పకడ్బందీగా టెన్త్‌ పరీక్షలు

సమావేశంలో మాట్లాడుతున్న ఆర్‌జేడీ నాగమణి  - Sakshi

అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు

ఆర్‌జేడీ నాగమణి

ముమ్మిడివరం: వచ్చే నెల 3 నుంచి పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ రీజినల్‌ జాయింట్‌ డైరెక్టర్‌ (ఆర్‌జేడీ) జి.నాగమణి ఆదేశించారు. పదో తరగతి పరీక్షలకు నియమితులైన చీఫ్‌ సూపరింటెండెంట్లు, డిపార్టుమెంటల్‌ అధికారులకు ఎయిమ్స్‌ ఇంజినీరింగ్‌ కళాశాల సమావేశ మందిరంలో మంగళవారం ఓరియెంటేషన్‌ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆర్‌జేడీ నాగమణి మాట్లాడుతూ, పరీక్షల నిర్వహణలో ఎటువంటి అలసత్వం చూపినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఏ విషయాన్నీ ఆషామాషీగా తీసుకోవద్దన్నారు. ఈ ఏడాది పరీక్షల నిర్వహణలో ప్రత్యేక చర్యలు తీసుకున్నామని చెప్పారు. మాస్‌ కాపీయింగ్‌ నిరోధానికి, పేపర్ల లీకేజీని అరికట్టడానికి ప్రభుత్వం ప్రతి పరీక్ష పేపర్‌పై ఏడంకెల ప్రత్యేక నంబరు ముద్రిస్తుందన్నారు. పరీక్ష పేపర్లు స్వీకరించినప్పటి నుంచి నిర్వహణ పూర్తయి, తిరిగి డిపాజిట్‌ చేసే వరకూ ప్రతి అంశంలోనూ తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. జిల్లా విద్యాశాఖాధికారి ఎం.కమలకుమారి మాట్లాడుతూ, పదో తరగతి పరీక్షలకు జిల్లాలో 111 కేంద్రాలు ఏర్పాటు చేశామని, 20,968 మంది పరీక్షలు రాస్తున్నారని వివరించారు. ప్రభుత్వ పరీక్షల విభాగం అసిస్టెంట్‌ కమిషనర్‌ బొజ్జా రమణశ్రీ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో డీవైఈఓ సాలెంరాజు, డీఈఓ కార్యాలయ ఏడీ విజయలక్ష్మి, డీసీఈబీ సెక్రటరీ బి.హనుమంతరావు, సీఎంఓ బీవీవీ సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు.




 

Read also in:
Back to Top