సూచిస్తున్నామంటున్నారు. ఒక పరీక్షలో రెండు మూడు ఇన్ఫెక్షన్లు బయటపడుతున్న నేపథ్యంలో అవి వ్యాధికారక క్రీముల వల్ల సంభవించాయో లేదో గుర్తించడం కూడా కష్టమవుతోందని వైద్యులు ఆవేదన చెందుతున్నారు. వైరల్‌ దాడిలో ముక్కు, గొంతు, ఉదరం లోపలి సున్నిత పొరలు దెబ్బతింటాయని, ఫలితంగా ముక్కు, గొంతు నుంచి రక్తం కారే ఆస్కారం ఉందని అంటున్నారు.

ఒకరి నుంచి మరొకరికి...

తాజాగా తెరపైకి వచ్చిన ఈ జ్వరాలు, వాటి లక్షణాలు ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందుతూండడం ఆందోళన కలిగిస్తోంది. ఈ జ్వరాల్లో సాధారణ లక్షణాలు అయిన తుమ్మడం, దగ్గడం ద్వారా డ్రాప్‌ లెట్ల రూపంలో వైరస్‌ మరొకరికి సంక్రమిస్తుంది. పోస్టు కోవిడ్‌ బాధిత చిన్నారుల్లో వైరల్‌ ప్రభావం ఎక్కువగా ఉంటుందని జీజీహెచ్‌ చంటి పిల్లల వైద్య నిపుణుడు డాక్టర్‌ ఎం.వెంకటేశ్వర్లు తెలిపారు. పోషకాహార లోపం, రోగనిరోధక శఽక్తి లోపించిన వారు, సెకండరీ బ్యాక్టీరియల్‌ ఇన్ఫెక్షన్‌ బారిన పడే వారిలో తీవ్ర అనారోగ్యాలు సంభవిస్తున్నాయని అన్నారు. చిన్నారుల అనారోగ్యాన్ని గుర్తించేందుకు ఎప్పటిలాగే సాధారణ వైద్య పరీక్షలు జీజీహెచ్‌లో చేస్తున్నట్లు వీఆర్‌డీఎల్‌ ల్యాబ్‌ ప్రిన్సిపల్‌ ఎగ్జామినర్‌ డాక్టర్‌ డీఎస్‌ మూర్తి తెలిపారు. ప్రతి రోజు అనుమానిత లక్షణాలున్న కనీసం 10 మంది పిల్లల రక్త, మూత్ర, కళ్లె నమూనాలను ప్రత్యేకంగా పరీక్షిస్తున్నట్లు తెలిపారు.

పెరుగుతున్న కేసులు

కాకినాడ జీజీహెచ్‌లో సూపరింటెండెంట్‌ డాక్టర్‌ హేమలతాదేవి, పీడియాట్రిక్స్‌ హెచ్‌వోడీ డాక్టర్‌ ఎంఎస్‌ రాజు ఆధ్వర్యంలో చిన్నారులకు నిరాటకంగా వైద్య సేవలు అందుతున్నాయి. గడచిన నెల రోజుల వ్యవధిలో జ్వరంతో బాధపడుతూ ఆస్పత్రిలో చేరుతున్న వారి సంఖ్య పెరిగింది. పలు జిల్లాల నుంచి జీజీహెచ్‌కు వస్తున్న పిల్లలకు అత్యంత నాణ్యమైన వైద్య సదుపాయాలు అందించి రికవరీ చేస్తున్నట్లు హెచ్‌వోడీ డాక్టర్‌ ఎంఎస్‌ రాజు తెలిపారు.

కాకినాడ జీజీహెచ్‌లో వార్డుల్లో

చికిత్స పొందుతున్న చంటిపిల్లలు

చిన్నారులపై పెరుగుతున్న

వైరల్‌ దాడులు

పసిమొగ్గలను పట్టి పీడిస్తున్న వైనం

ప్రభావం చూపలేకపోతున్న

సాధారణ మందులు

ఆందోళన చెందుతున్న తల్లిదండ్రులు

జ్వరం తగ్గినా లక్షణాలు తగ్గవు

చాలామంది పిల్లల్లో జ్వరాలు తగ్గడానికి సమయం పడుతోంది. ఈ స్థితిని వైద్య పరిభాషలో క్రానిక్‌ ఫేటిగ్‌ సిండ్రోమ్‌ అంటారు. పొటాషియం అధికంగా ఉండే కొబ్బరి నీళ్ల వంటి ద్రవాలతో పాటు పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా నీరసం, అలసట నుంచి పిల్లల్ని దూరం చేయవచ్చు. వైరల్‌కు పారాసిట్మాల్‌ తప్ప మరే మందుల సిఫార్సు చేయదగ్గది కాదు. ఆవిరిపట్టడం, ద్రవాలు ఎక్కువగా తీసుకోవడం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం పిల్లలు త్వరగా కోలుకునేందుకు సహకరిస్తుంది. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో పీడియాట్రిక్స్‌ హెచ్‌వోడీ డాక్టర్‌ ఎంఎస్‌ రాజు ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య బృందాలు పనిచేస్తున్నాయి.

– డాక్టర్‌ వడ్డిపర్తి విజయభాస్కర్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్‌, రంగరాయ వైద్య కళాశాల




 

Read also in:
Back to Top