30 నుంచి ర్యాలి జగన్మోహినీ కేశవస్వామి కల్యాణోత్సవాలు

సమావేశంలో మాట్లాడుతున్న 
అదనపు డీఎంహెచ్‌ఓ సుమలత  - Sakshi

ఆత్రేయపురం: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం ర్యాలి శ్రీ జగన్మోహినీ కేశవస్వామి ఆలయంలో ఈ నెల 30 నుంచి వారం రోజుల పాటు స్వామివారి కల్యాణోత్సవాలు జరగనున్నాయి. వీటిని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామని ఆలయ ఈఓ బి.కృష్ణ చైతన్య తెలిపారు. కల్యాణోత్సవాల ఆహ్వాన పత్రిక, వాల్‌పోస్టర్లను మంగళవారం స్వామి వారి పాదాల చెంతన ఉంచి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రభుత్వ విప్‌, కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి నివాసంలో వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఆయన చేతుల మీదుగా కల్యాణోత్సవాల ఆహ్వాన పత్రికను భక్తులకు అందజేశారు. ఈ సందర్భంగా స్వామి వారి ఆలయ అభివృద్ధికి గుంటూరుకు చెందిన డి.సత్యనారాయణ రూ.10 లక్షల విరాళం సమర్పించారు. ఆయనను ఈఓ ఆధ్వర్యాన జగ్గిరెడ్డి సత్కరించారు. కల్యాణోత్సవాలు ఘనంగా నిర్వహించాలని ఈఓను ఆదేశించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యుడు బోణం సాయిబాబు తదితరులు పాల్గొన్నారు.

వైఎస్సార్‌ కంటి వెలుగుతో దృష్టి సమస్యలకు చెక్‌

ఆలమూరు: వైఎస్సార్‌ కంటి వెలుగు కార్యక్రమం కింద ప్రతి నెలా 32 వేల మందికి కంటి పరీక్షలు నిర్వహిస్తున్నామని కొత్తపేట డివిజన్‌ అదనపు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ మెండు సుమలత తెలిపారు. చింతలూరులో మంగళవారం ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఆమె సందర్శించారు. పెదపళ్ల పీహెచ్‌సీ వైద్యాధికారి పి.భవానీ శంకర్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మాట్లాడుతూ, డివిజన్‌లోని 15 పీహెచ్‌సీల పరిధిలో అంధత్వ నివారణే ధ్యేయంగా దశల వారీగా కంటి వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి, దృష్టి లోపం ఉన్న వారిని గుర్తిస్తున్నామని చెప్పారు. అవసరమైన వారికి కళ్లజోళ్లు అందిస్తున్నామని, దృష్టి లోపం తీవ్రత ఉన్న వారికి శస్త్రచికిత్సలు చేస్తున్నామని చెప్పారు. ఈ నెలలో ఇప్పటి వరకూ 17,280 మందికి పరీక్షలు నిర్వహించామన్నారు. 1,851 మందికి కళ్లజోళ్లు పంపిణీ చేశామన్నారు. అవసరమైన వారికి కంటి శస్త్రచికిత్సలు చేయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. డివిజన్‌లో ఫీవర్‌ సర్వే చురుగ్గా జరుగుతోందని తెలిపారు. జ్వరం సోకిన రోగులు సత్వరమే సమీప ఆరోగ్య సిబ్బందిని సంప్రదించాలని సుమలత సూచించారు. అన్ని పీహెచ్‌సీల్లో మందులు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. కార్యక్రమంలో సీహెచ్‌ఓ పి.వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు.

‘మడ’కు ‘రవ్వ’ంత సాయం

మాంగ్రూవ్స్‌ పరిరక్షణపై జిల్లా అటవీ శాఖ ఎంఓయూ

కలెక్టర్‌ సమక్షంలో ఒప్పందం

సాక్షి, అమలాపురం: జిల్లాలో మడ అడవుల పరిరక్షణ, అభివృద్ధికి రవ్వ జాయింట్‌ వెంచర్‌ తరఫున వేదాంత లిమిటెడ్‌ – కెయిర్న్‌ ఆయిల్‌ – గ్యాస్‌ సంస్థ ప్రతినిధులు, జిల్లా అటవీ శాఖాధికారి మధ్య అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదిరింది. తన సమక్షంలో మంగళవారం ఈ ఎంఓయూ కుదిరిందని కలెక్టర్‌ హిమాన్షు శుక్లా తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తీర ప్రాంతాన్ని తుపానులు, వరదలు, కోత నుంచి కాపాడే మడ అడవుల అభివృద్ధికి ఇది దోహదపడుతుందని చెప్పారు. ఇందులో భాగంగా రాష్ట్ర అటవీ శాఖ ఆధ్వర్యాన సముద్ర, తీరప్రాంత జీవవైవిధ్య సంరక్షణ, అభివృద్ధి ఫౌండేషన్‌ ఏర్పాటు చేస్తారని తెలిపారు. వేదాంత లిమిటెడ్‌ – కెయిర్న్‌ ఆయిల్‌ – గ్యాస్‌ సంస్థ కార్పస్‌ ఫండ్‌గా కలెక్టర్‌, వేదాంత లిమిటెడ్‌ ఉమ్మడి ఖాతాలో సుమారు రూ.5 కోట్ల కార్పస్‌ ఫండ్‌ జమ చేస్తుందని పేర్కొన్నారు. దీనిపై వచ్చే వడ్డీతో 2024 నుంచి 2030 వరకూ 3 లక్షల మొక్కలతో మడ తోటల పెంపకం, సంరక్షణ, అభివృద్ధి, ఇతర జీవవైవిధ్య సంబంధిత అభివృద్ధి, తీరంలోని ప్రజల జీవనోపాధి వృద్ధికి దోహదపడే పనులను అటవీ శాఖ చేపడుతుందన్నారు. కాట్రేనికోన మండలం మగసానితిప్ప రిజర్వ్‌ అటవీ ప్రాంత సమీపాన మడ అడవులను పెంపకానికి 200 హెక్టార్ల భూమిని గుర్తించామని తెలిపారు. కార్యక్రమంలో రవ్వ జాయింట్‌ వెంచర్‌ తరఫున ఫీల్డ్‌ జనరల్‌ మేనేజర్‌ దినేష్‌ కుమార్‌, పర్యావరణ శాఖ సీనియర్‌ ఇంజినీర్‌ ఉదయ్‌కుమార్‌, సీఎస్‌ఆర్‌ మేనేజర్‌, జిల్లా అటవీ శాఖ అధికారి ఎంవీఎస్‌ ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు.




 

Read also in:
Back to Top